రవితేజ, నానీ, అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ లాంటి హీరోలు టాలీవుడ్లో డైరెక్టర్ కాబోయి…అనుకోని పరిస్థితుల్లో హీరోలు అయిపోయారు. అయితే వారిలో ఎవరు ఎప్పుడు దర్శకత్వం వహిస్తారన్నసంగతి పక్కనపెడితే.. నానీ మాత్రం తన తదుపరి చిత్రం కోసం తనలోని రైటర్‌ను నిద్రలేపే కార్యక్రమం పెట్టుకున్నాడట. డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన నానీ.. తన తదుపరి చిత్రం కోసం ఇన్నాళ్ళకు మళ్లీ పెన్ పట్టుకోనున్నాడట. దర్శకుడితో కలసి ఆ సినిమాకి స్క్రీన్ ప్లే రాయబోతున్నాడట.త్వరలో సెట్స్ మీదకు వెళ్ళనున్న తన తదుపరి చిత్రానికి నానీ స్క్రీన్ ప్లే రాయనున్నాడట.
నాని, విక్రమ్ కుమార్ కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుగుతోన్న ఈ మూవీ స్క్రీన్ ప్లేను విక్రమ్, నానీలు కలసి రాస్తున్నారట. మరి నానీకి విక్రమ్ కుమార్ టైటిల్స్‌లో స్క్రీన్ ప్లే క్రెడిట్ ఇస్తాడో లేదో తెలియదు కానీ, ఈ సంగతి టాలీవుడ్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి రావడం వల్లో ఏమోగానీ, నానీకి కథల్ని జడ్జ్ చేసే టాలెంట్ మాత్రం భలే అబ్బింది. ఒక సినిమా కథ రూపంలో ఉండగానే ఆ కథకు తాను ఎంతవరకూ పెర్ఫెక్ట్ అనే విషయం తెలుసుకోవడంలో దిట్ట. అందుకే విక్రమ్ కుమార్ చెప్పిన కథలో అవసరమైన మార్పుల్ని, చేర్పుల్ని తనే స్వయంగా స్క్రీన్ ప్లే రూపంలో కాగితం మీద పెడుతున్నాడేమో. నానీ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘జెర్సీ’ చిత్రంలో క్రికెటర్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే విక్రమ్ కుమార్ చిత్రం సెట్స్ మీదకు వెళ్లబోతోందట.