సూపర్‌స్టార్ మహేష్, ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్లో ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా ఎల్ఎల్పి పతాకంపై ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘స్పైడర్’. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం శనివారం చెన్నైలో జరిగింది. హేరిస్ జయరాజ్ సంగీతం అందించిన ఈ ఆడియోను ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్ సతీమణి రమ్య, హేరిస్ జయరాజ్ సతీమణి సంయుక్తంగా విడుదల చేశారు.
ఈ సందర్భంగా సూపర్‌స్టార్ మహేష్ మాట్లాడుతూ – ”ఈ సినిమాతో నువ్వు తమిళ్లో అడుగు పెడుతున్నావు కదా!’ అని అందరూ అంటుంటే సంతోషంగా వుంది. నిజానికి సినిమాల్లోకే తొలిసారి అడుగు పెడుతున్నంత ఉద్వేగంగా వుంది. 18 ఏళ్ళ నా కెరీర్లో ‘స్పైడర్’ ఓ కొత్త అనుభూతినిచ్చింది. తొలి సినిమా చేస్తున్నానేమో అనిపిస్తోంది. మురుగదాస్‌తో సినిమా అనేది పదేళ్ళ కల. చాలా సందర్భాల్లో కలిసి మాట్లాడుకున్నాం. ఓసారి ఆయన ఇంటికొచ్చి కథ వినిపించారు. అప్పుడు ఏ కథైతే చెప్పారో ఇప్పుడు అదే కథని తెరకెక్కించారు. 120 కోట్ల భారీ బడ్జెట్ చిత్రంలో నటించడం ఆనందంగా వుంది. అంత స్థాయిలో సినిమాని నిర్మించడానికి కూడా గట్స్ వుండాలి. ఈ విషయంలో నిర్మాతల్ని అభినందిస్తున్నాను. హేరిస్ సంగీతం, పీటర్ హెయిన్స్ ఫైట్స్ ఈ సినిమాకి ప్రధాన బలం. పదేళ్ళ క్రితం ఎస్.జె.సూర్య దర్శకత్వంలో ‘నాని’ సినిమా చేశాను. ఆ సినిమా చేశాక కూడా మా మధ్య దర్శకుడు, నటుడు బంధం కొనసాగుతోంది. ఇప్పుడు ఈ చిత్రంలో హీరో, విలన్‌గా నటించాం. క్లైమాక్స్‌లో ఇద్దరం ఒకరిని ఒకరు పగతో చూసుకునే సన్నివేశాలు చూస్తే నవ్వొచ్చేసింది. ఫలానా సినిమా చెయ్యాలి ..అని ఎప్పుడూ అనుకోలేదు. నాకన్నీ మంచి అవకాశాలే వచ్చాయి. ‘తుపాకి’ మాత్రం తెలుగులో రీమేక్ చెయ్యాలనిపించింది. అప్పట్లో కుదరలేదు. నా కెరీర్లోనే బాగా నచ్చి చేసిన సినిమా ఇది. తెలుగు రాష్ట్రాల్లో ఊహించని స్థాయిలో అభిమానుల్ని ఇచ్చాడు దేవుడు. ఈ జన్మకు ఇది సరిపోతుంది. నా సినిమాల్లో అత్యుత్తమం ఏదని అడిగితే ‘స్పైడర్’ పేరే చెబుతాను” అన్నారు మహేష్.
మురుగదాస్ మాట్లాడుతూ – ”విజయవాడలో ‘ఒక్కడు’ సినిమా చూసినపుడే మహేష్‌తో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. అప్పట్లో మహేష్‌తో ‘గజిని’ని రీమేక్ చేద్దామనిపించింది. ‘తుపాకి’ కూడా మహేష్‌తో చేయాలనుకున్నాను. కొన్ని కారణాల వల్ల డబ్బింగ్ సినిమాలే రిలీజ్ అయ్యాయి. రెండు భాషల్లో ‘స్పైడర్’ చేయడం చాలా పెద్ద బాధ్యత అనిపించింది. ప్రతీ షాట్‌ని తెలుగు, తమిళ్లో విడివిడిగా చేశాం. అంతటి కష్టాన్ని కూడా మహేష్ ఓర్చుకొని పూర్తి చేశారు. నేనేం ముఖస్తుతి కోసం చెప్పడం లేదు. నాకు అవసరం కూడా లేదు. డేట్లు కావాలన్నా ‘తీసుకోండి’ అని గజిని టైమ్‌లో అమీర్‌ఖాన్ చెప్పారు. ఆ తర్వాత అలా చెప్పింది మహేషే. ఈ సినిమా చేయడం మహేష్‌కే సాధ్యమైంది. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది. ఆ క్రెడిట్ ఖచ్చితంగా మహేష్‌కే దక్కుతుంది. ఈనెల 15న ట్రైలర్ విడుదల చేస్తున్నాం. అందులో క్లిప్పింగ్స్ చూస్తే పీటర్ హెయిన్స్ శ్రమ తెలుసుకుంటారు. ఒక్కో యాక్షన్ ఎపిసోడ్లో సుమారు 2 వేల మంది కనిపిస్తారు” అన్నారు.
ఎస్.జె.సూర్య మాట్లాడుతూ – ”రజనీకాంత్‌కి ‘చంద్రముఖి’లా మహేష్‌కి ‘స్పైడర్’ పేరు తెస్తుంది. మా సూపర్‌స్టార్ రజనీకాంత్‌ని తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. తెలుగు సూపర్‌స్టార్‌కి ఇక్కడి ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. ‘స్పైడర్’లో మహేష్‌ని ఓ హాలీవుడ్ హీరోగా చూస్తారు” అన్నారు.
”మహేష్‌తో ఒక్క సినిమా అయినా చేయాలని నా కోరిక. అది ఈ సినిమాతో తీరింది. సంతోష్ శివన్గారు నన్ను మరింత అందంగా చూపించారు” అన్నారు రకుల్ ప్రీత్.
విశాల్ మాట్లాడుతూ – ”మహేష్ ఇక మా కుర్రాడు. ఆయన మా హీరో. మహేష్ నటించిన సినిమాలన్నీ తొలి రోజు, తొలి షో చూడడం అలవాటు. ఈ సినిమాని కూడా తెలుగు ప్రేక్షకుల మధ్య కూర్చొని చూస్తాను” అన్నారు.
దర్శకుడు విజయ్ మాట్లాడుతూ – ”నేను మహేష్ వీరాభిమానిని. ‘మద్రాసు పట్టణం’ కథని మహేష్ కోసమే రాసుకున్నాను. ఏదో ఒకరోజు ఆయనతో తప్పకుండా సినిమా చేస్తాను” అన్నారు.
హేరిస్ జయరాజ్ మాట్లాడుతూ – ”ఈ సినిమాకి ఆర్.ఆర్. చేసేటపుడు ఆశ్చర్యపోయాను. నాతోపాటు ప్రతి మహేష్ అభిమాని ఒకటికి పది సార్లు చూస్తారు. ఓ హాలీవుడ్ హీరో మీ కంటికి కనిపిస్తారు” అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో విక్రమన్, కె.ఆర్.దాసు, ఎ.ఎం.రత్నం, ఆర్.బి.చౌదరి, సుభాస్కరన్, రాజు మహాలింగం, కరుణాకరన్, మెహర్ రమేష్, శ్రీకర్‌ప్రసాద్, రామజోగయ్యశాస్త్రి, మదన్ కార్కీ తదితరులు పాల్గొన్నారు.