సినీవినోదం రేటింగ్ : 2.5 /5
వైజయంతీ మూవీస్, వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ పతాకం పై శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో సి.అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
కధలోకి వెళ్తే…
దేవ (నాగార్జున) ఓ మాఫియా డాన్. తనను ఆదరించి పెంచిన దాదా(శరత్ కుమార్)ను ప్రత్యర్థులు చంపేయటంతో పదేళ్లపాటు అజ్ఞాతంలో ఉన్న దేవ బయటకు వస్తాడు. దేవ సిటీకి తిరిగి వస్తున్నాడన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న పోలీసులు ఎలాగైనా దేవాను పట్టుకోవాలని స్కెచ్ వేస్తారు. అదే సమయంలో దాదాను చంపిన డేవిడ్(కునాల్ కపూర్) గ్యాంగ్ కూడా దేవను చంపడానికి ట్రై చేస్తుంది. ఓ పోలీస్ అటాక్‌లో గాయపడిన దేవకు డాక్టర్ దాస్ (నాని) ట్రీట్‌మెంట్ చేస్తాడు. తాను క్రిమినల్ అని తెలిసినా పోలీసులకు పట్టివ్వని దాస్ మంచితనం చూసి, దేవ అతనితో ఫ్రెండ్‌షిప్ చేస్తాడు. మొదట్లో కాస్త ఇబ్బంది పడినా దాస్ కూడా దేవకు మంచి ఫ్రెండ్ అయిపోతాడు. మనుషులను చంపటం తప్ప ప్రేమించటం తెలియని దేవ.. మనుషులను అమాయకంగా నమ్మటం, ప్రేమించటం మాత్రమే తెలిసిన దాస్‌ల మధ్య స్నేహం ఎలా కుదిరింది..? ఆ తర్వాత దేవ, దాస్‌లు.. ఎవరు ఎవరిలా మారిపోయారు..? దేవ పోలీసుల నుంచి, డేవిడ్ గ్యాంగ్‌నుంచి ఎలా తప్పించుకున్నాడు..? అన్నది సినిమాలో చూడాలి….
విశ్లేషణ…
నాగార్జున, నాని కాంబినేషన్‌లో రూపొందిన మల్టీస్టారర్ `దేవదాస్`. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ చాలా గ్యాప్ తర్వాత ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం.
కామెడీ తో సినిమాను ప్రేక్షకులకు అందించాలనుకున్న శ్రీ రామ్ ఆదిత్య దాన్ని పూర్తి స్థాయిలో తెరమీదకు తీసుకురాలేకపోయాడు. ముఖ్యంగా సినిమా ప్రారంభంలో మొదటి ఇరవై నిమిషాలు బోర్ కొట్టించాడు. నాగార్జున వచ్చాక కానీ స్టోరీ లో వేగం రాదు. ఇక సినిమాలో చాలా సన్నివేశాలు సాగదీసినట్టుగా అనిపించాయి. నాగ్ – ఆకాంక్ష , నాని – రష్మికల లవ్ ట్రాక్ ఫై ఇంకొంచెం దృష్టి పెడితే బాగుండేది. బలమైన స్టోరీ లేకపోవడం వల్ల సినిమాలో వచ్చే ట్విస్టులు కూడా ఆసక్తిగా అనిపించవు.
సినిమా లో సోల్ మిస్ అయిన ఫీలింగ్ మాత్రం కలుగుతుంది. ఫస్టాఫ్‌లో దర్శకుడు దేవాకి,దాస్‌కీ మధ్య బంధాన్ని చూపించడానికి, లవ్ ఎపిసోడ్స్ చూపించడానికి ..దర్శకుడిలో కాస్త కంగారు కనిపించింది.
ఈగోయిస్ట్ అయిన డాక్టర్‌లో మార్పు రావడానికి పెద్ద కారణాలేం కనిపించవు. యాంకర్ జాహ్నవి ఇంట్లో డాన్ దేవాకి సంబంధించిన క్లిప్పింగ్స్ ఎందుకుంటాయో తెలీదు.
నటీ నటులు …
నాగార్జున మరోసారి తనదైన స్టైలిష్ లుక్‌తో, ఎనర్జిటిక్ పర్ఫామెన్స్‌తో మెస్మరైజ్ చేశాడు. యాక్షన్, రొమాన్స్‌లతో పాటు కామెడీతోనూ ఆకట్టుకున్నాడు. యంగ్ హీరో నాని కూడా తనదైన నేచురల్ పర్ఫామెన్స్ తో మెప్పించాడు. అమాయకుడిగా కనిపిస్తూనే మంచి టైమింగ్‌తో కామెడీ పండించాడు. నాగ్, నానిల మధ్య వచ్చే సన్నివేశాల్లో వారిద్దరి కెమిస్ట్రీ సినిమాను మరింత ఎంటర్‌టైనింగ్‌గా మార్చింది. ఎమోషనల్ సీన్స్‌లోనూ ఇద్దరి నటన సూపర్బ్.నానికి అన్నగా సీనియర్ నరేష్, ఆయన భార్యగా సత్యకృష్ణ, హాస్పిటల్ ఛైర్మన్‌గా ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సీనియర్ డాక్టర్‌గా రావు రమేశ్, సైకాలజిస్ట్‌గా వెన్నెల కిశోర్, పోలీస్ ఆఫీసర్‌గా మురళీ శర్మ, హీరోయిన్ల విషయానికి వస్తే ఇన్‌స్పెక్టర్‌గా రష్మిక, యాంకర్‌గా ఆకాంక్ష బాగా చేశారు.గ్లామర్ గా కనిపిస్తూ తమ పాత్రల పరిధి మేర నటించారు. ప్రముఖ నటుడు శరత్ కుమార్ వున్నది కాసేపైనా తన నటనతో మెప్పించాడు.విలన్‌గా తెలుగు తెరకు పరిచయం అయిన బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ స్టైలిష్ లుక్‌లో ఆకట్టుకున్నా.. ఆ పాత్రను పెద్దగా ఎలివేట్ చేయలేదు.
సాంకేతిక వర్గం…
డైలాగులు అక్కడక్కడా బావున్నాయి. మణిశర్మ అందించిన సంగీతం పర్వాలేదు. సినిమాలో రెండు పాటలు బాగున్నాయి. పాటలను తీసిన విధానం బావుంది. ప్రతి పాటకూ ఓ కాన్సెప్ట్‌ను డిజైన్ చేసి తీశారు. మంచి నేపథ్య సంగీతం అందించి మణిశర్మ మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్ శ్యామ్ దత్ సినిమాటోగ్రఫి. శ్యామ్ దత్ ఛాయాగ్రహణం చాలా బాగుంది. సినిమాకు కలర్ ఫుల్, రిచ్ లుక్ తీసుకు రావడంలో ఆయన విజయం సాధించాడు. ఎడిటర్ ప్రవీణ్ పూడి అనవసరమైన సన్నివేశాలను తొలిగిస్తే బాగుండేది -రాజేష్