ట్రైలర్లో డైలాగులను అనుమతించి.. సినిమాలో తీసేయడమేంటని, అదేం విడ్డూరమో తనకు అర్థం కావట్లేదని మధుర్ భండార్కర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘ఇప్పుడు ఈ దేశంలో గాంధీని మార్చేశాను (అబ్ ఇస్ దేశ్ మే గాంధఈ కే మైనే బదల్ చుకే హై)’, ‘భారత్‌కు చెందిన ఓ బిడ్డ దేశం మొత్తాన్ని బంధీ చేసింది (భారత్ కి ఏక్ బేటీ నే దేశ్ కో బందీ బనాయా హువా హై)’, ‘జీవితాంతం తల్లీ-కొడుకులకు గులాంగిరీ చేస్తూనే బతికేస్తారా.. (ఔర్ తుమ్ లోగ్ జిందగీభర్ మా-బేటే కి గులామీ కర్తే రహోగే)’ అన్న డైలాగులను సినిమా నుంచి తీసేయాల్సిందిగా మధుర్ భండార్కర్‌ను సెన్సార్ బోర్డు ఆదేశించింది.
బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ మధుర్ భండార్కర్ సెన్సార్ బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన 1975లో భారత్‌లోని ఆత్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ) నేపథ్యంలో సినిమా తీస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతుంటే.. వారికి తోడు అన్నట్టు సీబీఎఫ్సీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికెషన్) కత్తెర వేసింది. సినిమాలో 14 కోతలు విధించింది. దీనిపై ఆయన అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. భండార్కర్ చెప్పిన దాని ప్రకారం.. మొరార్జీ దేశాయ్, అటల్ బిహారి వాజ్‌పేయి, ఎల్కే ఆడ్వాణి వంటి అగ్రనేతల ఫొటోలతో ఉన్న ఇండియన్ హెరాల్డ్ పత్రిక కటింగ్లను సినిమా నుంచి తొలగించాలని సీబీఎఫ్సీ ఆదేశించింది.అంతేగాకుండా కిశోర్ కుమార్, ఐబీ, పీఎం, సెక్షన్ ఆఫీసర్, ఆరెస్సెస్, అకాలీ, కమ్యూనిస్ట్, జయప్రకాశ్ నారాయణ్ వంటి పేర్లను కూడా సీబీఎఫ్సీ వదల్లేదు.
ఇన్ని కోతలు పెట్టాక మధుర్ భండార్కర్ ఊరుకుంటారా..? సీబీఎఫ్సీపై అసహనాన్ని వెళ్లగక్కారు. ‘‘సీబీఎఫ్సీ సూచించిన కోతలు మమ్మల్ని తీవ్రమైన అసంతృప్తికి గురిచేసింది. సెన్సార్ బోర్డు సిఫార్సు చేసిన కోతలన్నీ బోర్డు సెన్సార్ చేసిన ట్రైలర్లోనే ఉన్నాయి. అన్ని డైలాగులను తీసేస్తే.. సినిమాలో సారం ఏముంటుంది? వాటిని తీసేస్తే సినిమా ఉద్దేశమే మారిపోతుంది. కాబట్టి బోర్డు నిర్ణయాన్ని రివైజింగ్ కమిటీలో సవాల్ చేస్తాం. అక్కడైనా మాకు మార్గం సుగమం చేస్తారని, న్యాయం దొరుకుతుందని ఆశిస్తున్నాం’’ అని ఆయన అసహనం వ్యక్తం చేశారు.
ట్రైలర్లో ఆ డైలాగులను అనుమతించి.. సినిమాలో తీసేయడమేంటని, అదేం విడ్డూరమో తనకు అర్థం కావట్లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దానికి సంబంధించిన కొన్ని వార్తలను ట్విట్టర్లో అటాచ్ చేశారు. కాగా, ఇప్పటికే ఈ సినిమాను తొలుత తమకు చూపించి ఎన్వోసీ తీసుకున్నాకే విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ సీబీఎఫ్‌సీకి కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే.. దీనిపై బోర్డును కాకుండా సినిమా నిర్మాత, డైరెక్టర్‌ను అడగాలని బోర్డు చైర్మన్ పహ్లజ్ నిహ్లానీ సూచించారు.
మధుర్ భండార్కరేమో అట్లాంటి వాటికి తాను అస్సలు ఆమోద ముద్ర వేయబోనని కరాఖండిగా చెప్పేశారు. కీర్తి కుల్హరి, నీల్ నితిన్ ముఖేశ్, అనుపమ్ ఖేర్, తోతా రాయ్ చౌదరి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా జూలై 28న విడుదల కాబోతోంది.