కియారా అద్వానీకి సక్సెస్.. బ్రేక్ రావడానికి కాస్త టైమ్ పట్టింది. ఈ విషయం గురించి కియారా అద్వానీ మాట్లాడుతూ… ” కష్టకాలం అంటారు కదా! కెరీర్ మొదట్లో నాకు అలాగే అనిపించింది. ఏమిటనేది ఆలోచించుకోలేని, తెలుసుకోలేని పరిస్థితి అది. బాగా ఆలోచించిన మీదట ‘ఒక్క సినిమా’తోనే కెరీర్ అయిపోదని అర్థమైంది. ‘సినిమాలు రిలీజయ్యే ప్రతి శుక్రవారం ముఖ్యం’ అనే లెక్క అర్థమైపోయింది. ఇక అప్పటి నుంచి ఒక్క సినిమా ఫ్లాప్ అయితే ఏదో జరిగిపోయిందన్నట్లు కాకుండా.. ‘బోలెడన్ని సినిమాలున్నాయి కదా!’ అని మనసుని సరిపెట్టుకున్నాను. నాకు నేను ధైర్యం చెప్పుకున్నాను. నన్ను నేను నమ్మాను. మన కాళ్ల మీద మనం నిలబడగలమనే ధైర్యం వచ్చింది. వచ్చిన ప్రతి అవకాశాన్నీ శక్తివంచన లేకుండా సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. అలాగే పని చేస్తున్నాను. అది వర్కవుట్ అయింది.
ఏదైనా కొత్త సినిమా ప్లాన్ చేస్తున్నారంటే.. ఏ హీరోయిన్ని తీసుకుందాం? అని అనుకుంటే దర్శక – నిర్మాతలు నా పేరు కూడా పరిశీలిస్తున్నారు. నేను కూడా ప్రతి పాత్రనూ కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తున్నా. ఉదాహరణకు, ఒక సినిమాలో ఒకలా ఏడ్చాననుకోండి.. ఇంకో సినిమాలో వేరే రకంగా ప్రయత్నిస్తున్నాను. నవ్వడం, బాడీ లాంగ్వేజ్.. ఇలా అన్నీ డిఫరెంట్‌గా ఉండేలా చూసుకుంటున్నాను” అంది. కాగా ‘భరత్ అనే నేను’ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి భారీ హిట్ అందుకున్న కియారా ‘వినయ విధేయ రామ’ తర్వాత బాలీవుడ్‌కే పరిమితమైంది. కియారా ఆ తర్వాత ‘అర్జున్‌రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్‌సింగ్’తో బాలీవుడ్ లోనూ హిట్ సాధించింది. ఇక ఓటీటీలో ‘లస్ట్ స్టోరీస్’లో బోల్డ్‌క్యారెక్టర్‌తో భేష్ అనిపించుకుంది కియారా. ప్రస్తుతం హిందీలో ‘భూల్ భులయ్యా 2’, ‘జగ్ జగ్ జీయో’, ‘మిస్టర్ లేలే’ చిత్రాల్లో నటిస్తోంది. కియారా నటించిన ‘షేర్ షా’ రిలీజ్‌కు రెడీగా ఉంది.
ఇక్కడ కూడా అదే డిమాండ్!… కియారా అద్వానీ సినిమా చేయాలంటే భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందనే వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న కియారా అక్కడ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. హిందీ సినిమాలకి దేశమంతా క్రేజ్ ఉంటుంది కాబట్టి.. హీరోయిన్‌కున్న డిమాండ్‌ను బట్టి నిర్మాతలు భారీగా రెమ్యునరేషన్ ముట్ట చెబుతుంటారు. అదే ఆలోచనతో టాలీవుడ్ సినిమాకి డేట్స్ ఇవ్వమంటే హిందీలో ఎంత అందుకుంటున్నారో.. అంతే ఇక్కడ కూడా డిమాండ్ చేస్తున్న హీరోయిన్స్ ఉన్నారు. ఆ లిస్ట్‌లో ఇప్పుడు కియారా అద్వానీ కూడా చేరిందట. తెలుగు సినిమా కోసం దాదాపు రెండున్నర కోట్లు డిమాండ్ చేస్తుందనే మాట వినిపిస్తోంది.
ఎన్టీఆర్ 30వలో కియారా?… ఎన్టీఆర్ 30వ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో రాబోతోంది. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్గా నటించనుందనే వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. ‘భరత్ అనే నేను’ సినిమాతో టాలీవుడ్‌కి హీరోయిన్గా పరిచయమైన కియారా అద్వానీ మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకొని, ఆ తర్వాత ‘వినయ విధేయ రామ’ చేసింది. ఇప్పుడు బాలీవుడ్లో వరుస సినిమాలలో క్రేజీ హీరోయిన్గా మారడంతో తెలుగు సినిమాలు చేయలేనంత బిజీ అయిపోయింది. అయితే టాలీవుడ్‌కు పరిచయం చేసింది కొరటాల శివ కాబట్టి మరోసారి ఆయన దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. కొరటాల ప్రస్తుతం చిరంజీవి తో ‘ఆచార్య’ తెరకెక్కిస్తున్నాడు. ఇది పూర్తి కాగానే తారక్ సినిమా సెట్స్ మీదకి తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.