కియార అద్వాని చేతి నిండా సినిమాలు ఉన్నాయి. నిమిషం కూడా ఖాళీ లేకుండా గడుపుతోంది .ఈమె చేసిన ‘కబీర్ సింగ్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ప్రమోషన్ పనుల్లో కియార నిమగమైంది. ఈ చిత్రం కాకుండా ‘గుడ్‌న్యూస్’, కెప్టెన్ విక్రమ్ బయోపిక్, ‘లక్మీబాంబ్’, ‘ఇందూ కి జవాని’ చిత్రాలు వరుసగా చేయాల్సి ఉంది. ఈమె దక్షిణా భాషా చిత్రాలూ చేసేందుకు గ్రీన్‌సిగల్ ఇస్తోంది . అయితే నటిగా తనకు ప్రాంతం కానీ, భాష కానీ పరిధులు కావని చెప్పింది. జాతీయ స్థాయి నటిగా ఎదగాలన్నదే తన కోరిక అని పేర్కొంది ‘మిస్టర్ ధోని : ది అన్‌టోల్డ్ స్టోరీ’ తర్వాత తెలుగులో మహేశ్ బాబుతో ‘భరత్ అనే నేను’లోనూ, రామ్ చరణ్‌తో ‘వినయ విధేయ రామ’లోనూ నటించింది.
ప్రస్తుతం ‘కబీర్ సింగ్’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా కియారా మాట్లాడుతూ… ‘ మన ప్రతిభా పాఠవాలను ప్రదర్శించడానికి ప్రస్తుతం చాలా మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అది సినిమాగా చూస్తే ప్రాంతీయ భాషలో చేయొచ్చు. లేదా జాతీయ వెబ్ వరల్డ్‌లోనూ చేయొచ్చు. దానికి పరిధుల్లేమీ లేవు. హార్డ్‌వర్కే అంతిమంగా నిర్ణయిస్తుంది. భాష అన్నది హద్దు కాదు” అని చెప్పింది. కియరా సినిమాల ఎంపిక, తీసుకునే జాగ్రత్తలు గురించి మాట్లాడుతూ… ‘కొన్ని సమయాల్లో ఇంకా నిరీక్షిద్దాం అనుకుంటాం. మరికొన్ని సమయాల్లో వచ్చిన వాటిల్లో సరైన కథను చేయాల్సి వస్తుంది. అది మంచి కథ అయినప్పుడు… మనం చేయకపోతే మరొకరు ఆ అవకాశాన్ని కొట్టేస్తారు. ప్రేక్షకుల దగ్గర మంచి కంటెంట్ ఉంటుంది. మన ఆలోచనలను వాళ్లతో పంచుకుంటే ఆడియన్స్ మనసును దోచుకోవచ్చు” అని పేర్కొంది.
‘‘న్యూ ఏజ్ కామెడీ” చిత్రం
ఇందు ఓ సింగిల్ అమ్మాయి. బాయ్‌ఫ్రెండ్ కోసం ఎందెందు వెతికినా దొరకలేదు. ఇక లాభం లేదని డేటింగ్స్ యాప్స్ అన్నీ చూడటం మొదలుపెట్టింది. మరి ఇందూకు జోడీ కుదిరిందా లేదా? అనేది తెలియాలంటే ‘ఇందూకీ జవానీ’ చిత్రం చూడాల్సిందే. కియారా అద్వానీ ముఖ్యపాత్రలో తెరకెక్కనున్న చిత్రం ఇది. బెంగాలీ దర్శకుడు అభిర్ సేన్ గుప్తా ఈ చిత్రం ద్వారా బాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
నిఖిల్ అద్వానీ, నిరంజన్ అయ్యంగార్, ర్యాన్ స్టీఫెన్ సంయుక్తంగా నిర్మించనున్నారు. ‘‘న్యూ ఏజ్ కామెడీ” చిత్రంగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. డేటింగ్ సైట్లతో ఇందు పడ్డ ఇబ్బందులు చాలా సరదాగా ఉంటాయి. కియారా చేస్తున్న తొలి ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ ఇది’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. ‘‘ఇందు పాత్ర చాలా సరదాగా ఉంటుంది. ఈ పాత్రను పోషించడానికి చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను’’ అని కియారా అన్నారు.