మిగతా హీరోయిన్లలాగా తెర మీద గ్లామర్‌గా కనిపించడం నాకు నచ్చదు. నా శరీరాకృతి దానికి సరిపోదని నా అభిప్రాయం. నేను నిండుగా ఉంటేనే అందంగా కనిపిస్తాను.నా అభిమానులకూ, ప్రేక్షకులకూ కూడా నేను అలా ఉండడమే ఇష్టం.మోడ్రన్ డ్రస్సుల కన్నా నాకు చీరలంటేనే ఎక్కువ ఇష్టం. నాకు చీరలే బాగుంటాయని అందరూ అంటూంటారు కూడా!….. అని అంటోంది అందాల నటి కీర్తి సురేష్.
నటన విషయంలో నాకు ఆదర్శం అంటూ ఎవరూ లేరు. సినిమా ఫ్యామిలీ నుంచి వచ్చాను. అమ్మ చేసిన సినిమాలు చూస్తూ పెరిగాను. నటన పరంగా చూస్తే నాకు బాలీవుడ్ హీరోయిన్ కంగనా నటన అంటే చాలా ఇష్టం. సినిమాల విషయంలో కానీ, క్యారెక్టర్ల పరంగా కానీ ఆమె చేసినన్ని ప్రయోగాలు ఎవరూ చేయరేమో అనిపిస్తుంది. నాకూ అలాంటి ప్రయోగాలంటే ఇష్టమే కానీ, దానికి ఇంకా టైముంది. నటనలో ఇంకా కొంత అనుభవం వచ్చిన తరువాత అలాంటి ప్రయోగాలు చేస్తానేమో!
కథల ఎంపికలో హీరోయిన్ అయిన కొత్తల్లో కొంత కాలం వరకూ నాతో పాటు మా పేరెంట్స్ కథలు వినేవారు. ఇప్పడు పూర్తిగా నాకే వదిలేశారు. కథ విన్న వెంటనే ఓకే చెప్పను. కనీసం ఒకటి రెండు రోజులు టైం తీసుకుంటాను. ఈ గ్యాప్‌లో కథలో నా పాత్రలో నన్ను నేను ఊహించుకుంటాను. కరెక్ట్‌గా సరిపోతాను అనిపిస్తే ఓకే చెబుతాను. ఇదంతా ఒకటి లేదా రెండు రోజుల్లో పూర్తయిపోతుంది. అంతకన్నా ఎక్కువ సమయం తీసుకోను.ఫలానా పాత్ర రాలేదే అని ఆలోచించను. బాధపడను. చేతికొచ్చిన పాత్ర గురించీ దానికి ఎంత వరకూ న్యాయం చేయగలను.. అన్న విషయాన్ని మాత్రమే ఆలోచిస్తాను. నన్ను వెతుక్కుంటూ వచ్చేవే నా దృష్టిలో నా డ్రీమ్‌రోల్స్.
నేను సినిమా వాతావరణం నుంచి రావడంతో ఇక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయో నాకు బాగా తెలుసు. వాటిని ఎలా ఎదుర్కొవాలో కూడా తెలుసు. కాకపోతే ఇటీవల నా స్టయిల్ని కొద్దిగా మార్చుకున్నాను. మార్పు సహజం కదా! కొత్త లుక్‌తో ట్రై చేస్తే ఎలా ఉంటుంది? అన్న ఆలోచన వచ్చి నన్ను నేను కొద్దిగా మార్చుకున్నాను. నా మార్పు నచ్చకపోతే సున్నితంగా చెప్పే పద్ధతులున్నాయి. కానీ కొందరు కటువుగా విమర్శించారు. వారి మాటలు నన్ను బాధించాయి. ‘ఈ రంగంలో ఇవన్నీ సహజం. వీటిని పట్టించుకుంటే నటించలేవు’ అంటూ మా ఫాదర్, మదర్ నచ్చచెప్పారు. ఇంత వరకూ నేను నటించిన సినిమాలో ఏ హీరోతోనూ ఇబ్బంది పడలేదు. వారిని ఇబ్బంది పెట్టలేదు. ఒక్కొక్కరిలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది.