‘‘మహేశ్, శివ కాంబినేషన్లో వచ్చిన ‘శ్రీమంతుడు’ ఎంత హిట్టో తెలిసిందే. ఆ చిత్రం అన్ని రికార్డులు తిరగరాసింది. ‘భరత్ అనే నేను’ డైలాగ్స్, ట్రైలర్స్, సాంగ్స్ చూస్తుంటే ఈ సినిమా ‘శ్రీమంతుడు’ని క్రాస్ చేసి, పెద్ద హిట్టవుతుందని నమ్ముతున్నా. మహేశ్ లైఫ్‌లోనే ఈ సినిమా నంబర్ వన్ అవుతుందనే నా నమ్మకాన్ని మీ అందరి ఆశీస్సులతో నిజం చేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు సూపర్‌స్టార్ కృష్ణ. మహేశ్‌బాబు, కియారా అద్వానీ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భరత్ అనే నేను’.డి. పార్వతి సమర్పణలో దానయ్య డీవీవీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న రిలీజవుతోంది.
‘భరత్ అనే నేను బహిరంగ సభ’లో నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘నేను ఇండస్ట్రీకి వచ్చిన 23ఏళ్లలో హైదరాబాద్‌లో ఇలాంటి ఫంక్షన్ చూడలేదు. ఓ స్టార్ హీరో సినిమాకి ఇంకో స్టార్ హీరో ముఖ్యఅతిథిగా రావడం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కొత్త ఒరవడి. థ్యాంక్యూ తారక్(ఎన్టీఆర్). ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అయి టాప్ 5లో నిలవాలి’’ అన్నారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్టీఆర్ మాట్లాడుతూ– ‘‘మా ఇద్దర్నీ (మహేశ్‌బాబు, ఎన్టీఆర్) ఇలా చూస్తే మీకు (ఫ్యాన్స్)కు కొత్తగా ఉందేమో కానీ మాకు కాదు. మీరందరూ ఆయన్ని ప్రిన్స్, సూపర్‌స్టార్ అంటారు. నేను ‘మహేశ్ అన్నా’ అంటాను. ఈ చిత్రం అద్భుతమైన విజయం సాధించాలనీ, రికార్డులు తిరగ రాయాలని కోరుకుంటున్నా. ఒక కమర్షియల్ స్టార్ అయ్యుండి కూడా మహేశ్ అన్న చేసినటువంటి ప్రయోగాత్మక చిత్రాలు ఎవరూ చేయలేదు.రిజల్ట్‌తో సంబంధం లేకుండా ప్రయోగాలు చేస్తున్నారు. మేం ఇప్పుడిప్పుడు చేస్తున్నాం. దానికి స్ఫూర్తి ఆయనే. ఆయన చాలా అరుదైన నటుడు. అలాగే ఉండనిద్దాం. ‘భరత్ అనే నేను’ ఆయన కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచిపోవాలి. నాది, శివగారి జర్నీ ‘బృందావనం’తో మొదలైంది. సమాజం పట్ల బాధ్యత కలిగిన దర్శకుడు ఆయన’’ అన్నారు.
మహేశ్‌బాబు మాట్లాడుతూ – ‘‘కృష్ణగారి అబ్బాయి అనే నేను… తమ్ముడు తారక్ నుంచి నేర్చుకున్నాను ఈ మాటలన్నీ (నవ్వుతూ). ఇక్కడ ప్రీ–రిలీజ్ ఫంక్షన్ చూస్తున్నట్లు లేదు.100 డేస్ ఫంక్షన్‌కు వచ్చినట్లు ఉంది. తారక్ ‘ఆది’ సినిమా ఆడియో ఫంక్షన్‌కు నేను వెళ్లాను. ఇప్పుడు తను నా సినిమా ప్రీ–రిలీజ్ ఈవెంట్‌కు రావడం ఆనందంగా ఉంది. ఐ థింక్ ఇక ఫంక్షన్ల ట్రెండ్ మారుద్ది. అందరు హీరోలు వెళతారు. ఎందుకంటే మన ఇండస్ట్రీలో ఉంది ఐదారుగురు పెద్ద హీరోలే. తిప్పి కొడితే ఏడాదికి ఒక్కో సినిమానే చేస్తాం. అందరి సినిమాలూ ఆడితే ఇండస్ట్రీ ఇంకా బాగుంటుంది. మేం మేం బాగానే ఉంటాం. మీరూ మీరే (ఫ్యాన్స్) ఇంకా బాగుండాలి. సీయం క్యారెక్టర్ అనగానే కాస్త భయం వేసింది.ఎందుకంటే రాజకీయాలు నాకు అసలు సంబంధం లేదు. కానీ శివగారు కథ చెప్పినప్పుడు ఇన్స్పైర్ అయ్యాను. ఫైనెస్ట్ పర్ఫార్మెన్స్ చేశాను. ‘శ్రీమంతుడు’ సినిమా నా కెరీర్లో ఒక టర్నింగ్ పాయింట్. మళ్లీ అదే టర్నింగ్ పాయింట్ రాబోతోంది. దానయ్యగారు సినిమా గ్రాండ్‌గా ఉండాలంటారు. సినిమా అలానే ఉంటుంది. దేవికి నేను పెద్ద ఫ్యాన్. మొన్న ‘రంగస్థలం’ చూశాను. మా సినిమాకు, ‘రంగస్థలం’కు ఫుల్ డిఫరెంట్ మ్యూజిక్ ఇచ్చాడు.‘భరత్ అనే నేను’ థీమ్ సాంగ్, ‘వచ్చాడయ్యో సామి..’ సాంగ్స్ నా కెరీర్లోనే ది బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. సినిమాకు పనిచేసిన అందరికీ థ్యాంక్స్.ఎంతమందికి తెలుసో కానీ.. ఏప్రిల్ 20న మా అమ్మ ఇందిరమ్మగారి పుట్టినరోజు. అమ్మ ఆశీస్సులు, దీవెనలకు మించింది ఇంకేమీ లేదంటారు. సో.. ఆ రోజు రిలీజ్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు.
కొరటాల శివ మాట్లాడుతూ – ‘‘మహేశ్‌గారికి కథ చెప్పడానికి వెళ్లినప్పుడు ఫస్టాఫ్ 2:30 గంటలు, సెకండాఫ్ 2:30 గంటలు చెప్పా.ఐదు గంటలు కథ చెబుతారా? అంటారనుకున్నా. కానీ, ఆయన సినిమా కూడా ఐదు గంటలు ఉంటుందా? అని అడిగారు. మోస్ట్ హ్యాండ్సమ్ అండ్ డైనమిక్ ముఖ్యమంత్రి పాత్రలో నటించారాయన.నాకొక గ్రాండ్ సినిమా ఇవ్వండన్నారు దానయ్యగారు. అందుకు తగ్గట్టే ఖర్చుకు వెనకాడకుండా తీశారు. నాకంటే ఎక్కువ ఇన్స్పైర్ అయ్యి మంచి పాటలిచ్చారు దేవిశ్రీ. రామజోగయ్యశాస్త్రిగారు ప్రాణం పెట్టి మంచి లిరిక్స్ ఇచ్చారు. నేను ఏ హీరోతో సినిమా చేస్తే ఆ హీరోకి పిచ్చి ఫ్యాన్ అయిపోతా. నాతో పోలిస్తే మీరు (అభిమానులు) నథింగ్. మహేశ్, తారక్, రామ్‌చరణ్ అంతా స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. అభిమానులు కూడా ఇలాగే కలిసుండాలి’’ అన్నారు.
‘‘మా బ్యానర్లో ఇంత పెద్ద సినిమా చేసినందుకు కొరటాల శివగారికి రుణపడి ఉంటా.మహేశ్‌గారితో సినిమా చేయాలనే కోరిక ఇంత మంచి సినిమాతో తీరినందుకు ఆనందంగా ఉంది. ‘భరత్ అనే నేను’ సినిమా ఎంత గొప్పగా ఉంటుందని మహేశ్ అభిమానులు అనుకుంటున్నారో అంతకంటే గొప్పగా ఉంటుందని హామీ ఇస్తున్నా. ఈ నెల 20న సినిమా చూస్తే మీరే ఈ మాట అంటారు’’ అన్నారు డీవీవీ దానయ్య.
‘‘కొరటాలగారి నాలుగు సినిమాలకూ నేనే సంగీతం అందించా. డీవీవీగారి బ్యానర్లో చేసే అవకాశం ఇచ్చిన దానయ్యగారికి థ్యాంక్స్. మహేశ్ సూపర్‌స్టారే కాదు. ఆయన హార్ట్ కూడా సూపర్‌స్టారే’’ అన్నారు దేవిశ్రీ ప్రసాద్.