‘వినాయకుడు’, ‘విలేజ్‌లో వినాయకుడు’,’కేరింత’ విజయాల తర్వాత అడివి సాయికిరణ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఆపరేషన్ గోల్డ్‌ఫిష్’. ఆదిసాయికుమార్, అబ్బూరి రవి, సషా ఛెట్రి, కార్తిక్‌రాజు, నిత్యానరేష్, పార్వతీశం ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. ప్రతిభా అడివి, కట్టా ఆశిష్‌రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్, పద్మనాభరెడ్డి, గ్యారీ బీహెచ్, సతీష్ డేగలతో పాటు నటీనటులు,సాంకేతిక నిపుణులు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను మహేష్‌బాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా సోమవారం ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో ఏర్పాటు చేసిన సమావేశం లో…
దర్శకుడు అడివి సాయికిరణ్ మాట్లాడుతూ… ‘ క్రాస్ జోనర్‌లో యాక్షన్, రొమాంటిక్ కామెడీ అంశాలను మేళవించి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. భారతీయ తెరపై ఇప్పటివరకు ఎవరూ ఈ కథను టచ్ చేయలేదు. నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ కలిసి నిర్మించిన చిత్రమిది. ఎన్ ఎస్‌జీ కమాండో పాత్రకు ఆదిసాయికుమార్‌ను అనుకున్నప్పుడు ఆ పాత్రకు డ్యాన్సులు ఉండవు కాబట్టి అతడు చేస్తాడో లేదో అని కంగారుపడ్డాను. కథ విని నటుడిగా నాకు చాలా కొత్తగా ఉంటుందని వెంటనే అంగీకరించారు. ఈ చిత్ర నిర్మాణంలో పద్మనాభరెడ్డి, సురేష్ అద్భుతమైన సహకారాన్ని అందించారు అని తెలిపారు.
ఆది సాయికుమార్ మాట్లాడుతూ దర్శకుడు సాయికిరణ్ టైటిల్ చెప్పగానే ఆసక్తికరంగా అనిపించింది. కానీ లవర్‌బాయ్ పాత్రలు చేసిన నాకు ఎన్ ఎస్‌జీ కమాండో లుక్ సెట్ అవుతుందో లేదో అనిపించింది. నాన్న ఈ తరహా పాత్రలు చాలా చేశారు. ఆయన కథ విని నాకు ఈ పాత్ర బాగుంటుందని చెప్పారు. లుక్ టెస్ట్ చేయగానే ధైర్యం వచ్చింది. ఈ పాత్ర నాకు సరిపోతుందని అస్సలు ఊహించలేదు. నా పాత్రకు హీరోయిన్, పాటలు ఏవీ ఉండవు. కశ్మీర్ పండిట్ కుటుంబంలో పుట్టిన కుర్రాడిగా కనిపిస్తాను. యథార్థ అంశాల స్ఫూర్తితో నిజాయితీగా ఈ సినిమా చేశాం. నవ్యమైన కథాంశాలతో తెరకెక్కిన చిత్రాల్ని ప్రేక్షకులు విజయవంతం చేస్తున్నారు. మా సినిమాను ఆదరిస్తారనే నమ్మకం ఉంది. 1980 నాటి కాలంలో కశ్మీర్ పండిట్ కుటుంబాలకు జరిగిన అన్యాయాన్ని చర్చిస్తూ ఈ సినిమా చేశాం. ఇటీవల అలాంటి ఘటనలే మళ్లీ కశ్మీర్‌లో జరగడం బాధను కలిగించింది అని అన్నారు
నిత్యానరేష్ మాట్లాడుతూ చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. యాక్షన్, సస్పెన్స్, రొమాంటిక్ కామెడీ హంగులతో రెండు కథలను జోడించి దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించారు. మా నాన్నగారు ఆర్మీలో పనిచేశారు. అందుకే నా హృదయానికి ఈ చిత్రం చాలా దగ్గరైంది. కేరింత సినిమాతో దర్శకుడు సాయికిరణ్ నన్ను చిత్రసీమకు పరిచయం చేశారు. ఈ సినిమాలో నా కోసం ఆయన మంచి పాత్రను సృష్టించారు అని తెలిపింది
కార్తిక్‌రాజు మాట్లాడుతూ టీమ్ ఎఫెర్ట్‌కు నిదర్శనమిది. సాయికిరణ్‌ను పనిరాక్షసుడు అంటారు. రోజులకు 22 గంటలు ఈ సినిమా కోసం పనిచేశారు. ప్రాణంపెట్టి సినిమా చేశారు. ఈ సినిమాతో కొత్త ఆదిసాయికుమార్‌ను చూస్తారు. లవ్‌లీ స్టార్‌ను యాక్షన్ స్టార్‌గా ఈ సినిమా ఆవిష్కరిస్తుంది. పార్వతీశం మాట్లాడుతూ సాయికిరణ్ అడవి ఏ సినిమా చేసినా నాకో మంచి పాత్రను ఇస్తుంటారు. చాలా కష్టపడి ఈ సినిమా చేశాం అని తెలిపారు.
నిర్మాతల్లో ఒకరైన పద్మనాభరెడ్డి మాట్లాడుతూ పదిమందితో కలిసి బతకడం నాకు ఇష్టం. అలాంటి లక్షణాలున్న మనిషి అడివి సాయికిరణ్. కెమెరామెన్ జైపాల్‌రెడ్డి ద్వారా పరిచయం అయ్యారు. నిర్మాతను కూడా సాంకేతిక నిపుణుడిగా భావించి ఈసినిమా చేశారు. వందశాతం విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఉంది.
సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ ఇంటెన్స్ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. నాలుగు పాటలుంటాయి. క్షణం, గరుడవేగ, గూఢచారి తర్వాత నాకు మంచి పేరును తెచ్చిపెడుతుందనే నమ్మకం ఉంది అని తెలిపారు.
అబ్బూరి రవి మాట్లాడుతూ… దర్శకుడిగా సాయికిరణ్ తన పంథాను మార్చి చేస్తున్న సినిమా ఇది. అతడి గత సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. కథ విని నోట మాట రాలేదు. సాయి ఇలాంటి సినిమా చేస్తాడని ఊహించలేదు. సాయికిరణ్ డబ్బు సంపాదించకపోవచ్చు కానీ మంచి మనుషుల్ని సంపాదించుకున్నాడు. హైదరాబాద్‌లో స్థిరపడిన కశ్మీర్ పండిట్ కుటుంబాల్ని కలుసుకొని వారి బాధలను స్వయంగా తెలుసుకొని సాయికిరణ్ ఈ కథను రాసుకున్నారు. అలాగే ఈ సినిమా కోసం కశ్మీర్ సమస్యల పట్ల అవగాహన ఉన్న వారందరిని కలుసుకున్నారు. పండిట్ కుటుంబాలు పడే బాధల్ని వారి భావోద్వేగాల్ని ఈ సినిమాలో సహజంగా చూపించారు. నటించడం నాకు రాదు. కష్టపడి నన్ను భరిస్తూ ఈ సినిమా చేయించుకున్నారు అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్యారీ బీహెచ్, సురేష్, రామకృష్ణ, జైపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మనోజ్ నందం, రావు రమేష్, అనీష్ కురువిల్లా, కృష్ణుడు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జైపాల్‌రెడ్డి, ఆర్ట్: జె.కె.మూర్తి, సంగీతం: శ్రీచరణ్ పాకాల, ఎడిటింగ్: గ్యారీ బీహెచ్, కాస్ట్యూమ్ డిజైనర్: కీర్తి సిరికొండ, యాక్షన్: రామకృష్ణ, సుబ్బు, నభా, సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, పబ్లిసిటీ డిజైనర్: అనిల్ భాను, కో.ప్రొడ్యూసర్: దాయోధర్ యాదవ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిరణ్‌రెడ్డి తుమ్మ, పి.ఆర్.ఓ: నాయుడు-ఫణి.