మంచి మనసున్న మనిషి శివాజీ రాజా… నటుడిగా ఎంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించారో..అంతకు మించి సేవా కార్యక్రమాలు చేయడంలో తన హృదయం ఏంటన్నది చాటి చెప్పారు. `మా` మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ కార్యక్రమాలు మరింత పెరిగాయి. పేద కళాకారులకు..సాంకేతిక నిపుణులకు…సినీ కార్మికులకు ఇప్పుడు శివాజీ అంటే ఓ ధైర్యం..భరోసా. 24 శాఖలకు చెందిన వారందరి హృదయాలకు దగ్గరైన వ్యక్తి. ‘సహాయం’ అంటూ ఆయన్ను ఆశ్రయిస్తే…. తప్పక కష్టాన్ని తీర్చే వ్యక్తి. అది ఆయన సొంతంగా చేసినా? లేదా దాతల నుంచి విరాళాల రూపంలో సేకరించింది అయినా కావచ్చు. ఏవిధంగానైనా కష్టం తీరుతుందనే ‘శివాజీ అన్నయ్యా’ అంటూ ఆయన్ను ఆశ్రయిస్తారు. అందుకే శివాజీ అంటే ఇండస్ట్రీలో అందరి తలలో నాలుక అయ్యారు. ‘మనసున్న మారాజు’గా పేరు సంపాదించుకున్నారు. ఇప్పటికే చాలా మంది పేదకళాకారులకు పలు విధాలుగా ఆయన సహాయం చేశారు.
తాజాగాఇటీవల ప్రొడక్షన్ చీఫ్ చిరంజీవి చనిపోయిన నేపథ్యంలో అతని కుటుంబానికి అండగా నిలబడటానికి `మా`మూవీ ఆర్టిస్ట్ తరుపున కొంత మంది ఆర్టిస్టులు..అలాగే `అమ్మమ్మ గారి ఇల్లు` చిత్ర నిర్మాతలు, నటీనటులందరూ అండగా నిలబడ్డారు. తమవంతుగా కొంత మొత్తాన్ని బాధిత కుటుంబానికి అందజేశారు. మొత్తం 8లక్షల రూపాయలు వివిధ రూపాల్లో దాతల నుంచి వచ్చాయి. అందులో మూడు సంవత్సరాలకు 6లక్షల రూపాయలను ఆంధ్రాబ్యాంక్ లో చిరంజీవి పిల్లల పేరిట ఫిక్సేడ్ డిపాజిట్ చేశారు. మిగిలిన రెండు లక్షల రూపాయలను రెండు సంవత్సరాల పాటు నెలకు 8వేల చొప్పున అందజేస్తున్నారు. అలాగే ఇటీవల జరిగిన `సంతోషం` అవార్డు ఫంక్షన్ వేడుకల్లో 40వేల రూపాయలను చిరంజీవి కుటుంబానికి అందించారు. ఈ విరాళాలను `మా` అధ్యక్షులు శివాజీ రాజా చొరవ తీసుకుని సేకరించడంతోనే సాధ్యమైంది.
`మా` అధ్యక్షులు శివాజీ రాజా మాట్లాడుతూ… `ఇదంతా నా గొప్పతనం కాదు. ‘శివాజీ రాజా అంటే మంచి పనులు చేస్తాడ’ని అందరూ విశ్వసించారు కాబట్టే ఇలాంటివి చేయగల్గుతున్నా. అలాగే నేను అడిగిన వెంటనే దాతలు కాదనకుండా వెంటనే స్పందించి సహాయం చేశారు కాబట్టే, ఇవన్నీ వీలవుతున్నాయి. నేను కేవలం మధ్య వర్తిని మాత్రమే. ఆవిధంగా సినీ పరిశ్రమలో నేను అందరి మనిషిని అయ్యాను. ఇది నాకు చాలా సంతృప్తిని ఇస్తుంది` అని అన్నారు