నేచురల్ స్టార్ నాని హీరోగా డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పి, కోన ఫిలిం కార్పొరేషన్ పతాకాలపై శివ నిర్వాణ దర్శకత్వంలో దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న చిత్రం ‘నిన్నుకోరి’. ఈ చిత్రం జులై 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో హీరో నానితో జరిపిన ఇంటర్వ్యూ….
‘నిన్నుకోరి’ చిత్రంతో ఏం కోరుతున్నారు?
– మీ అందరికీ ఈ సినిమా నచ్చాలని కోరుతున్నాము. ఇది బేసిక్‌గా లవ్‌స్టోరీ. ఈమధ్య ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో కాస్త డిస్కనెట్ అయ్యాము. మనకి ఆప్షన్స్ ఎక్కువైపోయి రెండు నిముషాల ఎమోషనల్ సీన్స్‌ని కూడా చూడలేక ఫోన్ చూసుకోవడం లాంటివి చేస్తున్నాం. కంప్లీట్‌గా మనని ఎంగేజ్ చేసే సినిమాలు తక్కువైపోతున్నాయి. అలాంటి టైమ్‌లో వచ్చిన సినిమా ఇది. కథ వింటున్నప్పుడు నాకే తెలీకుండా ఎమోషనల్‌గా ఫీల్ అయ్యాను. జనరల్‌గా కథ వింటున్నప్పుడు ఇంటర్వెల్ రావడానికి ఇంకెంత టైమ్ పడుతుంది అని ఆలోచిస్తాము. అది బోర్ కొట్టడం వల్ల కావచ్చు, మరే కారణం వల్ల కావచ్చు. కానీ, ‘నిన్నుకోరి’ కథ వింటున్నప్పుడు అలాంటి ఫీలింగ్ నాకు కలగలేదు. కథ వింటూ క్యారెక్టర్స్‌ని ఇమాజిన్ చేసుకుంటూ వుండిపోయాను. నేను వింటున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యానో సినిమా చూసిన ప్రేక్షకులు కూడా అదే ఫీల్ అయితే చాలా మంచి సినిమా అవుతుంది అని కథ వింటున్నప్పుడు అనిపించింది. సినిమా కంప్లీట్ అయిన తర్వాత అదే శాటిస్‌ఫ్యాక్షన్‌తో మీ ముందుకు రాబోతున్నాము.
రెగ్యులర్‌గా లవ్‌స్టోరీలే చెయ్యడానికి కారణం?
– నా సినిమాలని కాదు, మీరు ఏ సినిమా తీసుకున్నా అందులో లవ్‌స్టోరీ వుంటుంది. స్వాతిముత్యం, సాగర సంగమం లాంటి సినిమాల్లో కూడా లవ్‌స్టోరీ వుంది. ‘నిన్నుకోరి’ విషయానికి వస్తే ఇప్పటి వరకు ఇలాంటి లవ్‌స్టోరీ నేను చేయలేదు. ఇది నాకు పూర్తిగా కొత్త సినిమా అని చెప్పొచ్చు. నెక్స్ట్ నేను చేస్తున్న ‘ఎంసిఎ’లో కూడా లవ్‌స్టోరీ వుంది. కానీ, అది ప్రేమకథా చిత్రం కాదు.
‘నిన్నుకోరి’ కథలో మీకు నచ్చిన అంశం ఏమిటి?
– జీవితంలో ఏదైనా చిన్న ప్రాబ్లమ్ రాగానే ‘లైఫ్ అయిపోయింది’ అనుకుంటూ వుంటాం. ఎవరైనా మంచి చెప్పాలని ప్రయత్నించినా.. ‘లేదు. నా లైఫ్ అయిపోయింది’ అంటుంటారు. ఏదో తెలీని నెగిటివ్ థింకింగ్‌లోకి వెళ్ళిపోవడం చూస్తుంటాం. చిన్న ప్రాబ్లమ్ రావడం వల్ల అయిపోయేంత చిన్నది కాదు లైఫ్. ఒక్కసారి మనం లైఫ్‌కి స్వాగతం చెప్తే జీవితం మనకు ఎన్నో సర్ప్రైజ్లిస్తుంది. ఈ సినిమాలో ఫైనల్‌గా ఓ లైన్ కూడా చెప్పడం జరిగింది. ‘లైఫ్ మనకి బోలెడన్ని ఛాన్సులిస్తుంది, మనం లైఫ్‌కి ఒక ఛాన్స్ ఇద్దాం’.. ఈ లైన్‌తో మనం ఏం చేయాలో పూర్తిగా అర్థమవుతుంది.
ఆదిని తీసుకోవాలన్న ఆలోచన ఎవరిది?
– మొదట కథ అనుకున్నప్పుడు నాతోపాటు వుండే క్యారెక్టర్‌కి ఎవరైతే బాగుంటుంది అనుకున్నప్పుడు అందరూ ఆది పేరునే సజెస్ట్ చేశారు. ఆది కూడా వెంటనే ఒప్పుకున్నాడు. నివేదా కూడా మాకు ఫస్ట్ ఛాయిసే. ఆమె తప్ప ఈ క్యారెక్టర్ ఎవరూ చెయ్యలేరు అనిపించింది.
నిర్మాత దానయ్య గురించి?
– దానయ్యగారు నిర్మాతగా ఎన్నో పెద్ద కమర్షియల్ మూవీస్ చేశారు. అలాంటిది స్క్రిప్ట్ నా దగ్గరికి తీసుకొచ్చినపుడు నిర్మాత ఎవరనుకుంటున్నారు అంటే దానయ్యగారు అని చెప్పారు. ఆయనకి కథ బాగా నచ్చింది అని చెప్పారు. ఫస్ట్‌టైమ్ మన ఫ్యూచర్ సేఫ్ హ్యాండ్స్‌లో వుంది అనిపించింది. సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడో ఒకసారి షూటింగ్‌కి వచ్చేవారు. షూటింగ్ బాగా జరుగుతుందా? అని అడిగేవారు. డైరెక్టర్‌కి, అందరికీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. చూసే అవకాశం వున్నా ఇప్పటివరకు సినిమా చూడలేదు. ఫ్యామిలీతో కలిసి థియేటర్లోనే చూస్తానన్నారు. ఆయనకు ఈ సినిమా మీద వున్న నమ్మకం అది.
కోన వెంకట్ గురించి?
– మా కో ప్రొడ్యూసర్ కోన వెంకట్‌గారు మా యు.ఎస్. ట్రిప్‌ని అంతా ఆయనే చూశారు. అక్కడ వున్న లోకల్ టీమ్‌తో సపోర్ట్ చేశారు. ఆది, నేను, నివేదా కలిసి మాట్లాడుకునేటపుడు కోనగారు కూడా మాలో ఒక మెంబర్‌గా చేరిపోయేవారు. చాలా కంఫర్టబుల్‌గా సినిమా చెయ్యగలిగామంటే కోనగారి సపోర్ట్ ఎంతో వుంది.
ఆడియోకి వస్తున్న రెస్పాన్స్ చూస్తే ఏమనిపిస్తుంది?
– చాలా హ్యాపీగా వుంది. గోపీసుందర్‌గారి మ్యూజిక్ సినిమాకి పెద్ద ఎస్సెట్ అని చెప్పాలి. సినిమా ప్రమోషన్లో భాగంగా మొదట రిలీజ్ చేసిన ‘అడిగా అడిగా’ పాటకు దాదాపు 10 మిలియన్ వ్యూస్ వచ్చాయంటే మామూలు విషయం కాదు. మిగతా పాటలు కూడా అందర్నీ హాంట్ చేస్తున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ఎక్స్ట్రార్డినరీగా చేశారు.
మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్?
– ఎంసిఎ షూటింగ్ జరుగుతోంది. ఇమ్మీడియట్‌గా మేర్లపాక గాంధీ సినిమా ఆగస్ట్‌లో స్టార్ట్ అవుతుంది. ‘నిన్నుకోరి’ రిలీజ్ అయిన వారం రోజుల్లో ఆ సినిమా టైటిల్, మిగతా డీటైల్స్ ఎనౌన్స్ చేస్తాం. ఇది కాక నెక్స్ట్ ఇయర్ మిలట్రీ బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమా చెయ్యబోతున్నాను. ఫస్ట్‌టైమ్ ఆ జోనర్లో సినిమా చేస్తున్నాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు నేచురల్ స్టార్ నాని.