`మా` మూవీ ఆర్టిస్ట్ అసోసియేష్ ఏర్పాటై 25వ వసంతంలోకి అడుగు పెట్టిన సందర్భంగా `మా` టీమ్ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి రంగం సిద్ధం చేసింది. దీనిలో భాగంగా ఆదివారం ఉదయం హైదరాబాద్ ఫిలి ఛాంబర్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. తొలుత `మా` మాజీ అధ్యక్షులు, ఎంపీ మురళీ మోహన్ చేతుల మీదుగా ఈ వారంతంలో బర్త్ డేలు జరుపుకుంటోన్న మా టీమ్ సభ్యులకు మెమోంటో లు అందజేశారు. అక్టోబర్ 4 నుంచి వచ్చే ఏడాది వరకూ ఈ విధానం కొనసాగనుంది.
అనంతరం మురళీ మోహన్ మాట్లాడుతూ… ` 25 సంవత్సరాలు క్రితం ఓ ఛారిటీ క్రికెట్ కోసం వెళ్లి విశాఖపట్టణం నుంచి నేను , చిరంజీవి గారు తిరిగి వస్తుండగా విమానంలో మనకంటూ ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకుంటే మంచిదని … గాల్లో ప్రయాణిస్తూ తీసుకున్న నిర్ణయం నుంచి పుట్టిందే `మా`. అసోసియేషన్ ద్వారా ఇన్నేళ్ల పాటు చాలా మంది కళాకారులకు పలు విధాలుగా లబ్ది పొందారు. `మా` పదవులో కొనసాగిన వారంతా ఆ పదవికి మరింత కళ తీసుకొచ్చారు. ఈసారి శివాజీరాజా వంతు వచ్చింది. ఆయన పదవిలో ఉండగా సిల్వర్ జూబ్లీ వేడుకలు రావడం చాలా సంతోషంగా ఉంది. `మా` పండుగను మనందరి పండగ గా ఘనంగా చేద్దాం. ఏపీ ప్రభుత్వం `చంద్రన్న భీమా` పథకం స్టార్ట్ చేసింది.
అందులో `మా` సభ్యులంతా చేరి ఇన్సురెన్స్ స్కీమ్ ను వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నా` అని అన్నారు.
`మా` అధ్యక్షుడు శివాజీరాజా మాట్లాడుతూ…` మురళీ మోహన్ గారు `మా` కు సరైన ఆఫీస్ లేకపోవడంతో ఆయన ఇంటిలోనే కొన్నాళ్ల పాటు ఆఫీస్ రన్ చేశారు. `మా` ఎంతో మందికి నీడనిచ్చింది. మరెంతో మందికి సహాయం గా నిలుస్తుంది. `మా` తరుపున నరేష్ అధ్యక్షతన ఇప్పటికే ఒక సర్వే కమిటీ ఏర్పాటు చేసి ఎంతో మందికి అన్ని రకాలుగా సహాయం అందించడం జరిగింది. 35 మందికి 2500 రూపాయలను అందించడం, ఉచితంగా ఆరోగ్య కార్డులను ఇవ్వడం జరిగింది. ఈరోజు రెండవ సర్వే కమిటీ కూడా జెండా ఊపి ప్రారంభిస్తున్నాం. `మా` లో ఉన్న ప్రతి ఆర్టిస్ట్ దగ్గరకు నేరుగా వెళ్లి వాళ్ల సమస్యలను తెలుసుకుని, వాటిని తీర్చేందుకు ఈ కమిటీ పనిచేస్తుంది. మొదటి సర్వే కమిటీలో లబ్దిపొందిన వారికి ఈ కమిటీ ఉపయుక్తంగా ఉండదు. అలాగే ఎస్. వి. కృష్టారెడ్డిగారు చైర్మన్ గా ఓల్డేజ్ హోమ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. `మా` అధ్యక్ష పదవిలో ఎవరున్నా ఐదేళ్లు మాత్రం ఓల్డేజ్ హోమ్ బాధ్యతల్నీ ఆయనే నిర్వర్తిస్తారు. అలాగే ఈ సిల్వర్ జూబ్లీ వేడుకలకు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, మోహన్ బాబు గారు మెంటర్స్ గా ఉండటానికి అంగీకరించారు. నాగార్జున గారు తమ స్టూడియోలను ఉచితంగా వినియోగించుకోమని అనుమతి కూడా ఇచ్చారు. ఈరోజు నుంచి ఈనెల 30వ తేదీ వరకూ మా మెంబర్ షిప్ డ్రైవ్ చేపడుతుంది. లక్షల్లో పారితోషికం తీసుకునే వాళ్లంతా మెంబర్ షిప్ తీసుకోవాలి. లేకపోతే `మా` నుంచి ఎలాంటి సహకారం అందదు. ఇది హెచ్చరిక కాదు. విన్నపం మాత్రమే“ అని అన్నారు.
ఎస్. వి. కృష్ణారెడ్డి మాట్లాడుతూ… ` నాకు అప్పగించిన ఓల్డేజ్ హోమ్ బాధ్యతను సంతృప్తిగా స్వీకరిస్తున్నా. ఓల్డేజ్ హోమ్ కాదు. గోల్టేజ్ హోమ్ ఇది. శివాజీ కమిట్మెంట్, రెస్పాన్స్ బిలిటీ గల వ్యక్తి. `మా`కోసం ఆయన చాలా కష్టపడుతున్నాడు. `మా` ను మరింత ముందుకు తీసుకెళ్లాలి` అని అన్నారు.
అలాగే సినిమా ఆర్టిస్టుల పై అసభ్యకరంగా రాసిన వెబ్ సైట్ల గురించి `మా` తరుపున సైబర్ క్రైమ్ ఎస్. పి. రామ్మోహనరావుకు వినతి పత్రం అందించారు. ఎస్. పి. రామ్మోహనరావు మాట్లాడుతూ…` కొన్ని వెబ్ సైట్లలో సినిమా వాళ్ల గురించి మరీ నీచంగా కథనాలు వస్తున్నాయి. అది పైశాచిక ఆనందం మాత్రమే. అలాంటి వాళ్లపై తప్పకుండా సైబర్ క్రైమ్ కఠినమైన చర్యలు తీసుకుంటుందని` హెచ్చరించారు.
అలాగే `మా` సహాయ నిధికి నటి సూర్య ప్రభ 25000 రూపాయల చెక్ ను అందించారు. అలాగే ఇటీవల చనిపోయిన ప్రొడక్షన్ చీఫ్ చిరంజీవి కుటుంబానికి తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ `మా` ఆధ్వర్యంలో 5 లక్షల రూపాయల చెక్ ను అందించారు.
ఈ కార్యక్రమంలో `మా` వైస్ ప్రెసిడెంట్ బెనర్జీ, జాయింట్ సెక్రటరీ ఏడిద శ్రీరామ్, హేమ, ట్రెజరర్ పరుచూరి వెంకటేశ్వరరావు, కల్చరల్ కమిటీ చైర్మన్ సురేష్ కొండేటి, మెడీ క్లైమ్ చైర్మన్ నాగినీడు, గౌతంరాజు, అనితా చౌదరి తదితరులు పాల్గోన్నారు.