కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై సురేందర్ రెడ్డి దర్శకత్వం లో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
కధాంశం… ఝాన్సీ లక్ష్మీబాయ్(అనుష్క) ప్రథమ స్వాతంత్య్ర సమరం లో తన సైనికుల్లో స్ఫూర్తి నింపడానికి రేనాటి వీరుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ కథను చెబుతుంది…ప్రథమ స్వాతంత్య్ర సమరం కంటే ముందు..అంటే 1847లో రాయలసీమలోని ఉయ్యాలవాడ ప్రాంతానికి చెందిన పాలెగాడు నరసింహారెడ్డి(చిరంజీవి). బ్రిటీష్ పరిపాలనలో ఉన్న ఈ ప్రాంతంలో 61 మంది పాలెగాళ్లు ఉండేవారు. చిన్నప్పటి నుండే బ్రిటీష్‌వారు పన్నుల కోసం చేస్తున్న అఘాయిత్యాలను చూసి తిరగబడాలనే మనస్తత్వాన్ని పెంచుకుంటాడు. అతనికి గోసాయి వెంకన్న(అమితాబ్ బచ్చన్) గురువుగా ముందుకు నడిపిస్తుంటాడు. తీవ్రమైన కరువు వచ్చినప్పుడు.. బ్రిటీష్‌వారు ఆ ప్రాంతంలోని రైతులు, వ్యాపారులను పన్నులు కట్టమని వేధించడం మొదలు పెడతారు. బ్రిటీష్‌వారి అకృత్యాలు చూడలేక నరసింహారెడ్డి వారికి ఎదురుతిరుగుతాడు. అతనికి అవుకురాజు(కిచ్చాసుదీప్), రాజా పాండి(విజయ్ సేతుపతి), వీరారెడ్డి(జగపతిబాబు) అండగా నిలుస్తారు. పోరాటం కోసం భార్య సిద్ధమ్మ (నయనతార)ను కూడా విడిచిపెట్టేసిన నరసింహారెడ్డికి బలం పెరుగుతూ వస్తుంటుంది. దీంతో బ్రిటీష్‌వారు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటారు. నరసింహారెడ్డి ఉండే నొస్సం కోటపై దాడి చేస్తారు. అక్కడ బ్రిటీష్ వారిని చంపేసి నరసింహారెడ్డి నల్లమల అడవుల్లో దాక్కుంటాడు. అప్పుడు బ్రిటీష్ వారు వేసిన పన్నాగం ఎటువంటిది. బ్రిటీష్‌వారిని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎలా ఎదిరించాడు.ఎలాంటి పోరాటాలు చేశాడు. చివరగా నరసింహారెడ్డికు వెన్ను పోటు పొడిచింది ఎవరు?…ఇలాంటి ఎన్నో చారిత్రక విషయాలు తెలుసుకోవాలంటే సినిమా లోనే చూడాలి …
విశ్లేషిస్తే… స్వాతంత్ర కోసం పోరాడిన వీరుడు.. చరిత్రలో కానరాని సూర్యుడు.. మన తెలుగువాడు.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన పోరాటాన్ని వెలికి తీసుకు రావడంలో చిరంజీవి, చరణ్, సురేందర్‌రెడ్డి టీం మంచి ప్రయత్నం చేశారు.ఓ స్వాతంత్ర సమరయోధుడి సినిమాను తెరకెక్కించడం అంత తేలికైన పని కాదు. అది కూడా చరిత్రలో కనుమరుగైన ఓ సమరయోధుడి కథతో చేసిన దర్శకుడు సురేందర్ రెడ్డి, నిర్మాత రామ్‌చరణ్‌లను అభినందించాలి. ముఖ్యంగా రామ్‌చరణ్ నిర్మాణం లో కాంప్రమైజ్ కాలేదు. సినిమాలోని ప్రతి సన్నివేశం ఎంతో రిచ్‌గా ఉంది. దర్శకుడు సురేందర్ రెడ్డి సినిమాను తన శక్తి మేర చక్కగా విజువల్ వండర్‌లా తెరకెక్కించాడు. ఈ కథ చెప్పడానికి దర్శకుడు ఎంచుకున్న స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది.
చారిత్రక కధాంశం తో మూవీని ఓ పెద్ద హీరో చేస్తున్నప్పుడు.. అందులో కాస్త సినిమాటిక్ లిబర్టీని తీసుకోవడంలో తప్పులేదు. అయితే ఇందులో ఆ లిబర్టీని కాస్త ఎక్కువగా తీసుకున్నట్లు కనపడుతుంది. మూడు నాలుగు తాలూకాలను పాలించే పాలెగాడు నరసింహారెడ్డి. చిన్న పాలెగాడుని పెద్ద చక్రవర్తి అనే తరహాలో సినిమా యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. అవి పాలెగాడు పదవి కూడా లేని ఓ ఉద్యమకారుడు చేసినట్లు అనిపించదు. ముఖ్యంగా పదివేల మంది బ్రిటీష్ వాళ్లని నరసింహారెడ్డి తన వాళ్లతో కలిసి చంపినట్లు చూపించారు. అసలు కర్నూలు లో అంత పెద్ద యుద్దం జరిగిందా ..అదెలా చరిత్ర మర్చిపోయింది? అనే సందేహం ఎవరికైనా వస్తుంది. నిజానికి నరసింహారెడ్డి ఎక్కువగా గెరిల్లా యుధ్ధానికి ప్రాధాన్యత ఇచ్చి పోరాటం చేశాడు. అలాగే నరసింహారెడ్డి భార్య సిద్ధమ్మ నరసింహారెడ్డి బ్రిటీష్‌వారికి లొంగక ముందే చనిపోతుంది. కానీ సినిమాలో ఆ విధంగాలేదు.ఈ దేశభక్తి సినిమాకు కమర్షియల్ టచ్ మరీ ఎక్కువైందని కొన్నిసీన్స్ లో అనిపిస్తుంది. బ్రిటీష్ వాళ్ళ ఆగడాలు, అప్పటి జనాల స్థితిగతులు చెప్పడానికే ఫస్ట్ హాఫ్‌ను ఎక్కువగా వాడుకున్నాడు దర్శకుడు. ఫస్టాఫ్ ని పూర్తిగా కధకోసం వాడుకోవడంతో చాలా స్లోగా నడిచి ఇబ్బంది పెడుతుంది .సెకండాఫ్ లో వరసగా ఒకే రకం సన్నివేశాలు వస్తాయి. అయినా చూస్తున్నంతసేపు ఆ విషయం గుర్తుకు రాదు. ఆ విధంగా చిరంజీవి,సురేంద్రరెడ్డి మేనేజ్ చేసారు. క్లైమాక్స్ మాత్రం పూర్తిగా ఎమోషన్ ప్రధానంగా చేసారు.’మరణం కాదు ఇది జననం’.. అంటూ చిరు పలికే సంభాషణలు రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తాయి.
నటవర్గం… మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో అద్భుతంగా నటించాడు. యాక్షన్ పార్ట్‌లో చిరు చేసిన స్టంట్స్ .. ఎమోషనల్ సీన్స్ అద్భుతంగా పండించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశంలో చిరు నటన అభినందనీయం. అక్కడక్కడా చిరంజీవి గెటప్, డ్రస్ కొంచెం ఇబ్బందికరంగా అనిపించినా… కొన్ని సీన్స్ లో వయస్సు కనిపించినా.. ఆయన నటన ముందు అవన్నీ కనుమరుగై పోయాయి. ఇక బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ ఉన్న కాసేపు తనదైన నటనతో ఆకట్టుకున్నారు. అవుకురాజు పాత్రలో కిచ్చాసుదీప్, రాజాపాండి పాత్రలో విజయ్ సేతుపతి, సిద్ధమ్మ పాత్రలో నయనతార, లక్ష్మీ పాత్రలో తమన్నా, వీరారెడ్డి పాత్రలో జగపతిబాబు.. ఇలా అందరూ వారి పాత్రలలో జీవించారు
సాంకేతికంగా… అమిత్ త్రివేది సంగీతం, జూలియస్ పేకియం నేపథ్య సంగీతం బావున్నాయి. రత్నవేలు సినిమాటోగ్రఫీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి సన్నివేశాన్ని చక్కగా తన కెమెరాలో బంధించాడు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలను కెమెరాలో గొప్పగా చిత్రీకరించాడు. గ్రెగ్ పావెల్, లీ విట్టేకర్, రామ్ లక్ష్మణ్‌లు అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలను కంపోజ్ చేశారు -రాజేష్