కుటుంబ వినోదం …. ‘రారండోయ్ వేడుక చూద్దాం’ చిత్ర సమీక్ష

 

  కుటుంబ వినోదం …. ‘రారండోయ్ వేడుక చూద్దాం’ చిత్ర సమీక్ష

                                       సినీ వినోదం రేటింగ్ : 3/5

అక్కినేని నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం ‘రారండోయ్ వేడుక చూద్దాం’. ‘ప్రేమమ్, సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రాలు తర్వాత నాగ చైతన్య, ‘సోగ్గాడే చిన్ని నాయనా’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత కళ్యాణ్ కృష్ణ చేసిన సినిమా.నాగార్జున నిర్మాత. నాగార్జున కెరీర్‌లో ‘నిన్నే పెళ్లాడతా’ చిత్రం ఓ మైలురాయిగా నిలిచింది. కుటుంబ బంధాల మేళవింపుతో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం లాంటి సినిమా నాగచైతన్య కెరీర్‌లో ఒకటి ఉండాలనే ఆలోచన నుంచే రారండోయ్ వేడుక చూద్దాం సినిమా రూపుదిద్దుకుంది. ఇప్పటివరకూ నవతరానికి ప్రతినిధి తరహా పాత్రల్లో ఎక్కువగా కనిపించిన నాగచైతన్య తొలిసారి తన పంథాకు భిన్నంగా కుటుంబ తరహా కథాంశంతో ఈ సినిమా చేశారు. సోగ్గాడే చిన్ని నాయనా తర్వాత కల్యాణ్‌కృష్ణ ద్వితీయ ప్రయత్నంగా రూపొందించిన చిత్రమిది.

అమాయకత్వం, గడుసుతనం కలబోసిన పల్లెటూరి అమ్మాయి భ్రమరాంబ(రకుల్‌ప్రీత్‌సింగ్). తాను చెప్పించే వేదం అనేది ఆమె మనస్తత్వం. నాన్న ఆది(సంపత్)అంటే ఆమెకు పంచప్రాణాలు. రాజకుమారుడు లాంటి వరుడు తనను పెళ్లాడుతాడనేది భ్రమరాంబ నమ్మకం. ఓ పెళ్లిలో భ్రమరాంబను చూసిన శివ(నాగచైతన్య) తొలిచూపులోనే ఆమెను ప్రేమించడం మొదలుపెడతాడు. అయితే భ్రమరాంబ తమ మధ్య ఉన్నది స్నేహం మాత్రమేనని నమ్ముతుంది. చదువు కోసం కుటుంబాన్ని వదిలి వైజాగ్‌కు వచ్చిన భ్రమరాంబను కంటికిరెప్పలా కాపాడుతుంటాడు శివ. సాఫీగా సాగిపోతున్న వారి స్నేహబంధంలో అనుకోకుండా అపోహలు చోటుచేసుకుంటాయి. దాంతో ఇద్దరు విడిపోతారు. దూరమైన తర్వాతే తాము ప్రేమలో ఉన్నామనే విషయం వారికి అర్థమవుతుంది. దాంతో శివను తాను ప్రేమిస్తున్నానంటూ అతడినే పెళ్లాడాలనుందని కుటుంబ సభ్యులకు చెబుతుంది భ్రమరాంబ. కానీ ఆమె తండ్రి మాత్రం వీరి పెళ్లిని అంగీకరించడు. అందుకు గల కారణమేమిటి? ఆదికి శివ నాన్న కృష్ణ(జగపతిబాబు)కు మధ్య వైరం ఏర్పడటానికి దారి తీసిన పరిస్థితులేమిటి? చివరకు శివ, భ్రమరాంబ ఏ విధంగా ఒక్కటయ్యారు? అనేది ఈ చిత్రం ఇతివృత్తం.

లవర్‌బాయ్‌గా కెరీర్‌ను మొదలుపెట్టిన నాగచైతన్య ప్రతి సినిమాలో తనను తాను కొత్త పంథాలో ఆవిష్కరించుకునేందుకు కృషి చేస్తున్నాడు.  నటుడిగా ఒక్కొ మెట్టు ఎదుగుతున్నారు. తొలిసారి పూర్తిస్థాయి కుటుంబ కథాంశంతో నాగచైతన్య చేసిన చిత్రమిది. తండ్రిని అమితంగా ప్రేమించే బాధ్యతయుతమైన కుర్రాడిగా, ప్రేమికుడిగా, సరదా యువకుడిగా భిన్న కోణాల్లో సాగే పాత్రలో చక్కటి నటనను ప్రదర్శించాడు. వినోదం, భావోద్వేగాల కలబోతగా సాగే అతడి నటన ఆకట్టుకుంటుంది. సహజ నటనతో తన పాత్రలో ఒదిగిపోయారు. కుటుంబ కథాంశాలకు సరిపోతాడని నిరూపించుకున్నారు. కెరీర్‌లో ఎక్కువగా గ్లామర్ పాత్రల్లో కనిపించిన రకుల్‌ప్రీత్‌సింగ్ తొలిసారి పల్లెటూరి యువతిగా అభినయానికి ఆస్కారమున్న పాత్రలో కనిపించింది. డీ గ్లామర్ తరహాలో సంప్రదాయబద్ధంగా ఆమె పాత్ర సాగుతుంది. భ్రమరాంబ పాత్రకు తన ఎంపిక సరైందని నిరూపించింది. కథకు ఆయువుపట్టుగా నిలిచిన ఈ పాత్రకు పరిపూర్ణంగా న్యాయం చేసింది. గ్లామర్, అశ్లీలతకు తావు లేకుండా పదహారణాల తెలుగమ్మాయిగా ఆమె పాత్రను దర్శకుడు కల్యాణ్‌కృష్ణ ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. తనలో మంచి నటి దాగి ఉందని నిరూపించిన చిత్రమిది. నాగచైతన్య, రకుల్‌ప్రీత్‌సింగ్ కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. తండ్రి పాత్రలో మరోసారి ఒదిగిపోయారు జగపతిబాబు. ఆయన పాత్ర హుందాగా సాగుతుంది. నాగచైతన్య, జగపతిబాబు మధ్య వచ్చే సన్నివేశాలు అలరిస్తాయి. నెగిటివ్, పాజిటివ్ రెండు ఛాయాలున్న పాత్రలో సంపత్ తనదైన శైలి నటనతో అలరించారు. భార్యాబాధితుడిగా వెన్నెల కిషోర్ తన కామెడీ టైమింగ్‌తో నవ్వించారు.

కల్యాణ్‌కృష్ణ ప్రతిభపై ఉన్న నమ్మకంతో నాగార్జున రారండోయ్ వేడుక చూద్దాం ద్వారా ఆయనకు మరో అవకాశాన్ని ఇచ్చారు. నాగార్జున నమ్మకాన్ని పూర్తిస్థాయిలో నిలబెట్టారు కల్యాణ్‌కృష్ణ. అందమైన కుటుంబ కథా చిత్రంగా సినిమాను తెరకెక్కించారు. కుటుంబ అనుబంధాలు, ఆప్యాయతలకు పెద్దపీట వేస్తూ వాటికో చక్కటి ప్రేమకథను జోడించి హృదయాన్ని కదిలించేలా సినిమాను రూపొందించారు. నిన్నే పెళ్లాడతా ఛాయలు ఇందులో కనిపిస్తాయి. దర్శకుడు కృష్ణవంశీ శైలిలో ప్రతి ఫ్రేమ్‌లో పదుల సంఖ్యలో నటీనటులతో ఆద్యంతం సందడిగా ఉంటుంది. అయితే కల్యాణ్‌కృష్ణ ఎంచుకున్న కథలో కొత్తదనం లేకపోవడం మైనస్‌గా మారింది. ఇప్పటివరకూ ఈ తరహా కథాంశాలతో తెలుగులో చాలా సినిమాలు రూపొందాయి. అయితే తన అనుభవంతో పాత కథ అనే భావన ప్రేక్షకుల మనసుల్లో కలగకుండా చేశారు సత్యానంద్. ఆయన అందించిన స్క్రీన్‌ప్లే సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. మలుపులు, ఉత్కంఠభరిత సన్నివేశాలు లేకపోయినా చాలా చక్కటి అనుభూతిని పంచే మంచి సినిమాగా తన కథనంతో తీర్చిదిద్దారు. నేపథ్య సంగీతం, బాణీలతో ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ స్వరపరచిన థీమ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. టైటిల్ సాంగ్‌తో పాటు భ్రమరాంబకు నచ్చేశాను పాటలు అలరిస్తాయి. పల్లెటూరి అందాలను సహజంగా సినిమాలో చూపించారు ఛాయాగ్రహకుడు విశ్వేశ్వర్. ప్రకృతి అందాల నడుమ పాటలను చిత్రీకరించిన తీరు బాగుంది. కథలో కొత్తదనం లేకపోయినా మాస్, పోరాట ఘట్టాలు, ప్రత్యేక గీతాలు వంటి కమర్షియల్ హంగులకు తావు లేకుండా ఆద్యంతం ఫీల్‌గుడ్ మూవీగా దర్శకనిర్మాతలు ఈ సినిమాను తీర్చిదిద్దారు  – ధరణి

REVIEW OVERVIEW
రారండోయ్ వేడుక చూద్దాం
SHARE