సినీవినోదం రేటింగ్ : 1.5 / 5
పద్మజ పిక్చర్స్ బ్యానర్ పై జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో కీర్తి చౌదరి, కిట్టు ఈ చిత్రాన్ని నిర్మించారు.
కృష్ణమాచారి(మంచు విష్ణు).. అతని గురువు అప్పలాచారి(బ్రహ్మానందం) తో పాటు ప్రవీణ్, ప్రభాస్ శ్రీనులతో కలిసి పూజలు, హోమాలు చేయిస్తుంటారు. ఓసారి రాజుగారు(ప్రదీప్ రావత్) ఇంట్లో హోమం జరిపించడానికి వెళతారందరూ. ఆ సమయంలో ఇంటి పెద్ద( కోట శ్రీనివాసరావు) చనిపోవడంతో రాజుగారు అతని తమ్ముడు కలిసి కృష్ణమాచారి అండ్ కోను చంపడానికి ప్రయత్నిస్తారు. రౌడీల భారి నుండి తప్పించుకోవడానికి కృష్ణమాచారి అండ్ కో అమెరికా చేరుకుంటారు. అక్కడ ఓ పెద్ద కంపెనీ యజమాని(అనూప్ సింగ్)కి పెళ్లి ముహూర్తం చూడటానికి వెళతారు. అక్కడ రేణుక(ప్రగ్యా జైశ్వాల్)ని చూసి షాకవుతారు. తర్వాత ఏమైందనేదే అసలు కథ. అసలు కృష్ణమాచారి, రేణుక మధ్య సంబంధం ఏంటి? అసలు రాజుగారు అండ్ కో కృష్ణమాచారిని ఎందుకు చంపాలనుకుంటారు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమాలో చూడాలి….
జి.నాగేశ్వరరెడ్డి సినిమా అంటే కామెడీ పార్ట్ మినిమంగా ఎక్స్‌పెక్ట్ చేసే ప్రేక్షకులకు ఆచారి నిరాశనే మిగిల్చేలా సినిమా ఉంటుంది. అంచనాలను అందుకోలేకపోయింది సినిమా. కొత‍్తదనం లేని కథా కథనాలు ఎంచుకున్న దర్శకుడు.. ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాడు .సిల్లీ ప్లాట్, లాజిక్ లేని సన్నివేశాలు.. నవ్వించేంత కామెడీ లేకపోవడం… పూర్ స్క్రిప్ట్, ఎమోషనల్‌గా, కామెడీ పరంగా ఆకట్టుకునే సన్నివేశాలు లేకపోవడం సినిమాకు పెద్ద మైనస్‌గా మారింది. ఇలాంటి కథ, కథనాలు తెలుగు ప్రేక్షకులకు కొత్తేం కాదు.కాలం చెల్లిన కామెడీ ట్రాక్స్ వలన సినిమా ఆద్యంతం బోర్ కొట్టించేసింది. ముఖ్యంగా ఆఖరి అరగంటలో వచ్చే పృథ్వి కామెడీ ట్రాక్ చికాకు పుట్టిస్తుంది.
బ్రహ్మానందం, మంచు విష్ణు బ్రాహ్మణుల గెటప్లో వీరిద్దరూ సినిమాలో చాలా చోట్ల నవ్వించే ప్రయత్నం చేశారు. చాలా రోజుల తర్వాత పూర్తిస్థాయి పాత్రలో సినిమా ఆసాంతం బ్రహ్మి కనపడి తన వంతుగా నవ్వించే ప్రయత్నం చేశాడు. పెళ్లికాని పురోహితుడిగా, అలాగే అమెరికా వెళ్ళాక శిష్యుడు చేసే తప్పులకు భయపడుతూ, ఎరక్కపోయి ఇరుక్కుపోయిన గురువు పాత్రలో బ్రహ్మానందం పెర్ఫార్మెన్స్ కొన్ని చోట్ల మాత్రం నవ్వులు పూయించింది.ఎక్కువ భాగం బ్రహ్మానందం కామెడీ నవ్వించేంత బాగా లేదు సరికదా… విసుగెత్తించేలా మాత్రం ఉంది. కథలో ముఖ్యమైన తాత, మనవరాళ్ల సెంటిమెంట్ ట్రాక్ ఎమోషనల్ గా కొంత వర్కవుట్ అయ్యింది.
మంచు విష్ణు గతంలో ‘దేనికైనా రెడీ’ సినిమాలో కనిపించినట్టుగానే ఈ సినిమాలోనూ కనిపించాడు. దాదాపుగా అదే తరహా లుక్, క్యారెక్టరైజేషన్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. తన పరిథి మేరకు కృష్ణమాచారి పాత్రకు న్యాయం చేశాడు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్‌లో మంచు విష్ణు పెర్ఫామెన్స్ ఆకట్టుకుంటుంది. కామెడీ పండించే ప్రయత్నం చేశాడు కానీ క్యారెక్టరైజేషన్ బలంగా లేకపోవడంతో ప్రేక్షకుడికి కనెక్ట్ కాదు. ఇలాంటి పాత్రలను తెలుగు హీరోలు చాలా సినిమాల్లో చేసేశారు. కాబట్టి ప్రేక్షకుడికి ఇందులో కొత్తదనం కనపడదు. రేణుక పాత్రలో ప్రగ్యా జైస్వాల్ అభినయంతో మెప్పించింది.. గ్లామర్ షోతో ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. అనూప్ సింగ్ థాకూర్ తెరమీద కనిపించింది కొద్ది సేపే అయినా ఉన్నంతలో మంచి విలనిజం పండించాడు. హీరో ఫ్రెండ్స్ ప్రభాస్ శ్రీను, ప్రవీణ్‌లు నవ్వించే ప్రయత్నం చేశారు. ఇతర పాత్రల్లో కోటా శ్రీనివాసరావు , ప్రదీప్ రావత్, రాజా రవీంద్ర తమ పాత్రలకు న్యాయం చేశారు
మల్లాది వెంకటకృష్ణ మూర్తి సినిమాని నిలబెట్టే స్థాయి కధను ఇవ్వలేకపోయారు. సంగీత దర్శకుడు తమన్ గుర్తుండిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కానీ, పాటల సంగీతాన్ని కానీ ఇవ్వలేదు. సిద్దార్థ రామస్వామి సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. అమెరికా లోకేషన్లతో పాటు పాటల విజువల్స్ బాగున్నాయి. వర్మ ఎడిటింగ్ ద్వారా ద్వితీయార్థంలో కొన్ని సన్నివేశాలను తొలగించాల్సింది
– ధరణి