నేనెంతో పరిణితి చెందాను అంటున్నాడు ఉదయ్ కిరణ్. సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నానని అంటోన్న ఉదయ్ కిరణ్ ఈ నెల 26న పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో ముచ్చటించారు. ఆ వివరాలిలావున్నాయి....
పరిణితి చెందాను :
ఈ పుట్టినరోజు నా జీవితంలో ప్రత్యేకమైనది. ఎందుకంటే నేను ప్రస్తుతం పరిణితి చెందాను. కొన్ని మంచి విషయాలు తీసుకుని, వాటిని పాటిస్తున్నాను. ఒక సానుకూల దృక్పథంతో నన్ను నేను చూపించుకోనున్నాను. సినిమా పరిశ్రమకు వచ్చిన తరువాత నేను హ్యాపీడేస్ చూశాను, డల్ డేస్ చూశాను. మంచీచెడు రెండూ చూడటం వల్ల నాలో ఈ పరిణితి కలిగింది. దాంతో నేను చేయబోయే సినిమా కూడా దానికి తగ్గ విధంగానే
వుంటుంది.
కష్టపడుతున్నాను :
గతంలో నేను చేసిన సినిమాల విషయానికి వస్తే... ముందు సినిమా కథ విన్నప్పుడు చాలా బాగుంది అనిపించింది. సినిమా విడుదలైన తర్వాత ఎందుకు ఈ సినిమా చేశఆమా అనిపిస్తుంది. ప్రస్తుతం నేను కష్టపడి పని చేస్తున్నాను కానీ... నాకు లక్ కలిసి రావడంలేదు. ఒకప్పుడు నేను సినిమా లైన్ విని సినిమాలు ఒప్పుకునే వాడిని. అయితే సినిమా ఒప్పుకునే ముందు అన్ని విషయాల్లో ప్రిపేర్ అయి ఒప్పుకుంటున్నాను.
పునర్నిర్మించుకుంటున్నాను :
ప్రస్తుతం నన్ను నేను పునర్నిర్మించుకోవడం కోసం చాలామంది పడిలేసిన వారి కెరీర్స్ ను పరిశీలించాను. సినిమా పరిశ్రమలో ఒక్క సక్సెస్ వస్తే మొత్తం మారిపోతుంది. దానికోసమే ఈ ప్రయత్నమంతా చేస్తున్నాను. అందులో భాగంగా శ్రమలోపం లేకుండా చూసుకుంటున్నాను.
దిల్ కబడి :
ఈ నెల 26న నా పుట్టినరోజు. 27న ‘దిల్ కబడి’ అనే సినిమా ప్రారంభం కానుంది. శ్రీ అనే యువ దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ప్రేమ- రెండు మనసుల మధ్య జరిగే కబడీ. సినిమా మొత్తం ఎంటర్టైనింగ్ లాగా వుంటుంది. సునిల్ కాశ్యప్ సినిమాకు సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో పాత్రలు చాలా సహజంగా వుంటాయి.
అలావుండదు:
గతంలో నేను చేసిన సినిమాలన్నిటిలో రాముడు మంచి బాలుడు తరహా పాత్రలు ఎక్కువగా చేశాను. అయితే అలా వుండకూడదని అనుకున్నాను. అంతేకాదు నెగిటివ్ రోల్స్ వచ్చినా కూడా చేస్తాను.
మల్టీస్టారర్ చేస్తానుకానీ...
మల్టీస్టారర్ సినిమాల్లో చేస్తాను. అయితే ప్రస్తుతం తెలుగులో ఇద్దరు ముగ్గురు హీరోలు కలిసి నటించడానికి రెండవ హీరో మూడవ హీరో అనేవి వుంటున్నాయి. అవిలేకుండా వుంటే అలాంటి సినిమాలు చేయవచ్చు.
పార్టీలకు దూరం :
నేను పార్టీలకు, పబ్ లకు దూరంగా..... చాలా రిజర్వ్ గా వుంటాను. మా ఇంట్లో ఫంక్షన్స్ జరిగినా కూడా నేను పెద్దగా అందులో పాల్గోను. వాటిని నేను వ్యతిరేకిస్తున్నానని కాదు కానీ నా మనస్థత్వం అలాంటిది. నా లోకంలో నేను వుంటాను... అంటూ తన మనసులోని భావాలను వెల్లడించాడు ఉదయ్ కిరణ్.