సినీవినోదం రేటింగ్ : 2.25/5
వారాహి చలనచిత్రం బ్యానర్ పై కృష్ణ మారిముత్తు దర్శకత్వం లో రజనీకొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు
మురళీ దంపతులు (రావు రమేశ్, రేవతి) డాక్టర్లు. సమాజ శ్రేయస్సే తమ లక్ష్యంగా పనిచేస్తుంటారు. వారికి ముగ్గురు పిల్లలు. ఇద్దరు కుమార్తెలు. ఒకబ్బాయి. అబ్బాయి పేరు అర్జున్ (నాగచైతన్య). అతను డ్రోన్ డిజైనింగ్ చేస్తుంటాడు. శ్రీమతి మురళీ దగ్గర ఇంటర్న్ షిప్ చేయాలని వచ్చిన అంజలి (లావణ్య త్రిపాఠి), అర్జున్‌తో ప్రేమలో పడుతుంది. అంతా సవ్యంగా సాగుతుందనగా మురళీ దంపతులు చనిపోతారు. వారిది హత్యా? ప్రమాదమా? అనేది సస్పెన్స్. మరోవైపు పదవులను ఆశించిన రాజకీయనాయకుడు (వినోద్ కుమార్) నగరంలో బాంబులు పెట్టిస్తాడు. అందుకు నాయక్ (శ్రీకాంత్)ను వాడుకుంటాడు. ఈ బాంబ్ బ్లాస్ట్ కు, మురళీ దంపతులు కన్నుమూయడానికి, నాయక్‌కు, రాజకీయనాయకుడికి సంబంధం ఉందా? ఉంటే ఎలాంటిది? మధ్యలో ఎన్ ఐ ఎ అధికారి తీసుకున్న చొరవ ఎలాంటిది? ఇంతకీ సెల్వమ్ ఎవరు? ఇవన్నీ తెలుసుకోవాలంటే …
శ్రీకాంత్ విలన్‌గా నటించడం, వారాహి వంటి పెద్ద సంస్థ నిర్మించడంతో `యుద్ధం శరణం` సినిమాకు కొంత హైప్ వచ్చింది. అయితే ,కథలో కొత్తదనం ఏమీ లేదు. కథా, కథనం పేలవంగా ఉన్నాయి .ఈ చిత్రానికి ‘ఎత్తుకు పై ఎత్తులు వేసే కుర్రాడి కథ’ అని, ‘ఇంటలిజెన్స్ బేస్డ్ మూవీ’ అని ప్రచారం జరిగింది. సినిమాలో మాత్రం అంతగా ఎత్తుకు పై ఎత్తులు కనిపించవు. అటు రాజకీయనాయకుడిగా చేసిన వినోద్ కుమార్‌గానీ, ఇటు నాయక్‌గా నటించిన శ్రీకాంత్ పాత్ర కానీ బలంగా లేవు. ఒక రోజులో ఓ పాతికేళ్ల కుర్రాడు అటు పోలీసులను పట్టించుకోకుండా, ఇటు ఓ మాఫియా స్థాయి డాన్‌ను అంత తేలిగ్గా ఎలా ఎదుర్కోగలిగాడో అర్థం కాదు. అందమైన ఎగువ మధ్యతరగతి ఫ్యామిలీని ,మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ను దర్శకుడు ఇందులో కొంతవరకూ బాగానేచూపించాడు. అయితే లవ్ స్టోరి విషయంలో ఇంకాస్త కేర్ తీసుకోవాల్సింది. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ కలగటానికి బలమైన కారణం కనిపించదు. ఎటొచ్చీ సెకండాఫ్‌లో ఎమోషన్స్ సరిగా పండలేదనిపించింది. తల్లిదండ్రులు చనిపోతే హీరో పడే మానసిక సంఘర్షణని ఎలివేట్ చేయడంలో దర్శకుడు ఎంచుకున్న కథనం చాలా తేలిగ్గా ఉంది . ఆడియన్స్ కోరుకునే పోరాటం సెకండ్ హాఫ్ లో కనిపించకపోవడం కాస్త నిరాశపరుస్తుంది. మంచి కథని ప్రెజెంట్ చేయడంలో స్క్రీన్ ప్లేలో చేసిన తప్పులు సెకండ్ హాఫ్ ని పూర్తిగా బలహీన పరిచింది . మొత్తానికి `యుద్ధం శరణం` ఒక రొటీన్ కమర్షియల్ చిత్రంగా మిగిలింది .
నాగచైతన్య ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ తో పాటు ఎమోషనల్ సీన్స్ లో ఆకట్టుకున్నాడు. గత చిత్రాలతో పోలిస్తే నాగచైతన్య నటనలో మంచి పరిణతి కనిపించింది. లావణ్య త్రిపాఠి పాత్రకు పెద్ద ఇంపార్టెన్స్ లేదు. కేవలం కథలో పాటలు, రొమాన్స్ కోసమే ఆమె పాత్ర అనిపించింది. అయితే ఉన్నంతలో గ్లామర్ తో పాటు నటనతోనూ ఆకట్టుకుంది.తన పరిధిలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను శ్రీకాంత్ చక్కగా పోషించాడు . లుక్స్ తో పాటు నటనలోనూ విలనిజాన్ని బాగా పండించాడు. రేవతి, రావు రమేష్ లు తమ అద్భుతమైన నటనతో సీతాలక్ష్మీ, మురళీ కృష్ణల పాత్రలకు పూర్తి న్యాయం చేసారు . కుటుంబాన్ని ప్రేమిస్తూనే సమాజానికి ఏదైన సాయం చేయాలనే తపన పడే పాత్రల్లో ఒదిగిపోయారు. కొడుకుతో తండ్రికుండే అనుబంధం గురించి రావు రమేశ్ చెప్పే మాటలు బాగున్నాయి .సిస్టర్ క్యారెక్టర్ లో సీమా చౌదరి నటన ఆకట్టుకుంది. `పెళ్లి చూపులు`లో ఫ్రెండ్ కేరక్టర్ చేసిన ప్రియదర్శి ఇందులో తెలంగాణ యాసలో మాట్లాడే డాక్టర్‌గా మెప్పించారు. .మురళీశర్మ పాత్ర అక్కడక్కడా రిలీఫ్‌గా అనిపించింది. రవివర్మ కనిపించినప్పుడల్లా విలన్ బ్యాచ్‌కి కోవర్ట్ గా పనిచేస్తున్నాడేమోననే అనుమానం కలిగింది .
సినిమాకు మేజర్ ఎసెట్ సినిమాటోగ్రాఫర్ నిఖేత్ బొమ్మిరెడ్డి. డ్రోన్ సీన్స్ తో పాటు నైట్ విజన్ కెమెరాతో షూట్ చేసిన సన్నివేశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తాయి. వివేక్ సాగర్ సంగీతం లో పాటలు అంతగా ఆకట్టుకోవు . ఫ్యామిలీ సాంగ్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు . ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి – ధరణి