సినీ నటుడు, టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ(61) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. నల్గొండ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తుండగా అన్నేపర్తి దగ్గర డివైడర్‌ను ఢికొట్టిన కారు పల్టీలు కొడుతూ రోడ్డు పక్కకు పడిపోయింది. దీంతో కారులోంచి బయటకు పడిపోయిన హరికృష్ణకు తలకు, శరీరానికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికి హరికృష్ణను స్థానికులు నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. వెంటనే స్పందించిన వైద్యులు చికిత్స అందించేందుకు ప్రయత్నించినా.. ఆయన శరీరం సహకరించకపోవడంతో కన్నుమూశారు. సీటు బెల్టు పెట్టుకోకపోవడం… అత్యంత వేగంగా వాహనాన్ని నడపడం … ఆ సమయం తెల్లవారుజాము కావడం ఇవే.. రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ మృతికి కారణాలని పోలీసులు చెప్తున్నారు.
గతంలో హరికృష్ణ పెద్ద కుమారుడు నందమూరి జానకి రామ్ నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. 2009 ఎన్నికల ప్రచారానికి వెళ్లి వస్తూ జూనియర్ ఎన్టీఆర్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అదృష్టవశాత్తూ ఎన్టీఆర్ ప్రాణాలు దక్కాయి. అప్పట్లో ఎన్టీఆర్‌కు రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే జానకి రామ్ కారు ప్రమాదానికి గురి అయింది. ఇప్పడు హరికృష్ణకు కూడా అదే జిల్లాలో ప్రమాదం జరిగింది.
నందమూరి హరికృష్ణ మృతితో అబిడ్స్‌లోని ఆహ్వానం హోటల్ పరిసర ప్రాంతాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాంప్లెక్స్‌లోని థియేటర్, పలు షాపులు మూసివేసి ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. థియేటర్, హోటల్ బాధ్యతలను చూసుకునే రోజుల్లో ఎక్కువ సమయం ఇక్కడే గడిపేవారని.. అక్కడ పని చేసే వారు గుర్తు చేసుకున్నారు. ఆయన అకాల మృతితో తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.
‘ఎవరి మాటా వినడు సీతయ్య’
నందమూరి హరికృష్ణ చిత్రసీమలోనూ తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పర్చుకున్నారు. ఎన్టీఆర్ వారసుడిగా బాలనటుడిగా రంగప్రవేశం చేసిన ఆయన హీరోగా, నిర్మాతగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు పాత్రలు పోషించారు. బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నందిఅవార్ట్ కూడా అందుకున్నారు. ‘ఎవరి మాటా వినడు సీతయ్య’ అంటూ ప్రేక్షకులను అలరించిన ఆయన బాల నటుడిగా సినీ రంగ ప్రవేశం చేసారు.
‘శ్రీకృష్ణావతారం’ సినిమాతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. కమలాకర కామేశ్వర రావ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం1964లో విడుదలైంది. ఈ చిత్రంలో హరికృష్ణ చిన్ని కృష్ణుని పాత్రలో కనిపించారు. తరువాత వచ్చిన ‘తల్లా పెళ్లమా’ చిత్రంలో కూడా బాల నటుడిగా కనిపించారు.
బాల నటుడిగా అలరించిన హరికృష్ణ అనంతరం ‘తాతమ్మ కల’, ‘రామ్ రహీమ్’ చిత్రాల్లో సోదరుడు బాలకృష్ణతో కలిసి నటించారు. ఈ రెండు చిత్రాలు 1974లో విడుదలయ్యాయి. ఆ తర్వాత 1977లో వచ్చిన ‘దానవీరశూరకర్ణ’ చిత్రంలో అర్జునుడి పాత్రలో కనిపించారు. ‘తాతమ్మ కల’, ‘దానవీరశూరకర్ణ’ చిత్రంలో సోదరుడు బాలకృష్ణతో పాటు తండ్రి ఎన్‌టీఆర్ కూడా ఉండటం విశేషం. 1977 తర్వాత హరికృష్ణ మరే చిత్రంలో నటించలేదు. 1980 సమయంలో ఎన్‌టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించడంతో.. హరికృష్ణ ఆయన వెంటే నడిచారు. ఎన్టీఆర్ ప్రచార వాహనం చైతన్య రథాన్ని హరికృష్ణ నడిపించారు
అసంతృప్తి వ్యక్తం చేసేవారు
తండ్రి ఎన్‌టీ రామారావు చైతన్య రథ సారథిగా టీడీపీ శ్రేణులతో పార్టీ ఆవిర్భావం నుంచి సన్నిహిత సంబంధాలు కలిగిన నందమూరి హరికృష్ణ రాజకీయాల్లోనూ తనదైన శైలిలో రాణించారు. ఆగస్టు సంక్షోభం నేపథ్యంలో చంద్రబాబు పార్టీ పగ్గాలను, సీఎం పీఠాన్ని అధిరోహించడాన్ని వ్యతిరేకిస్తూ హరికృష్ణ అన్నా టీడీపీని స్ధాపించారు. అనంతర పరిణామాలతో తిరిగి చంద్రబాబు గూటికి చేరిన హరికృష్ణ 1995లో బాబు క్యాబినెట్‌లో రవాణా మంత్రిగా వ్యవహరించారు.
2008లో రాజ్యసభకు ఎన్నికైన హరికృష్ణ రాష్ట్ర విభజన తీరును నిరసిస్తూ 2013 ఆగస్ట్ 4న రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. రాజ్యసభ సభ్యత్వానికి తన రాజీనామాను పట్టుపట్టి మరీ ఆయన ఆమోదింపచేసుకున్నారు. ప్రస్తుతం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్న హరికృష్ణ ముక్కుసూటిగా మాట్లాడటం, పలు సందర్భాల్లో పార్టీ అధినేత చంద్రబాబుపై ప్రత్యక్షంగా, పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి.పార్టీలో తనకు, తన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్‌కు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని తరచూ అసంతృప్తి వ్యక్తం చేసేవారు. మహానాడులో పాల్గొనడం కన్నా, ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించడమే తనకు ముఖ్యమని గతంలో హరికృష్ణ వ్యాఖ్యానించారు.