పెద్ద తారలు… పాత హార్రరు… ‘రాజుగారి గది 2’ చిత్ర సమీక్ష

                                         సినీవినోదం రేటింగ్ : 2.75/5
పివిపి సినిమా, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఓక్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు ఓంకార్ దర్శకత్వం లో ప్రసాద్ వి పొట్లూరి, పరం వి పొట్లూరి, నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు
 
వ్యాపారం చేసి జీవితంలో గొప్ప‌గా స్థిర‌ప‌డాల‌నుకునే స్నేహితులు అశ్విన్‌, వెన్నెల‌కిషోర్‌, ప్ర‌వీణ్‌లు వైజాగ్‌లో రిసార్ట్ కొంటారు. రిసార్ట్‌కు వ‌చ్చే క‌స్ట‌మ‌ర్స్ చ‌క్క‌గా చూసుకుంటూ ఉంటారు. ఓసారి వాళ్ల రిసార్ట్‌లోకి సుహానిసా(శీర‌త్‌క‌పూర్‌) వ‌స్తుంది. ఆమెతో డేటింగ్ చేయాల‌ని వెన్నెల‌కిషోర్‌, ప్ర‌వీణ్‌లు తాప‌త్ర‌య ప‌డుతుంటారు. ఆమెను ముగ్గులోకి దించాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. కానీ ఏదో ఆత్మ వారి ప్రయ‌త్నాల‌ను అడ్డుకుంటుంది. ముగ్గురినీ భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తుంది. దాంతో వారు ద‌గ్గ‌ర‌లోని చ‌ర్చి ఫాద‌ర్‌(సీనియ‌ర్ న‌రేష్‌)ను క‌లుస్తారు.వారి రిసార్ట్‌కు వచ్చిన న‌రేష్ కు ఆ రిసార్ట్‌లో ఆత్మ ఉంద‌ని తెలుస్తుంది. దాంతో రుద్ర‌(అక్కినేని నాగార్జున‌) స‌హాయం కోరుతాడు. రుద్ర ఫేమ‌స్ మెంట‌లిస్ట్‌. పోలీసులు సాల్వ్ చేయ‌లేని కేసుల్లో వారికి స‌హాయ‌ప‌డుతుంటాడు. చ‌ర్చి ఫాద‌ర్ చెప్పిన విష‌యం విన్న రుద్ర‌ రిసార్ట్ కి వెళ్లి అక్క‌డ ప‌రిస్థితుల‌ను అర్థం చేసుకుని ఆత్మ ఉంద‌ని నిర్ధారించుకుంటాడు. ఆ స‌మ‌యంలో రుద్ర‌కు కూడా అనుకోని ప‌రిణామం ఎదుర‌వుతుంది. అస‌లు అంద‌రినీ భ‌యపెట్టే ఆత్మ ఎవ‌రు? ఎందుకు అంద‌రినీ ఇబ్బంది పెడుతుంటుంది? అమృత ఎవ‌రు? రుద్ర‌, అమృత‌కు ఉన్న రిలేష‌న్ ఏంటి అనే విష‌యాల‌ను సినిమాలో చూడాలి ….
 
‘రాజు గారి గది’ సినిమాతో దర్శకుడిగా తొలి విజయాన్ని అందుకున్న ఓంకార్, రెండో సినిమా కూడా హర్రర్ సబ్జెక్ట్ తో మలయాళ సినిమా ‘ప్రేతమ్’ ఆధారంగా ‘రాజు గారి గది 2’ ని తెరకెక్కించాడు . అక్కినేని నాగార్జున, సమంతలు కథలోని రెండు కీలక పాత్రల్ని చేయడమే సినిమాకి ప్రధాన బలం. నాగార్జున, సమంతల పాత్రల్ని మాత్రం బాగానే డిజైన్ చేసి ఎలివేట్ చేశాడు దర్శకుడు ఓంకార్. నాగ్, సమంతలు కలిసి కనబడే క్లైమాక్స్ సన్నివేశంలో ఎమోషన్ బాగా వర్కవుట్ అయింది. అయితే , ఒక హర్రర్, థ్రిల్లర్ కు కావాల్సిన కథ, కథనాలను సంతృప్తికర స్థాయిలో చూపలేదనే చెప్పాలి. ఎమోషనల్ గా బాగున్న కథకు.. కదిలించే హర్రర్ సన్నివేశాలని జోడించి, కొద్దిగా ఉత్కంఠ ఉన్న కథనాన్ని జోడించి ఉంటే ప్రేక్షకుడు ఇంకాస్త బెటర్ గా ఎంజాయ్ చేసే వాడు .పేలవమైన టేకింగ్, పెద్దగా ఆకట్టుకోని ఫస్టాఫ్, కొన్ని బలవంతపు కామెడీ సన్నివేశాలు ఇందులో మైనస్ పాయింట్స్ . కథకు కీలకమైన సమంత నైపథ్యం కూడా సెంటిమెంటల్ గా కొంతవరకు బాగానే ఉంది. నాగార్జున సమంత కేసును డీల్ చేసిన విధానం, నిజాల్ని కనుగొన్న తీరు కొంతమేర ఆసక్తికరంగానే సాగాయి.ఏదో ప్రేక్ష‌కుడిని భ‌య‌పెట్టాలంటే దెయ్యాన్ని చూపించాల‌నే తీరులో కాకుండా, కాన్సెప్ట్ ప్ర‌కారం ఆత్మ‌ను చూపించిన విధానం బావుంది.
మెంటలిస్ట్ గా మనసులోని భావాలను పసిగట్టే పాత్రలో నాగ్ నటన ఆకట్టుకుంది. నాగార్జున నటన, లుక్, యాటిట్యూడ్ బాగున్నాయి. ఆడ‌పిల్ల‌ల గొప్ప‌తం గురించి చెప్ప‌డ‌మే కాక‌, స‌మాజంలో చెడు ఎదురైన‌ప్పుడు కూడా ఆడ‌పిల్ల‌లు ధైర్యంగా ఉండాల‌ని చెప్పే సంద‌ర్భాల్లో నాగ్ న‌ట‌న మెప్పించింది.ముఖ్యంగా సమంత ,నాగార్జున కాంబినేషన్ లో వచ్చే సీన్స్ లో ఈ ఇద్దరి నటన కట్టిపడేస్తుంది. తనని బాధపెట్టిన వాళ్ళపై పగ తీర్చుకోవాలనుకునే ఆత్మగా సమంత చెప్పుకోదగ్గ నటనచూపింది . తనకు అందం, అభినయంలో తిరుగులేదని మరోసారి ప్రూవ్ చేసుకుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో అందంగా కనిపించి, దెయ్యంగా భయపెట్టడంలోనూ సక్సెస్ అయ్యింది . ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్లలో సమంత నటన కంటతడి పెట్టిస్తుంది. స‌మంత తండ్రి పాత్ర‌లో రావు ర‌మేష్‌గారు చ‌క్క‌గా న‌టించారు.సీరత్ కపూర్ కు నటనకు పెద్దగా అవకాశం లేకపోయినా.. ఫస్ట్ హాఫ్ లో గ్లామర్ షోతో అలరించింది. మరో ముఖ్యమైన పాత్రలో అభినయ ఆకట్టుకుంది. క్లైమాక్స్ సీన్స్ లో సమంతతో పోటీ పడి నటించింది.వెన్నెల కిశోర్, ప్రవీణ్, షకలక శంకర్ లు అక్కడక్కడా నవ్వించారు .
 
“మనిషికి మాన‌వ‌త్వాన్ని గుర్తు చేయాల్సి వ‌స్తోంది ..ప్రేమ‌ను ప‌రిచ‌యం చేయాల్సి వ‌స్తోంది ..ఆ దేవుడుని బోనులో నిల‌బెట్టే అవ‌కాశం వ‌చ్చింది. వెళ్లి గ‌ట్టిగా నిల‌దీయ్‌”… వంటి అబ్బూరి రవి మాటలు బాగున్నాయి.దివాక‌ర‌న్ సినిమాటోగ్ర‌ఫీ బావుంది. ప్ర‌తి సీన్ రిచ్‌గా క‌న‌ప‌డింది. ఇక థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కీలక సన్నివేశాల్లో బాగా అనిపించింది.ముఖ్యంగా ఆత్మ‌ను చూపించే సంద‌ర్భంలో చాలా బాగుంది . విజువల్ ఎఫెక్ట్స్ అంత గొప్ప స్థాయిలో లేవు  – ధరణి