సినీవినోదం రేటింగ్ : 3/5
డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శివ నిర్వాణ దర్శకత్వంలో దానయ్య డి.వి.వి ఈ చిత్రాన్ని నిర్మించారు .
ఉమా మహేశ్వరరావు (నాని), వైజాగ్ ఆంధ్రయూనివర్సిటీలో పి.హెచ్.డీ చేసే అనాథ కుర్రాడు. ప్రొఫెసర్ మూర్తి సాయంతో చదువుకునే ఉమా గీతమ్స్ కాలేజ్ లో చదువుకునే పల్లవి(నివేదా థామస్) తో ప్రేమలో పడతాడు. పల్లవి ఇంట్లోనే పెంట్ హౌస్ లో అద్దెకు దిగుతాడు. అదే సమయంలో పల్లవి తండ్రి(మురళీ శర్మ) “జీవితంలో సెటిల్ అవ్వని వాళ్లకు ఏ తండ్రీ తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయను ” అని చెప్పిన మాటలతో.. ఎలాగైనా జీవితంలో సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకుందామని పల్లవిని ఓప్పించే ప్రయత్నం చేస్తాడు. తాను చెప్పేది ఆమె వినే స్థితిలో లేకపోయేసరికి తన పిహెచ్ డీ కోసం ఢిల్లీ వెళ్లిపోతాడు. పల్లవి తన పేరెంట్స్ చూసిన అరుణ్ (ఆది పినిశెట్టి)ని పెళ్లి చేసుకొని అమెరికా లో సెటిల్ అవుతుంది. గతం అంతా మరిచిపోయి హాయిగా జీవిస్తున్న పల్లవి జీవితంలోకి ఉమా మహేశ్వరరావు మళ్ళీ వెళ్తాడు. పల్లవికి, ఉమా మహేశ్వరరావుకి మధ్య ఏం జరిగింది? అరుణ్తో పల్లవి కాపురం సజావుగా సాగిందా? …. అన్నవి సినిమాలో చూడాలి
‘నిన్ను కోరి’ ప్రస్తుత కాలానికి, జనరేషన్ కు తగిన మెచ్యూర్డ్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు.కథ పరంగా ఇందులో పెద్దగా చెప్పుకోవడానికి కొత్తగా ఏమీ లేదు. నెమ్మదైన స్క్రీన్ ప్లే, పరిణితితో ఆలోచించి అర్థం చేసుకోవలసిన కథ . తొలి సినిమా దర్శకుడు శివ నిర్వాణ సినిమాను నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. రెగ్యులర్ ట్రయాంగిల్ లవ్ స్టోరిని మూడు గంటలపాటు కదలకుండా కూర్చో బెట్టే ఎమోషనల్ జర్నీగా మార్చటంలో శివ సక్సెస్ సాధించాడు. ఈ సినిమాకు సహ నిర్మాతగాను వ్యవహరించిన కోన వెంకట్ అందించిన స్క్రీన్ ప్లే సినిమా స్థాయిని పెంచింది. దర్శకుడు శివతో కలిసి కోన అందించిన మాటలు సినిమాకు మరో ఎసెట్.
“గతం లో తను ప్రేమించిన వాడి గురించి భర్తకు చెప్పి, మాజీ ప్రియుడి క్షేమాన్ని కాంక్షించి, భర్త అనుమతి తో తన ఇంటికే అతన్ని ఆహ్వానించడం” అనేది ఇందులో కొత్త పాయింట్. అయితే ఈ విషయాన్ని మొదట కాస్త సీరియస్గా చెప్పాలనుకున్నాడు దర్శకుడు.. ఒక వేళ `నీకు మా సంసారం బావుందనిపిస్తే మంచి వాడిగా మారాలి` అని నివేదా అంటే.. `ఒకవేళ నువ్వు హ్యాపీగా లేవని, నీ మనసులో నేనే ఉన్నానని తెలిస్తే నువ్వు నాతో వచ్చేయాలి` అని నాని అంటాడు. దాంతో కథ సీరియస్గా ఉందనిపిస్తుంది. కానీ మధ్యలో కామెడీ చోటుచేసుకుంటుంది. మరలా సీరియస్గా అనిపిస్తుంది.. ఇలా గ్రాఫ్ కాస్త అటూ ఇటూ పడుతూ లేస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది. సెకండాఫ్ ఇంకాస్త గ్రిప్పింగ్గా ఉంటే బావుండేది. సినిమా మొత్తం ఫస్టాఫ్ గాని, సెకండాఫ్ గాని బాగా గుర్తుండిపోయే సన్నివేశాలు లేకుండా ఫ్లాట్ గా వెళ్లిపోవడంతో ఎక్కడా పెద్దగా ఎగ్జైట్మెంట్ కలగలేదు.దర్శకుడు క్లైమాక్స్ హడావిడిగా ముగించినట్టుగా అనిపించింది.మొత్తానికి “జీవితం చాలా గొప్పది.. ఎక్కడికక్కడ ఎవరూ ఆగకూడదు. ఎదురైన అంశాలను స్వాగతిస్తూ, భవిష్యత్తుకు ఎప్పుడూ ఓ అవకాశం ఇచ్చి చూడాలి” అని చెప్పేఈ చిత్రంలోని ప్రధాన అంశం కుటుంబ ప్రేక్షకులకు నచ్చుతుంది.
నాని నటుడిగా మరోసారి తన స్థాయిని ప్రూవ్ చేసుకున్నాడు. అల్లరి సీన్స్ లో నవ్వించిన నాని, చాలా సీన్స్ లో ప్రేక్షకులను కదిలించాడు .అక్కడక్కడా మంచి టైమింగ్ తో పంచులు వేస్తూ ఎంటర్టైన్ చేసిన నాని, సెకండాఫ్ ఎమోషనల్ సీన్లలో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ను కనబర్చాడు. అంతేగాక ప్రేమించిన అమ్మాయి వేరొకరిని పెళ్లి చేసుకున్నా… ఎలాగోలా తిరిగి తనకు దక్కకపోతుందా? అనే చిన్న ఆశను, స్వార్థాన్ని కలిగిన ప్రేమికుడిగా ఆకట్టుకున్నాడు .హీరోయిన్ నివేదితా థామస్ “తనకు దూరమైన ప్రేమికుడు నాశనమైపోకూడద”ని తపనపడే ప్రేయసిగా, “తాను పెళ్లి చేసుకున్న వ్యక్తిని నోప్పించకూడదు” అని ఆలోచించే భార్యగా తన నటనతో ఆకట్టుకుంది. ఇక మరొక ముఖ్యమైన పాత్ర చేసిన ఆది పాత్ర కు తగ్గట్టు సహజంగా నటించాడు. ఈ ముగ్గురు తమ సహజమైన నటనతో కథను ప్రేక్షకులకు కనెక్టయ్యేలా చేశారు. అలాగే హీరోయిన్ తండ్రి పాత్ర చేసిన మురళి శర్మ, అతని అల్లుడిగా నటించిన పృథ్విలు మధ్య మధ్యలో నవ్విస్తూ అలరించారు.
కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ చిత్రానికి ఫ్రెష్ ఫీల్ తీసుకొచ్చింది. వైజాగ్ , అమెరికా పరిసరాల్ని చాలా అందంగా చూపించాడు. సినిమాకు రిచ్ నెస్ తీసుకొచ్చాడు. గోపి సుందర్ సంగీతం సందర్భానుసారం బాగుందనిపించింది. రీ రికార్డింగ్ అమెరికా నేపధ్యానికి తగ్గట్టుగా ఉంది . ప్రవీణ్ పూడి ఎడిటింగ్ సినిమాను సహజం గా నడిపించింది . నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచేవిగా ఉన్నాయి -రాజేష్