తండ్రికి తగ్గ తనయుడు రామ్ చరణ్ పుట్టిన రోజు (మార్చి 12) వేడుకలను ఆదివారం నాడు మెగా అభిమానులు ఘనంగా నిర్వహించారు. శిల్పా కళా వేదికలో జరిగిన ఈ ఈవెంట్‌కు టాలీవుడ్ నుంచి ప్రముఖులు హాజరయ్యారు. దర్శకులు మెహర్ రమేష్, బాబీ, బుచ్చిబాబు సానా, దిల్ రాజు, మైత్రీ నిర్మాత నవీన్, సాయి ధరమ్ తేజ్, ప్రేమ్ రక్షిత్ వంటి వారు విచ్చేశారు. నాగబాబు ముఖ్య అతిథిగా వచ్చారు.
నాగబాబు మాట్లాడుతూ.. ‘మా ఇంట్లో మా ఐదుగురు బ్రదర్ అండ్ సిస్టర్లకు మొదటి కొడుకు రామ్ చరణ్. అన్నయ్య చిరంజీవికి కొడుకే అయినా.. నాకు, పవన్ కళ్యాణ్‌కు, మా చెల్లెళ్లకు కూడా కొడుకులాంటివాడే. ఇక మాకు చిరంజీవి గారు ఎలానో.. మా పిల్లలకు, మా చెల్లెలి పిల్లలకు, పవన్ కళ్యాణ్ పిల్లలకు రామ్ చరణ్ అలాంటి వాడు. వాళ్లకి ఏమైనా సమస్యలు వస్తే.. వాళ్లంతా ముందుంగా రామ్ చరణ్ వద్దకు వెళ్తారు. సలహాలు, సూచనలు తీసుకుంటారు. రామ్ చరణ్ ప్రస్తుతం పూర్తి మెచ్యూర్డ్ పర్సన్‌గా మారాడు. అదే నాకు రామ్ చరణ్‌లో నచ్చిన విషయం. ఒకప్పుడు కాస్త కోపం, ఆవేశంగా ఉండేవాడు. కానీ ఇప్పుడు ఎంతో మెచ్యూర్డ్‌గా మారాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలో మేజర్ పార్ట్ అవ్వడం, ఆస్కార్ వరకు వెళ్లడం, నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం, ఆ స్టేజ్ మీద రామ్ చరణ్ బొమ్మ కనిపించడం మనందరికీ ఎంతో గర్వంగా అనిపిస్తుంది. రామ్ చరణ్ బర్త్ డే సందర్బంగా.. ఆరెంజ్ సినిమాను రీ రిలీజ్ చేశాను. దాని ద్వారా వచ్చిన డబ్బును జనసేన పార్టీకి విరాళంగా ఇవ్వాలని అనుకున్నాను. జనం కోసం తన జీవితాన్ని వదిలేసిన నాయకుడికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతోనే నాకు చేతనైన సాయాన్ని చేస్తున్నాను. ఆరెంజ్ సినిమా అప్పుడు రిలీజ్ చేస్తే యావరేజ్ అన్నారు. ఆర్థికంగా అప్పట్లో నష్టపోయాను. కానీ ఇప్పుడు అదే సినిమాను అందరూ బాగుందని అంటున్నారు. రెండ్రోజులుగా ఆరెంజ్ సినిమా సక్సెస్ ఫుల్‌గా నడుస్తోంది. అంటే ఒక తరం ముందే ఆ సినిమాను తీశామని అనిపిస్తుంది. అదే సినిమాను ఇప్పుడు తీసి ఉంటే హిట్ అయ్యేది. ఇక్కడ సీఎం సీఎం అని అరిస్తే కాదు.. దమ్ముంటే ఎన్నికల్లో పాల్గొని, జనాలను ఉత్తేజ పరిచి.. ఓట్లు వేయండి’ అని అన్నారు.
దిల్ రాజు మాట్లాడుతూ.. ‘రామ్ చరణ్ గారు ఇప్పుడు గ్లోబల్ స్థాయి వరకు వెళ్లారు. ఆర్ఆర్ఆర్ తరువాత గ్లోబల్ స్థాయిలో సినిమాను శంకర్ గారు ప్లాన్ చేస్తున్నారు. మిమ్మల్ని (అభిమానుల్ని), తెలుగు ప్రేక్షకులను ఎలా సంతృప్తి పర్చాలో ఆ రేంజ్లో అద్భుతమైన సినిమాను శంకర్ గారు రెడీ చేస్తున్నారు. సాంగ్ షూట్ అవ్వగానే బర్త్ డే సెలెబ్రేషన్స్ స్టార్ట్ చేశామ’ని అన్నారు.
మైత్రీ నిర్మాత నవీన్ మాట్లాడుతూ.. ‘రంగస్థలం సినిమాలో ఆయన బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చారు. అలాంటి సినిమాను మా సంస్థలో చేసినందుకు ఆయనకు థాంక్స్. ఇలాంటి పుట్టిన రోజులు ఆయన మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. ‘అభిమానుల తరుపున రామ్ చరణ్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్థాయికి వెళ్లాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో రేంజ్ మారిపోయింది. ఇంకా మరిన్ని సక్సెస్‌లు చూడాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
మెహర్ రమేష్ మాట్లాడుతూ.. ‘చిరుత సినిమాను మహేష్ బాబు, ఎన్టీఆర్‌లతో కలిసి ప్రివ్యూ చూశాను.. చరణ్ పెద్ద స్టార్ అవుతాడు.. చిరంజీవి గారి డ్యాన్స్, యాక్షన్ కాకుండా.. తనలో ఎనర్జీ ఉందని అన్నారు. చిరంజీవి గారు రాజకీయాల్లోకి వెళ్లిన తరువాత, సినిమాలకు దూరంగా ఉన్న సమయంలో మగధీర సినిమాతో వచ్చి ఊపిరి పోశాడు. హాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. చిరంజీవి గారితో కలిసి రామ్ చరణ్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మనకు మూడు పండుగలున్నాయి. చిరంజీవి గార్ బర్త్ డే, పవన్ కళ్యాణ్ బర్త్ డే, రామ్ చరణ్ బర్త్ డే’ అని అన్నారు.
డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ.. ‘చిరంజీవి గారికి కొడుకుగా, పవన్ కళ్యాణ్ లాంటి వారికి బాబాయ్ అబ్బాయ్‌లా ఉండటం..పెరగడం అదృష్ణమో.. అంతే ఒత్తిడి కూడా ఉంటుంది. మెగాస్టార్ గ్రేస్, డ్యాన్స్‌లతో అభిమానులను సంతృప్తి పర్చడం అంటే చిన్న విషయం కాదు. బాబాయ్‌లో ఉన్న ఆవేశం, దుడుకుదనం, రోడ్డు మీద అన్యాయం జరిగితే మాట్లాడటం, ఇన్ని కలిసి రావాలి.. ఇంత ఒత్తిడిలో చిరుత నుంచి మొదలు పెట్టి గ్లోబల్ స్థాయిలో ఎదిగేందుకు ఎన్ని రాత్రులు నిద్రపోకుండా శ్రమించి ఉంటారో. సర్దార్ గబ్బర్ సింగ్ టైంలో పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఒత్తిడిలో ఉంటే ఫోన్ చేసి మరీ పిలిపించుకునే వ్యక్తి రామ్ చరణ్. ఆయన ఫోన్ చేసిన వెంటనే వచ్చి.. ఓ కొడుకులా, తమ్ముడిలా వచ్చేవాడు. నవ్వించేవాడు. ఒత్తిడిని దూరం చేసేవాడు. మెగా ఫ్యాన్‌గా రామ్ చరణ్‌ని చూస్తే ఎంతో గర్వంగా ఉంది’ అని అన్నారు.
బుచ్చిబాబు సానా మాట్లాడుతూ.. ‘అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుంచి రామ్ చరణ్ సర్ని చూస్తూ వస్తున్నాను. ఇప్పుడు నేనేం మాట్లాడను. నా ప్రేమనంతా కూడా సినిమాలో చూపిస్తాను’ అని అన్నారు.
నటుడు అభి మాట్లాడుతూ..‘నార్త్‌లో నా ఫ్రెండ్స్‌ని ఆర్ఆర్ఆర్ సినిమాలో ఏం నచ్చిందని అడిగాను. రామ్ చరణ్‌లో రాముడ్ని చూసుకున్నామని అన్నారు. వాళ్లకి అల్లూరి సీతారామరాజు కాకుండా రాముడు కనిపించాడు. ఇన్నాళ్లు పవనిజం అన్నారు.. భవిష్యత్తులో చరణిజం అనాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
హైపర్ ఆది మాట్లాడుతూ.. ‘పది మందికి దండం పెడితే అది మెగాస్టార్.. పది మందికి అన్నం పెడితే అది పవర్ స్టార్.. చిరంజీవిలా భుజం తట్టి ఎంకరేజ్ చేయడం తెలుసు.. బాబాయ్ పవన్ కళ్యాణ్‌లా అందరికీ భోజనం పెట్టి, హెల్ప్ చేయడం తెలుసు.. దటీజ్ మెగా పవర్ స్టార్.. ప్రతీ మందిలో ఒకడు చిరంజీవికి అభిమాని అయి ఉంటాడు. తరాలు మారొచ్చు.. కొత్త హీరోలు రావొచ్చు.. రికార్డులు క్రియేట్ చేయోచ్చు.. కానీ రికార్డులు అనేది పుట్టిందే చిరంజీవిని చూసి.. ఒకసారి నెంబర్ వన్ అయితే.. ఎప్పటికీ నెంబర్ వన్ అని చిరంజీవి గారు నిరూపించారు. ఆయన గురించి ప్రతీ ఒక్కరూ ఏదో ఒకటి మాట్లాడతారు. పొన్నాంబలం ఆరోగ్యం బాగా లేకపోతే నలభై లక్షలు పెట్టి వైద్యం చేయించారు. పవన్ కళ్యాణ్.. జనాభా లెక్కల్లో ఒక్కడు కాదు.. లెక్కలేనంత జనాభాకు ఒకే ఒక్కడు.. నోటుకు ప్రమేయం లేని ఓటును, పదవికి ప్రలోభం కానీ రాజకీయాన్ని నడుపుతున్న, నడుస్తున్న నాయకుడు పవన్ కళ్యాణ్. తండ్రి పేరు నిలబెడతాడా? బాబాయ్ పేరు కాపాడతాడా? అన్న వారికి.. నేను కుటుంబానికి పేరు తీసుకురావడానికి పుట్టిన వాడ్ని కాదు.. దేశానికి పేరు తేవడానికి పుట్టిన వాడిని అని అనిరూపించారు రామ్ చరణ్. మెగా పవర్ స్టార్ అంటే లోకల్ కాదు.. గ్లోబల్’ అని అన్నారు.
ప్రేమ్ రక్షిత్ మాస్టర్ మాట్లాడుతూ.. ‘మగధీరలో బంగారు కోడిపెట్ట అనే పాటను మా ప్రయాణం మొదలైంది. నేటి వరకు అది కొనసాగుతోంది. ఆయన చాలా మంచి వారు. ఆయన అందరినీ ఎంతో చక్కగా చూసుకుంటారు’ అని అన్నారు.
రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ.. ‘ఆస్కార్ వేదిక మీద పర్ఫామెన్స్ ఇవ్వడం అనేది ఎప్పటికీ మర్చిపోలేను. రామ్ చరణ్ సర్‌కు హ్యాపీ బర్త్ డే’ అని అన్నారు.