వెంకట్ బోయనపల్లి సమర్పణలో షైన్ స్క్రీన్స్ పతాకంపై నాని ద్విపాత్రాభినయం చేసిన సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’. అనుపమ పరవేుశ్వరన్, రుక్సర్ మీర్ హీరోయిన్స్. మేర్లపాక గాంధీ దర్శకుడు. సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మాతలు. సినిమా ఏప్రిల్ 12న విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరో నాని ఇంటర్వ్యూ…
రెండు పాత్రలు ఒకే ఫ్రేమ్‌లో …
– సాధారణంగా మన తెలుగు సినిమాల్లో హీరో ద్విపాత్రాభినయం చేసినప్పుడు రెండు పాత్రలు కలుసుకునే సన్నివేశాలు ఒకటో.. రెండో ఉంటాయి. కానీ `కృష్ణార్జున యుద్ధం`లో రెండు పాత్రలు ఒకే ఫ్రేమ్‌లో సగానికి పైగానే కనపడతాయి. రెండు పాత్రలు దేనికవే భిన్నంగా ఉంటాయి. కృష్ణ చిత్తూరుకి చెందిన అబ్బాయి. ఇలాంటి క్యారెక్టర్ మన అందరిలో ఉంటుంది. ఇక అర్జున్ రాక్ స్టార్. హలో బ్రదర్ తరహా టిపికల్ కమర్షియల్ సినిమాలను తెలుగు ప్రేక్షకులు చూసుంటారు. కానీ కృష్ణార్జున యుద్ధం డిఫరెంట్‌గా ఉంటుంది. కృష్ణ, అర్జున్‌లు కవలలు కారు. రివేంజ్ ఫార్ములా ఉండదు. ఇద్దరి వెనుక బ్యాక్‌స్టోరీస్ కనపడవు. ఇద్దరూ ఒకేలా కనపడతారంతే. ఇందులో లాజిక్ కనపడుతుంది. ఇద్దరి మధ్య జరిగే యుద్ధం.. ఇద్దరూ కలిసి చేసే యుద్ధమే ఈ సినిమా. కృష్ణ, అర్జున్ అనే రెండు క్యారెక్టర్స్‌లో కృష్ణ పాత్ర ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అవుతుందని నా పర్సనల్ ఓపినియన్.
స్క్రిప్ట్ అంతా చిత్తూరు యాసలోనే….
– ఒకప్పుడు మన తెలుగు సినిమాల్లో విలన్స్ తెలంగాణ యాస మాట్లాడేవారు. అది కూడా ప్రాపర్ తెలంగాణ కాదు. నేను హైదరాబాద్‌లోనే పెరిగాను. నాకు చాలా మంది తెలంగాణ స్నేహితులున్నారు. అయితే..వాళ్ల నుండి పక్కా తెలంగాణ యాస ఎలా ఉంటుందో తెలుసుకున్నాను. నేను రేపు యాక్టర్‌ని అయితే మన భాషను మనం తక్కువ చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను. ఇక ఈ సినిమా స్క్రిప్ట్‌తో మేర్లపాక గాంధీ నా దగ్గరకి వచ్చినప్పుడు స్క్రిప్ట్ అంతా చిత్తూరు యాసలోనే రాసుకుని వచ్చాడు. గాంధీ, సినిమాలో నటించిన మహేశ్ ఇద్దరూ చిత్తూరు జిల్లాకు చెందినవాళ్లే. రెండు రోజులు యాసలో పలకడం కష్టంగా అనిపించినా? తర్వాత ఓకే అయిపోయాను.
మానిటర్‌లో చూస్తే చాలా గొప్పగా అనిపిస్తుంది
అనుపమ పరమేశ్వరన్ చాలా మంచి పెర్ఫామర్. తనకి కెమెరాతో మ్యాజికల్ కెమిస్ట్రీ ఉంటుంది. ఆమెతో నటిస్తున్నప్పుడు నార్మల్‌గానే అనిపిస్తుంది. అదే మానిటర్‌లో చూస్తే చాలా గొప్పగా అనిపిస్తుంది. చాలా కొద్ది మంది మాత్రమే అలా కనిపిస్తారు. ఇక రుక్సర్ మీర్ డేడికేషన్ ఉన్న హీరోయిన్. తెలుగు ఉచ్చారణను నేర్చుకుని డైలాగ్స్ చెప్పింది. తనకి మంచి భవిష్యత్ ఉంది.
`ధృవ`కు చాలా మంచి సంగీతాన్ని అందించాడు
-హిప్ హాప్ తమిజ సంగీతం అందించిన తమిళ పాటలు విన్నాను. అలాగే `ధృవ` సినిమాకు తను చాలా మంచి సంగీతాన్ని అందించాడు. ఇక ఈ సినిమాలో తనని మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకోవాలనే నిర్ణయం మేర్లపాక గాంధీదే.
నా తప్పులను క్షమించేస్తున్నారు
– ప్రేక్షకులకు నేనంటే ఎక్కడో సాఫ్ట్ కార్నర్ ఉందండి. నా తప్పులను వాళ్ళు క్షమించేస్తున్నారు. నాపై ఎక్కడో ప్రేమ ఉంది.
మన బిజినెస్‌ను బట్టి పెరుగుతుంది
– నేను సాధారణంగా కీడెంచి మేలెంచే మనస్థత్వం ఉన్నవాడ్ని. ఉదాహరణకు నా దగ్గరున్న కారుని అమ్మేయాల్సి వచ్చిందనుకోండి. నా హోండా బైక్ ఉందిగా అనుకుంటాను. ఈరోజు నేను హిట్ సినిమా చేసినప్పుడు హిట్ అని పొగిడేవాడు… రేపు ప్లాప్ అయితే ఏమంటాడో అని ఆలోచిస్తాను. వరుస సక్సెస్‌లు రావడం అనేది పర్మినెంట్ కాదనే క్లారిటీ నాకు ఉంది. రెమ్యునరేషన్ పెరగడం అనేది మన ప్రమేయం లేకుండా మన బిజినెస్‌ను బట్టి పెరుగుతుంది. రేపు మన సినిమాలు ఆడలేదు అనుకోండి.. రెమ్యునరేషన్ ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది. నేనైతే రెమ్యునరేషన్ పెరిగిందా? అని కాకుండా పెర్ఫామెన్స్ పెరిగిందా? అని ఆలోచిస్తాను. పెర్ఫామెన్స్ బాగోలేకపోతే డిసప్పాయింట్ అవుతాను.
నా బ్యానర్‌లో నేను హీరోగా చేయను
– వాల్‌పోస్టర్ సినిమా బ్యానర్‌లో వచ్చిన `అ!` సినిమాకు విమర్శకుల ప్రశంసలను అందుకోవడమే కాదు.. మంచి నిర్మాతగా నాకు పేరుని తెచ్చిపెట్టింది. నేను నా బ్యానర్‌లో తదుపరి మరో కొత్త దర్శకుడిని పరిచయం చేస్తాను. అసలు బ్యానర్ పెట్టిన కారణమదే. కొన్ని సంవత్సరాలు తర్వాత వాల్ పోస్టర్ సినిమా ఇండస్ట్రీకి మంచి దర్శకులను ఇచ్చిందిరా అనుకోవాలి. ఎందుకంటే.. యూజ్‌లెస్ ఫెలో అనే దగ్గర నుండి ఇంతటి వాడిని చేసిన ఇండస్ట్రీకి నేనెదైతే ఇవ్వగలిగితే అదే చాలు. ఒకే దర్శకుడితో సినిమా చేయాలనుకోవడం లేదు. నేనే హీరోగా నా బ్యానర్‌లో సినిమా చేసుకుంటే చాలా లాభాలుంటాయి. కానీ నా బ్యానర్‌లో నేను హీరోగా సినిమా చేయను. చాలా మంది కొత్త దర్శకులు అప్రోచ్ అవుతున్నారు. నా సినిమాలతో బిజీగా ఉన్నాను. ఐదు పదినిమిషాల స్టోరీలో ఏదైనా కొత్తగా ఉందనిపిస్తే.. పూర్తి కథ వింటాను.
మంచి సినిమాల కారణంగా థియేటర్స్‌కు వస్తున్నారు
-నా సినిమాలు ఇంత బిబినెస్ చేస్తుంది.. అంత బిజినెస్ చేస్తుందనే లెక్కలు నాకు తెలియవు. అయితే ఈ సమ్మర్‌లో కమర్షియల్ సినిమాను ఎంజాయ్ చేయాలనుకునే ప్రేక్షకులు `కృష్ణార్జున యుద్ధం` చాలా మంచి సినిమా అవుతుంది. సినిమా ఫస్ట్ కాపీ చూశాం. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. తర్వాత వారం `భరత్ అనే నేను` విడుదలవుతుంది. ఆ సినిమా ట్రైలర్ నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. నేను కూడా ఆ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను. అన్ని సినిమాలు బాగా ఆడాలి. మంచి సినిమాలు వస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. బాహుబలి తర్వాత ఎన్ని సినిమాలకు అడ్వాంటేజ్ మారిందో తెలిసిందే కదా! థియేటర్‌కు వెళ్లడం అనే అలవాటు తగ్గిపోతున్న తరుణంలో మంచి సినిమాల కారణంగా ఆడియెన్స్ థియేటర్స్‌కు వస్తున్నారు. `రంగస్థలం` సక్సెస్ కావడం చాలా సంతోషంగా ఉంది. రేపు `భరత్ అనే నేను` కూడా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను.
ఐదారు స్క్రిప్ట్స్ లైన్‌లో….
మల్టీస్టారర్ తర్వాత … ఐదారు స్క్రిప్ట్స్ లైన్‌లో ఉన్నాయి. అందులో ఏది ముందుగా స్టార్ట్ అవుతుందో తెలియదు.