ఆచార్య క్రియేషన్స్, బ్లూ సర్కిల్ కార్పొరేషన్ పతాకాలపై భోగేంద్ర గుప్తా నిర్మిస్తున్న సినిమా ‘కిట్టి పార్టీ’. సుందర్ పవన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో ‘మైనే ప్యార్ కియా’ (తెలుగులో ‘ప్రేమ పావురాలు’) ఫేమ్ భాగ్య శ్రీ, ‘రోజా’ ఫేమ్ మధుబాల, ‘పెళ్లి సందడి’ ఫేమ్ దీప్తీ భట్నాగర్, సదా, సుమన్ రంగనాథ్, హరితేజ, హర్షవర్ధన్ రాణే, పూజా జవేరి ప్రధాన పాత్రధారులు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా లోగో విడుదల చేశారు.
అనంతరం దర్శకుడు సుందర్ పవన్ మాట్లాడుతూ ‘‘ఇదొక ఫీమేల్ బడ్డీ డ్రామా. అలాగని, ఆడవాళ్ళకు సంబంధించిన సినిమా అని చెప్పను. కానీ, సినిమాలో ఆడవాళ్ళు మాత్రమే ఎక్కువసేపు కనిపిస్తారు. నాకు తెలిసిన కొన్ని నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో కథ రాసుకున్నా. స్ట్రయిట్ తెలుగు సినిమా ఇది. ఏ పరభాషా సినిమాకూ రీమేక్ కాదు. వేరే సినిమా స్ఫూర్తితో తీయడం లేదు. ముఖ్యంగా ఆరుగురు మహిళలు చుట్టూ కథ తిరుగుతుంది. భాగ్య శ్రీ, దీప్తీ భట్నాగర్, సుమన్ రంగనాథ్, మధుబాల, సదా, హరితేజ, పూజా జవేరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వీరిలో కొందరు కొన్నేళ్ళ నుంచి సినిమాలు చేస్తున్నారు. వారి తర్వాత మరికొందరు యాక్టింగ్ ప్రారంభించినవారు కొందరున్నారు. వీరందరినీ ఒప్పించడం కొంచెం కష్టమైంది. అందరినీ ఒక చోటుకు చేర్చి ఈ ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా చేయడం మా నిర్మాత భోగేంద్ర గుప్తాగారు లేకపోతే సాధ్యం అయ్యేది కాదు. అతి త్వరలో సినిమా షెడ్యూల్ స్టార్ట్ చేస్తాం. సాయిశ్రీరామ్ వంటి బ్రిలియెంట్ సినిమాటోగ్రాఫర్, యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ సిద్ధార్థ సదాశివుని సినిమాకు పని చేస్తున్నారు’’ అన్నారు.
నిర్మాత భోగేంద్ర గుప్తా మాట్లాడుతూ ‘‘సినిమాలో నటించడానికి అంగీకరించిన ప్రతి ఆర్టిస్ట్‌కి పేరు పేరునా కృతజ్ఞతలు. పవన్ చాలా కోపరేటివ్ డైరెక్టర్. త్వరలో మరిన్ని సినిమా వివరాలు వెల్లడిస్తాం’’ అన్నారు.
భాగ్య శ్రీ మాట్లాడుతూ ‘‘జీవితంలో ఒక్క మహిళను హ్యాండిల్ చేయడమే పురుషులకు కష్టమైన పని! నవ్వుతూ… మా దర్శకుడు సెట్లో మా ఏడుగురు మహిళలను హ్యాండిల్ చేయాలి. ఎలా చేస్తాడో! మహిళల దృక్కోణం నుంచి ఆలోచించి ఈ కథ రాసిన దర్శకుడు పవన్‌ని అభినందిస్తున్నా. మహిళల మనస్తత్వాలను అర్థం చేసుకున్నటువంటి దర్శకుడితో పని చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. వినోదం కోసం తీస్తున్న సినిమా కాదిది. సమాజంలో అందరం కలిసి ఉన్నతస్థాయికి ఎదడగం, ఉన్నత జీవన ప్రమాణాల కోసం పని చేయడం వంటి అంశాలను చర్చిస్తూ తీస్తున్న చిత్రమిది. హాలీవుడ్లో వచ్చిన ‘డెస్పరేట్ హౌస్‌వైఫ్స్’, ‘సెక్స్ అండ్ ది సిటీ’ సినిమాల తరహాలో ఉంటుంది. సినిమాలో మేమంతా వివిధ పాత్రల్లో, వివిధ వయసుల గల మహిళలు నటిస్తున్నాం. ప్రేక్షకులకు తమ జీవితాల్లో ప్రతిరోజూ తారసపడే మహిళల్లో ఎవరో ఒకరు మా పాత్రల్లో ఏదో పాత్రలో కనిపిస్తారు. సినిమాలో మొదటి పాటను దర్శకుడు పవన్ నాకు వినిపించారు. చాలా బావుంది. విడుదలైన తర్వాత కొన్నేళ్ళ పాటు పార్టీల్లో ఆ పాట వినిపిస్తుంది’’ అన్నారు.
మధుబాల మాట్లాడుతూ ‘‘హీరోపై మాత్రమే ఎక్కువ ఫోకప్ చేసే ఇండస్ట్రీలో… హీరో ఎవరూ లేని ఒక సినిమాకు నేనే సంతకం చేశా. ఇటువంటి సినిమా తీస్తున్నందుకు, అందులో నాకు అవకాశం ఇచ్చినందుకు దర్శకుడు పవన్, నిర్మాత గుప్తాగారికి థ్యాంక్స్. ఇంతమంది మహిళలతో, కేవలం మహిళలు ప్రధాన పాత్రధారులుగా ఇటువంటి సినిమా తీయడానికి చాలా ధైర్యం కావాలి. వినోదం కోసం మాత్రమే ఈ సినిమా తీయడం లేదు. ఈ సినిమా కమర్షియల్గానూ మంచి సక్సెస్ సాధించాలి. సుమన్ రంగనాధ్, భాగ్యశ్రీ, నేను… 16 ఏళ్ళ అమ్మాయిలం కాదు. మమ్మల్ని మెయిన్ లీడ్స్‌గా పెట్టి తీస్తున్నారు. మాపై నమ్మకం ఉంచినందుకు దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్. ఇంటర్వ్యూలలో మెరిల్ స్ట్రీప్ వంటి హాలీవుడ్ తారలు మెయిన్ లీడ్స్‌గా సినిమాలు చేస్తున్నారని చెబుతుంటాం. మేముందుకు అటువంటి సినిమాలు, అటువంటి అద్భుతమైన పాత్రల్లో నటించలేం? ఇప్పుడు చేస్తున్నాం. ఇందులో నేనొక మెయిన్ లీడ్‌గా, పూజా జవేరికి తల్లిగా నటిస్తున్నా. నా చిన్ననాటి స్నేహితురాళ్ళు సుమన్, భాగ్య శ్రీతో నటిస్తుండటం సంతోషంగా ఉంది’’ అన్నారు.
సదా మాట్లాడుతూ ‘‘వేదికపై ఎక్కువమంది మహిళలున్నారు. నిజంగా వీళ్ళందరితో ఇక్కడ ఇలా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. అరుదైన సంఘటన ఇది. మధుబాలగారు చెప్పినట్టు… సినిమాకు సంతకం చేశానని చెబితే ‘హీరో ఎవరు?’ అని ఎక్కువశాతం మంది అడుగుతారు. బట్ ఫర్ ఏ ఛేంజ్… ఈసారి మా సినిమాలో హీరో ఎవరూ లేరు. ఆరుగురు మహిళలు మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. మహిళల గురించి చెప్పే సినిమా ఇది. ఇటువంటి సినిమాకు పవన్ కంటే మంచి దర్శకుణ్ణి ఊహించలేం. ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టాలని కోరుకుంటున్నా. గత నాలుగు రోజులుగా సినిమా కోసం మేమంతా ఫొటోషూట్స్ చేస్తున్నాం. దర్శక, నిర్మాతలు ఎక్కడా రాజీ పడటం లేదు. దర్శకుడు పవన్‌కి నిర్మాత గుప్తాగారు చాలా సపోర్ట్ చేస్తున్నారు. పవన్ ప్రతి విషయంలో చాలా పర్టిక్యులర్‌గా ఉంటారు. శంకర్‌గారి తర్వాత పవన్‌లో నేను అంత పర్ఫెక్షన్, డీటెయిలింగ్ చూస్తున్నా. కెరీర్లో ఫస్ట్ టైమ్ నేను ఒక సినిమాకు వర్క్‌షాప్ చేస్తున్నా. ఇద్దరు హీరోయిన్లు ఉంటే సెట్లో గొడవలు అవుతాయని అంటారు. మేం ఏడుగురున్నాం. ఏం గొడవలు లేవు. చాలా సరదాగా నవ్వుతూ వర్క్ చేస్తున్నాం’’ అన్నారు.
దీప్తీ భట్నాగర్ మాట్లాడుతూ ‘‘హైదరాబాద్ రావడం, అదీ 20 ఏళ్ళ తర్వాత రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సిటీ నా ఫస్ట్ లవ్. నాకింకా ‘పెళ్లి సందడి’ సినిమా షూటింగ్ చేసిన రోజులు గుర్తున్నాయి. ఈ సినిమా ఎప్పటికీ నా మనసులో ఉంటుంది. చాలా విరామం తర్వాత మళ్ళీ తెలుగు సినిమాలో నటిండచం సంతోషంగా ఉంది’’ అన్నారు.
సుమన్ రంగనాథ్ మాట్లాడుతూ ‘‘నేను తెలుగులో రెండు మూడు సినిమాలు చేశాను. మళ్ళీ తెలుగులో సినిమా చేస్తుండటం సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. ఈ సినిమాలో కథే హీరో’’ అన్నారు.
హరితేజ మాట్లాడుతూ ‘‘నిజంగానే పార్టీలా ఉంటుందీ సినిమా. చక్కగా, హాయిగా మూడు గంటలు ఎంజాయ్ చేసే సినిమా అవుతుంది. ప్రేక్షకులు అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. ఒక అమ్మాయి జీవితంలో పార్టీలు, సరదాలు, ఫన్ ఒక స్టేజ్ తర్వాత అయిపోయాక… బాధ్యతలు పెరిగాక… వాటి నుంచి మళ్ళీ ఒక టీనేజ్‌లోకి వచ్చే స్టోరీ ఎంత గమ్మత్తుగా ఉంటుందో? అక్కడ స్నేహితులు ఎలా ఉంటారో? అనే విషయాలు సినిమాలో చూడొచ్చు. నేను చెప్పింది సినిమాలో ఇసుక రవ్వంతే. ఇంకా చాలా ఉంది’’ అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: సిద్దార్థ సదాశివుని, సాహిత్యం: రాకేందు మౌళి, చైతన్య ప్రసాద్, కిట్టు విస్సాప్రగడ, ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్, కెమెరా: సాయిశ్రీరామ్, ఆర్ట్: రామ్‌కుమార్, కోరియోగ్రఫీ: యాని, శివ తుర్లపాటి, పీఆర్వో: ‘బియాండ్ మీడియా’ ఫణి – నాయుడు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎస్. రమణారెడ్డి, సహ నిర్మాత: శివ తుర్లపాటి, నిర్మాత: భోగేంద్ర గుప్తా, కథ–మాటలు–స్ర్కీన్‌ప్లే–దర్శకత్ వం: సుందర్ పవన్.