అనుక‌రించి పేరు తెచ్చుకుంటే అది ప్ర‌తిభ కాదు!

“అనుక‌రించి పేరు తెచ్చుకుంటే అది ప్ర‌తిభ అనిపించుకోదు..” అని అంటోంది లెజండ‌రీ సింగ‌ర్ లతా మంగేష్క‌ర్ . కోల్‌క‌త్తా రైల్వే స్టేష‌న్‌లో పాట ప‌డుకుంటున్న రణు మొండల్‌ని ఓ వ్య‌క్తి వీడియో తీసి సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో ఆమె ఓవ‌ర్‌నైట్ స్టార్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల మ్యూజిక్ డైరెక్టర్ హిమేశ్ రేష్మియా రణు మొండల్‌ తో ‘తేరి మేరీ కహానీ’ అనే పాటను పాడించాడు. తన కొత్త సినిమాలో ఈ పాటను పెట్టనున్నాడు హిమేశ్ . అయితే లెజెండరీ గాయని లతా మంగేష్కర్ పాడిన ‘ఏక్ ప్యార్ నగ్మా హై’ అనే పాట పాడిన రణు ఓవ‌ర్ నైట్ సెల‌బ్రిటీ కావ‌డంతో పాటు అనేక అవ‌కాశాలు ద‌క్కించుకుంటుండ‌గా, లెజండ‌రీ సింగ‌ర్ లతా మంగేష్క‌ర్ మాత్రం ఆమెని త‌ప్పు ప‌డుతోంది….
 
“నా పేరు వాడుకొని బాగుప‌డితే అది అదృష్టంగా భావిస్తాను. అంతేకాని అనుక‌రించి పేరు తెచ్చుకుంటే అది ప్ర‌తిభ అనిపించుకోదు. రణు మొండల్‌ నేను పాడిన పాట‌ని అనుక‌రించి చాలా పాపుల‌ర్ అయింది. ఈ విజ‌యం కేవ‌లం కొద్ది రోజుల వ‌ర‌కు మాత్ర‌మే ప‌రిమితం. ఈ కాలం నాటి యువ సింగ‌ర్స్ నా పాట‌లు చాలా బాగా పాడి మంచి పేరు తెచ్చుకుంటున్నారు. అలా పాడిన వారిలో సునిధి చౌహ‌న్, శ్రేయా ఘోష‌ల్ ముఖ్యులు. ఒరిజినాలిటీ న‌మ్ముకొని పాట‌లు పాడండి. అంతే త‌ప్ప అనుక‌రించి పాపులారిటీ తెచ్చుకున్నా అది ఎంతో కాలం నిల‌వ‌దు. నా సోద‌రి ఆశా భోంస్లే సొంత పాట‌ల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది. అలా చేసి ఉండ‌క‌పోతే.. ఎప్పుడు నా నీడ‌లోనే ఉండిపోయేది. సొంత ప్ర‌తిభ ఎంత పెద్ద విజ‌యం సాధించి పెడుతుందో చెప్ప‌డానికి ఆశా కెరీరే నిద‌ర్శ‌నం” …అని ల‌తామంగేష్క‌ర్ పేర్కొన్నారు. గ‌తంలో ల‌తా తాము పాడిన ఆణిముత్యాల‌ని రీమేక్‌ పేరుతో నాశనం చేస్తున్నారని మండిప‌డిన విష‌యం విదిత‌మే.