ప్రముఖ బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్… 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేయనున్నట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. పుణే లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆమెను బరిలో దించనున్నట్టు సమాచారం. ఈ ఏడాది జూన్‌లో ‘సంపర్క్ ఫర్ సమర్థన్’ కార్యక్రమంలో భాగంగా ముంబై వెళ్లిన బీజేపీ చీఫ్ అమిత్ షా.. మాధురీ దీక్షిత్‌తో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమె పేరును వచ్చే లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో చేర్చాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
‘‘2019 సార్వత్రిక ఎన్నికల్లో మాధురీ దీక్షిత్‌కు టికెట్ ఇచ్చే అంశాన్ని బీజేపీ గట్టిగా పరిశీలిస్తోంది. పుణే లోక్‌సభ నియోజకవర్గం ఆమెకు బాగుంటుందని భావిస్తున్నాం..’’ సీనియర్ బీజేపీ నేత ఒకరు పేర్కొన్నారు. 51 సంవత్సరాల బాలీవుడ్ సీనియర్ నటి మాధురి.. ‘హమ్ ఆప్కే హైన్ కౌన్..!’, ‘దిల్ తో పాగల్ హై’, ‘సాజాన్ అండ్ దేవదాస్’ సహా పలు సూపర్ హిట్ చిత్రాల్లో అలరించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పుణే స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. బీజేపీ నుంచి ఇక్కడ పోటీచేసిన అనిల్ శిరోలే దాదాపు 3 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.జాతీయ స్థాయిలో ప్రధాని మోదీకి ఆదరణ ఉన్నప్పటికీ.. కొంతమంది భాజపా ఎంపీలపై వ్యతిరేకత ఉండటంతో వారి స్థానంలో కొత్త వారిని ఎంపిక చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్‌ను లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దింపాలని భాజపా ప్రయత్నిస్తోంది.ఈ విషయం గురించి సీనియర్ నాయుకుడు ఒకరు.. ‘మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి వ్యూహాలనే పాటించారు. ఆ సమయంలో పాత అభ్యర్థుల స్థానంలో కొత్త వారిని నిలబెట్టి భారీ మెజారిటీ సాధించి ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చారు. ఇప్పుడు కూడా అదే జరగబోతుంది’ అంటూ చెప్పుకొచ్చారు.