“దర్శకత్వం నాకు కంఫర్టబుల్ జాబ్ అనిపించింది.దర్శకత్వం నా ఫస్ట్ లవ్. ఇకపై దర్శకురాలిగా మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నాను’ అని అంటున్నారు కంగనా రనౌత్. ఆమె ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’. ఝాన్సీ రాణి లక్ష్మిబాయి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిస్తున్న చిత్రమిది. ఝాన్సీ రాణిగా కంగనా నటిస్తున్నారు. క్రిష్ కొంత భాగం, కంగనా కొంత భాగం దర్శకత్వం వహించారు.
ఈ చిత్ర ట్రైలర్‌ని మంగళవారం విడుదల చేశారు. ‘ఝాన్సీ ప్రాంతంపై బ్రిటిషర్ల కన్ను పడింది. ఒకవేళ ఝాన్సీని కాపాడే వీరుడు రాకపోతే ఈ ప్రాంతాన్ని కూడా కోల్పోవాల్సి వస్తుంది’ అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ఆ తర్వాత ఓ వ్యక్తి ‘నేను ఓ అమ్మాయిని చూశా. పేరు మణికర్ణిక’ అని చెబుతుండగా, కంగనా పులిని విల్లుతో వేటాడటం, ఏనుగును ఎక్కే సన్నివేశం,ఝాన్సీ రాణిగా మణికర్ణికను ప్రకటిస్తున్నప్పుడు ‘లక్ష్మీబాయి అనే నేను.. నా శరీరంలో రక్తం ప్రవహిస్తున్నంత వరకు ఝాన్సీని కాపాడతానని మాటిస్తున్నా’ వంటి డైలాగులు,తన భర్త, బిడ్డను కోల్పోవడం, బ్రిటీషర్లను అంతమొందించడం వంటి సన్నివేశాలు ట్రైలర్లో ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇందులో క్రిష్‌తోపాటు కంగనా రనౌత్‌కి కూడా డైరెక్టర్ క్రెడిట్ ఇచ్చారు.
ఈ ట్రైలర్ లాంచ్ సందర్భంగా కంగనా తన అనుభవాలను పంచుకుంటూ… ‘షూటింగ్ ప్రారంభించిన తొలి రోజే నా నుటికి గాయమై 20 కుట్లు పడ్డాయి. అది మర్చిపోలేని సంఘటన.ఆ తర్వాత దర్శకుడు మరో ప్రాజెక్ట్ కోసం ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్టు తెలిసినప్పుడు నేనింకా రెడీగా లేను. కానీ నా టీమ్ నన్ను నమ్మారు. ఆ క్షణం నేను లక్కీయస్ట్ పర్సన్‌గా ఫీలయ్యాను. విడుదలకు సంబంధించి నాపై ఎలాంటి ఒత్తిడి లేదు. నిర్మాతలు నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. దర్శకత్వం నాకు కంఫర్టబుల్
జాబ్ అనిపించింది. ఈ సినిమాతో మున్ముందు దర్శకురాలిగా నాకు మరిన్ని అవకాశాలు వస్తాయనుకుంటున్నాను’ అని అన్నారు.
ఈ సినిమా రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25న విడుదల కానుంది.