నాతో నేనే ఛాలెంజ్‌ చేసుకుంటా !

కియారా అద్వానీ… నాకు మొదటిగా ‘ఫగ్లీ’ 2014లో అవకాశం దొరికింది. ఢిల్లీ అమ్మాయి పాత్ర పోషించాను. దానికి మిశ్రమ స్పందన వచ్చింది. ‘ఎమ్‌ఎస్‌ ధోనీ’ అన్‌ అన్‌టోల్డ్‌ స్టోరీ… బాక్సాఫీస్‌ దగ్గర మాత్రమే కాదు… నా నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు తెచ్చిన సినిమా. తరువాత సినిమా ‘మెషీన్‌’… అంటూ తన సినిమా కెరీర్ గురించి చెప్పింది ‘భరత్‌ అనే నేను’ నాయిక కియారా అద్వానీ.
 
సమాజానికి ప్రతీక…
‘లస్ట్‌ స్టోరీస్‌’… చాలా చర్చ జరిగిన సిరీస్‌. కరణ్‌జోహార్ సర్‌ కాల్‌ చేసినప్పుడు బై మిస్టేక్‌ నాకు చేశారేమో అనుకున్నా. ఎందుకంటే ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. లస్ట్‌ స్టోరీస్‌ కథ ..అది రియాలిటీ. దాన్నే అర్థమయ్యేట్టు చెప్పారు. దాంతో ఒప్పుకున్నాను. ఒకప్పుడు ముద్దు సీన్‌ అంటేనే అదో తప్పుగా చూసేవాళ్లు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. మహిళల కోరికలు, ఇష్టాయిష్టాలన్నీ ఇప్పుడు బహిరంగంగానే చర్చ జరుగుతున్నాయి. అందుకే అందులో నటించడానికి ఒప్పుకున్నాను. సినిమా సమాజానికి ప్రతీక అనుకుంటాను.
 
నా సామర్థ్యం మేరకు
కొరటాల శివగారు ముంబై వచ్చి ‘భరత్‌ అనే నేను’ స్క్రిప్ట్‌ చెప్పారు. ఈ సినిమాకు మాత్రం మహేష్‌ భార్య నమ్రత నాకు మంచి ఫ్రెండ్‌. ‘ఇది కచ్చితంగామంచి పాత్రవుతుంది’ అని ఆమె చెప్పింది. దాంతో ఓకే చెప్పాను. నిజానికి చాలా మంది హీరోయిన్‌కు ఏమాత్రం అవకాశం లేని పాత్ర అన్నారు. కానీ… నా పాత్రకు ఏమాత్రం న్యాయం చేయగలుగుతున్నాను అని మాత్రమే చూస్తాను. పాత్రకు ఎంత నిడివి ఉందనేదాని కంటే.. ఉన్న నిడివిలోనే ప్రేక్షకుల మదిలో నిలిచిపోగలనా లేదా అనేదే ఆలోచిస్తాను. ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. హీరోహీరోయిన్లు సమానంగా, బలమైన పాత్రలు పొందుతున్నారు. పోటీ కూడా తీవ్రంగానే ఉంది. కానీ తోటి హీరోయిన్స్‌ నటన చూసి స్ఫూర్తి పొందుతాను. అంతకంటే బాగా చేయాలని నాతో నేనే ఛాలెంజ్‌ చేసుకుంటా. నా సామర్థ్యం మేరకు నటిస్తా.
 
డ్యాన్స్‌ అంటే ఇష్టం…
నాకు డ్యాన్స్‌ అంటే చాలా ఇష్టం. అందుకే నటినయ్యా. కంప్లీట్‌గా అటు డ్యాన్స్‌, కామెడీ పెర్‌ఫామ్‌ చేయడానికి మంచి స్కోప్‌ ఉన్న సినిమాలో పని చేసే అవకాశం దొరికినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. ‘వినయ విధేయ రామ’ చేసినందుకు కూడా అదే ఫీలింగ్‌. ‘రామా వెడ్స్‌ సీత’ ఇప్పటి వరకు నేను చేసిన సాంగ్స్‌లో మోస్ట్‌ ఫేవరేట్‌. 800 మంది డ్యాన్సర్స్‌తో చాలా గ్రాండ్‌గా పిక్చరైజ్‌ చేశారు ఆ పాటని. ఇప్పుడు ‘అర్జున్‌ రెడ్డి’ రీమేక్‌ ‘కబీర్‌సింగ్‌’లో షాహిద్‌ సరసన నటిస్తున్నాను. పంజాబీ యువతి పాత్ర.
 
బయోపిక్‌ ఆశ…
అవును.. మధుబాల. స్టన్నింగ్‌ అండ్‌ బ్యూటిఫుల్‌ లేడీ. నాకు ఆమె గురించి అంతగా తెలియదు. ఆమె జీవిత చరిత్రలో నటించడంతోనైనా ఆమె గురించి పూర్తిగా తెలుసుకోవాలన్న ఆశ.
 
ఆకట్టుకునేవి…
మాదురీ దీక్షిత్‌ డ్యాన్సు స్టెప్పులు, కరీనా కపూర్‌ ముఖ కవళికలు నన్ను ఎంతో ఆకట్టుకునేవి. ఇక ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ శ్రీదేవిగారు. వాళ్ల సినిమాలలోంచి సీన్స్‌, పాటలు తీసుకుని వాళ్లను అనుకరించేందుకు ప్రయత్నించేదాన్ని.
 
షూటింగ్‌ లేకపోతే…
జిమ్‌ లేదా డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చేస్తా ఉంటాను. తరువాత జిమ్నాస్టిక్స్‌. చివరికి… నెట్‌ఫ్లిక్స్‌ చూసి, డిన్నర్‌ చేస్తాను. అంతే! అప్పుడప్పుడు ఫ్రెండ్స్‌తో రెస్టారెంట్‌కి వెళ్తుంటా.
 
లాంగ్వేజ్‌ ఏదైనా…
నాకైతే పర్టికులర్‌గా ఒకే లాంగ్వేజ్‌ ఆడియెన్స్‌కి స్టిక్‌ అవ్వాలనే ఆలోచన లేదు. గ్లోబల్‌ ఆడియెన్స్‌ని ఎంటర్‌టైన్‌ చేయాలి. లాంగ్వేజ్‌ ఏదైనా, స్క్రిప్ట్‌ బావుంటే అది డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్‌ అయినా ‘నో’ అని చెప్పను