యువ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘మహానటి సావిత్రి జీవిత చరిత్ర’ తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈచిత్రంలో సావిత్రిగా నటి కీర్తీసురేశ్ నటిస్తున్నారు. జెమినీగణేశన్‌గా మాలీవుడ్ యువ నటుడు దుల్కర్సల్మాన్ నటిస్తుండగా ఒక ప్రత్యేక పాత్రలో చెన్నై చిన్నది సమంత నటిస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికే సెట్‌పైకి వెళ్లింది. అభినేత్రి సావిత్రి చరమ దశలో ఉన్నప్పుడు, కన్నుమూసిన తరువాత ఆమె గురించి చాలా కథనాలు వెలువడ్డాయి. మరణానికి ముందు చాలా ఆర్థికసమస్యలను ఎదుర్కొన్నారని రాసారు.సావిత్రి మరణించడానికి ముందు ఆమె ఫొటోలు కొన్ని పత్రికల్లో ప్రచురితమయ్యాయి.
వాటి విషయమై సావిత్రి కూతురు విజయచాముండేశ్వరి మండిపడ్డారు….. తన తల్లి ఆర్థికసమస్యలతో ఎప్పుడూ కష్టపడలేదన్నారు. రెండు తరాలు సుఖ సంతోషాలతో జీవించేలా తమకు ఆస్తులను ఇచ్చారని తెలిపారు.తన తల్లి మధుమేహ వ్యాధికి గురయ్యారని అన్నారు. అయితే తన భర్త జెమినీగణేశన్ చివరి వరకూ సావిత్రిని బాగానే చూసుకున్నారని చెప్పారు. తన తల్లి జీవిత చరిత్రతో తెరకెక్కిస్తున్న చిత్రంలో నిజాలే చూపించాలని, స్క్రిప్ట్ మాకు చూపించి ఆమోదం పొందిన తరువాతే షూటింగ్ జరపాలని దర్శక నిర్మాతలకు షరతులు విధించినట్లు, అందుకు వారు అంగీకరించినట్లు – నటి సావిత్రి కూతురు విజయచాముండేశ్వరి చెప్పినట్లు తమిళపత్రికలు పేర్కొన్నాయి.
చక్రపాణిగా చిత్రీకరణలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్
అలనాటి నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘మహానటి’. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తి సురేశ్ టైటిల్ రోల్ పోషిస్తుంది. సమంత కీలక పాత్రలో కనిపించనున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మొదట సావిత్రి చిత్రంలో టైటిల్ రోల్ ఎవరు చేస్తారన్న సస్పెన్స్‌కు కొన్నాళ్ల తర్వాత తెరదించారు. తర్వాత సావిత్రి చాలా మంది స్టార్స్‌తో నటించింది కదా అసలు ఈ సినిమాలో ఎంతమంది నటుల పాత్రలకు ప్రాధాన్యమిస్తున్నారన్న కూడా చర్చజరిగింది. ఇటీవల జెమిని గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అప్పటికే ఆయన చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. ఈ పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేశారు.సావిత్రి జీవితంలో అల్లురి చక్రపాణి కూడా ముఖ్యమైన పాత్రనే పోషించారు. తెలుగు, తమిళ్ భాషా రచయిత, నిర్మాత, దర్శకుడు కూడా. ప్రధానంగా ఈయన తెలుగు సినిమాలకు ఎక్కువగా పని చేసిన వ్యక్తి. అప్పట్లో ఆసియాలోనే పెద్ద వాటిల్లో ఒకటైన విజయ ప్రొడక్షన్ వారి విజయ వాహిని స్టూడియోస్‌లో ఈయనొక భాగస్వామి కూడా. అంత ప్రసిద్ధ చెందిన వ్యక్తి క్యారెక్టర్‌ను ఎవరు పోషిస్తారన్నది ఇప్పటి వరకూ తెలియలేదు. చక్రపాణిగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ఆదివారం నుంచే ఆయన చిత్రీకరణలో పాల్గొంటున్నారు.