కల్యాణ్‌రామ్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘నా నువ్వే’. తమన్నా నాయిక. జయేంద్ర దర్శకత్వం వహించారు. కిరణ్ ముప్పవరపు, విజయ్ కుమార్ వట్టికూటి, మహేష్ కోనేరు నిర్మాతలు. ఈనెల 14న విడుదల కానుంది. సోమవారం రాత్రి హైదరాబాద్‌లో విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్టీఆర్ మాట్లాడుతూ ‘‘కల్యాణ్‌రామ్ అన్నని చూస్తుంటే మూడేళ్ల క్రితం నేను పడిన టెన్షన్ గుర్తొస్తోంది. ‘నాన్నకు ప్రేమతో’ విడుదల సమయంతో నేనూ ఇంతే ఒత్తిడితో ఉన్నా. ఒకే తరహా పాత్రలు చేసుకుంటూ వెళ్లిపోతే.. నటులకు, అభిమానులకూ సంతృప్తి ఉండదు. ‘బాగా నటించాడ్రా..’ అని అభిమానులు అనుకోవాలి. వాళ్ల కరతాళ ధ్వనులే ముఖ్యం. కొత్త పాత్రలు చేస్తున్నప్పుడు ఇలాంటి ఒత్తిడి సర్వసాధారణం. ప్రేక్షకులకు చాలా పెద్ద హృదయం ఉంది. నిజాయతీతో కష్టపడితే.. ఆ కష్టాన్ని గుర్తించి పెద్దపీట వేయడం వాళ్లకు కొత్త కాదు. ఆ కోవకి చెందిన చిత్రాల్లో ‘నా నువ్వే’ చేరుతుంది. కల్యాణ్ అన్న మాటల్లో ఈ సినిమాపై నమ్మకం కనిపిస్తోంది. అన్నయ్య పడిన కష్టానికి తప్పకుండా మంచి ఫలితం వస్తుంది. నటుల్ని కొత్తగా చూపించడానికి దర్శకుడికి చాలా దమ్ము కావాలి. అలాంటి సాహసం చేశారు జయేంద్ర. మా అన్నయ్యపై నమ్మకంతో ఇది వరకెప్పుడూ చూడని పాత్రలో తీర్చిదిద్దారు. సంగీత దర్శకుడు శరత్‌గారి గురించి చాలా విన్నా. తన సంగీతంతో ఈ సినిమాకి మూలస్థంభంగా నిలిచారు. పీసీ శ్రీరామ్ ఈ చిత్రాన్ని చక్కగా మలిచారు. కల్యాణ్ అన్న చిత్రాల్లో ఇది మైలు రాయిగా మిగలాలి. ప్రయోగాలు విజయవంతం అయితే మరిన్ని కొత్త ప్రయత్నాలు జరుగుతాయి. అలాంటి ఉత్సాహం ఈ సినిమాతో అన్నయ్యకు దక్కాల’’న్నారు.
కల్యాణ్‌రామ్ మాట్లాడుతూ ‘‘ఈ పాటలు రోజూ వింటున్నా. నా కెరీర్‌లోని మంచి ఆల్బమ్స్‌లో ఇదొకటి. జయేంద్రగారు ఈ కథ చెప్పినప్పుడు.. ‘ఈ పాత్రకు నేను ఎలా సరిపోతానని అనుకున్నారు’ అని అడిగాను. ఎందుకంటే నేను కమర్షియల్ సినిమాలే చేశాను. ఇలాంటి పూర్తిస్థాయి ప్రేమకథ నేను చేయలేదు. ‘మీరు చేస్తే.. ప్రేక్షకులకు కొత్తగా ఉంటుంది’ అన్నారు. అందుకే ఈ సినిమా ఒప్పుకున్నా. పీసీ శ్రీరామ్ లాంటివాళ్లతో పనిచేయడం ఓ గౌరవం. మా నిర్మాతలు ఖర్చుకి వెనుకంజ వేయలేదు. చాలా యేళ్ల నుంచి కొత్తగా ఏదో చేద్దామన్న ప్రయత్నంతో ఉన్నా. అభిమానులు నన్ను ఆదరిస్తున్నారు. ‘నా నువ్వే’లాంటి చిత్రాన్నీ ప్రేక్షకులు అక్కున చేర్చుకుంటారని నమ్మకం ఉంది. ‘నాన్నకు ప్రేమతో’లో తారక్ తన గెటప్‌లో చాలా మార్పు చూపించాడు. తను ఇచ్చిన స్ఫూర్తితోనే నా లుక్ కూడా మార్చాను’’ అన్నారు.
సంగీత దర్శకుడు శరత్ మాట్లాడుతూ ‘‘జయేంద్ర నిజాయతీ పరుడు. ఆయన నా నుంచి మంచి బాణీల్ని రాబట్టార’’న్నారు.
దర్శకుడు మాట్లాడుతూ ‘‘లాస్ ఏంజెల్స్‌లో నిర్మాతలు ఈ కథ ఓకే చేశారు. కల్యాణ్‌గారికి విన్న వెంటనే నచ్చింది. నాపై ఆయన నమ్మకం ఉంచారు. ఇప్పటి వరకూ యాక్షన్ సినిమలే చేశారు కల్యాణ్. తొలిసారి రొమాంటిక్ సినిమా చేస్తున్నారు. కల్యాణ్ ఎంత రొమాంటిక్ కథానాయకుడో ఈ సినిమాతో తెలుస్తుంది. తమన్నా తన పాత్రని చక్కగా నిర్వర్తించింది. పాటలు ఇప్పటికే శ్రోతలకు నచ్చాయి. ఇది కేవలం ప్రేమకథ కాదు. చాలా విషయాలున్నాయి’’ అన్నారు.
నిర్మాతల్లో ఒకరైన మహేష్ కోనేరు మాట్లాడుతూ ‘‘ఇదే నా తొలి చిత్రం. ఓ కొత్త కల్యాణ్‌రామ్ కనిపిస్తారు. మాస్ కథానాయకుడిగా మార్క్ తెచ్చుకున్న కల్యాణ్‌రామ్.. ఈ సినిమాతో క్లాస్ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతా’’న్నారు. ఈ కార్యక్రమంలో అనంత శ్రీరాం, విజయ్ చిల్లా, పీడీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.