నడిగర్ సంఘం… సినిమా షూటింగులు, నాటకాల ప్రదర్శన జరిగే ప్రదేశాల్లో నటీనటులకు రక్షణ కల్పించనున్నట్టు నడిగర్ సంఘం ప్రకటించింది. దేశవ్యాప్తంగా ‘మీ టూ’ ఉద్యమం ద్వారా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులపై మహిళలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తుండడం కలకలం రేపుతున్న నేపథ్యంలో లింగబేధం లేకుండా సినీ తారల తరపున నడిగర్ సంఘం ఈ ప్రకటన చేసింది.
గాయని చిన్మయి ప్రముఖ సినీ గేయ రచయిత వైరముత్తు పై ‘మీటూ’ ఉద్యమం ద్వారా లైంగికపరమైన ఆరోపణలతో సంచలనం సృష్టించింది.అంతేకాకుండా, ఆయనపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసి, కోర్టులోను కేసు వేసేందుకు సన్నద్ధమవుతోంది. ఆమెకు మద్దతుగా నటీమణులు, బుల్లితెర తారలు, యాంకర్లు, పలువురు గాయకులు గళం విప్పుతున్నారు. ఈ నేపథ్యంలో నటుడు అర్జున్‌పై కూడా కన్నడ నటి శ్రుతి హరహరన్ లైంగిక ఆరోపణలు చేయడం చర్చనీయాంశ మైంది. షూటింగ్ స్పాట్లో అర్జున్ తనను ఊహించని విధంగా కౌగిలిలో బంధించారని, విందుకు కూడా ఆహ్వానించారని ఆమె ఆరోపించారు.
అయితే ఇందులో వాస్తవం లేదని ఖండించడంతోపాటు ఆమెపై పరువునష్టం దావా వేసేందుకు అర్జున్ సిద్ధమవుతున్నారు. మరోవైపు సీనియర్ నటుడు, నిర్మాత త్యాగరాజన్‌పై కూడా మహిళా ఫొటోగ్రాఫర్ ప్రీతికామీనన్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది.
ఇలా రోజు రోజుకూ ‘మీ టూ’ పేరుతో మహిళా ఆర్టిస్టుల నుంచి లైంగిక ఆరోపణలు పెరుగుతుండడంతో నడిగర్ సంఘం రంగంలోకి దిగింది. ‘మీ టూ’ ఆరోపణలకు సంబంధించి కొత్తగా పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్ కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. ఆ ప్రకారం నడిగర్ సంఘం, నిర్మాతల మండలి, ఫెఫ్సీ సభ్యులతో కూడిన ఒక కమిటీ కూడా ఏర్పాటైంది.
తాజాగా దక్షిణ భారత నడిగర్ సంఘం కూడా ఇదే తరహా కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు సంఘం తరపున అధ్యక్షుడు నాజర్, ప్రధాన కార్యదర్శి విశాల్, కోశాధికారి కార్తి, ఉపాధ్యక్షుడు పొన్వణ్ణన్ విడుదల చేసిన ప్రకటనలో… ‘సినిమా చిత్రీకరణ లేదా నాటకం ప్రదర్శించే ప్రదేశాల్లో లింగ భేదం లేకుండా కళాకారులందరికీ మానసిక ఒత్తిడి, బెదిరింపులకు అవకాశం లేకుండా రక్షణ కల్పించేందుకు మేము చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నాం’ అని పేర్కొన్నారు.