కైరా అద్వానీ… బాలీవుడ్లో నా మొదటి సినిమా ‘ఫగ్లీ’ అట్టర్ ఫ్లాప్. ఆ సినిమా ఫలితం బాగా నిరాశపరిచింది. ‘ఎంఎస్ ధోని’ సినిమా చేసేటంత వరకూ చాలా నిరాశలో ఉన్నాననే చెప్పాలి. ఆ సినిమా తరువాత అపజయాలు మళ్ళీ పలకరించలేదు. విజయాలను తలకెక్కించుకుని పొగరుతో వ్యవహరించే తత్వం కాదు నాది. వచ్చిన ప్రతి అవకాశాన్ని చేసుకుంటూ పోతే, పరాజయాల లిస్టే ఎక్కువ ఉంటుంది. అందుకే ఆచి తూచి ఒప్పుకుంటున్నాను…అని చెబుతోంది భరత్ భామ కైరా అద్వానీ.
‘లస్ట్ స్టోరీస్’ వెబ్ సిరీస్ ఎందుకు చేశారని అడిగితే…
ఈ ప్రశ్న ఇప్పటికే చాలా మంది అడిగారు. లైంగిక స్వేచ్ఛ అన్న అంశం మీద దీన్ని తీసారు. లైంగిక స్వేచ్ఛ అనేది సిగ్గుపడాల్సిన అంశం కాదు. అందుకే చేసాను. కథాపరంగా బోల్డ్‌గా నటించాలి కనుక నటించాను. అంతే తప్ప అన్ని సినిమాలు అలా చేస్తానని కాదు.‘లస్ట్ స్టోరీస్’ కేవలం కరణ్జోహార్గారి గురించే చేసాను. అంతే తప్ప, మరో వెబ్ సిరీస్ చేసే ఆలోచన లేదు. భవిష్యత్తులో కూడా చేయను. ప్రస్తుతం బాలీవుడ్లో రెండు సినిమాలు, దక్షిణాదిన రెండు సినిమాలు చేస్తున్నాను. వీటితో ఫుల్‌బిజీ. ‘నటి అన్న తరువాత అన్ని పాత్రలు చేయాలి’ అన్న ఒకేఒక్క కారణంతో ‘లస్ట్ స్టోరీస్’ చేయడం జరిగింది.
నాకన్నా ముందు చాలామంది చేసారు
నేను ఐటెంసాంగ్ చేయబోయేది కూడా కరణ్జోహార్గారి సినిమా ‘కళంక్’లోనే! ఆ సినిమాలో ఐటెంసాంగ్ ఒక్కటే కాకుండా చిన్నపాత్ర కూడా చేస్తున్నాను. పాత్ర నచ్చింది. వెంటనే ఓకే చెప్పాను. ఉత్తరాదిన కానీ, దక్షిణాదిన కానీ ఐటెంసాంగ్స్ చేసే హీరోయిన్ని నేను ఒక్కదాన్నే కాదుగా! నాకన్నా ముందు చాలామంది చేసారు. ఆ పాటలతో మంచి పేరు కూడా తెచ్చుకున్నారు. ‘ఐటెంసాంగ్ అంటే చాలా ఈజీ’ అన్న అభిప్రాయం చాలామందిలో ఉంది అది తప్పు. ఇలాంటి సాంగ్స్ చేయడానికి చాలా ఎనర్జీ కావాలి. నాలో ఆ ఎనర్జీ ఉందనే కరణ్‌జోహార్‌గారు నాకు ఆ అవకాశం ఇచ్చారు.
నేను బాగా డ్యాన్స్ చేస్తానని అందరూ అంటూంటారు. అలాగని నేనేదో పెద్ద డ్యాన్సర్‌ని అనుకోను. అంత బాగా చేసేదాన్నే అయితే… ఇటీవల ప్రభుదేవాగారి ‘ఊర్వశి’ పాటకు డ్యాన్స్ చేసే సమయంలో బాగా ఒత్తిడికి గురయ్యాను. క్లాసిక్ సాంగ్స్ రీమేక్ చేసే సమయంలో చాలా జాగ్రత్తగా చేయాలి. అంతేకాదు షాహిద్ నా కన్నా మంచి డ్యాన్సర్ తనతో పోటీ పడి చేయడం కష్టమే అనిపించింది. ఇక డ్యాన్స్ ప్రధానాంశంగా సినిమా చేసే ఆలోచన ప్రస్తుతానికి లేదు. అలాంటి అవకాశమొస్తే ఆలోచిస్తాను.
నాకంటూ డ్రీమ్ ప్రాజెక్టులు లేవు. ఇప్పటి వరకూ ఏవి వస్తే అవే చేసుకుంటూ పోతున్నాను. వచ్చిన అవకాశాల్లో మంచి సినిమాలు, మంచి పాత్రలు చేస్తున్నాను. ‘ఇలాంటి పాత్ర చేయాలి’ అన్న ఆలోచన ఇంత వరకూ రాలేదు. ఇక ముందు వస్తుందేమో చెప్పలేను.