దాన్ని సద్వినియోగం చేసుకుంటే చాలు !

‘భరత్‌ అనే నేను’ సినిమా చేస్తున్న సమయంలో అందరూ నన్ను ‘ధోని’ సినిమా సాక్షివి కదా? అని అడిగేవారు. అందరూ అలా అడుగుతుంటే చాలా సంతోషమనిపించేది. ‘భరత్‌ అనే నేను’ తరువాత టాలీవుడ్‌లో వెనుతిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి…అని చెప్పింది కియారా అద్వానీ. సినీ రంగంలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమయం వస్తుంది. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే చాలు. నాకూ తెలుగులో మొదటి సినిమాతోనూ, హిందీలో ‘ఎంఎస్‌ ధోని’ సినిమాతోనూ అలాంటి టైమొచ్చింది. కెరీర్‌ ప్రారంభంలోనే కలిసి రావడం నా అదృష్టం.
 
ఆ కష్టం నా రెండవ సినిమాలో పడ్డాను!
కథ నచ్చితే వెంటనే ఒప్పుకుంటున్నాను. ఇప్పటి వరకూ నా జడ్జిమెంటు ఎప్పుడూ తప్పలేదు. కానీ ‘వినయ విధేయ రామ’ మాత్రం కొద్దిగా తేడా కొట్టింది. అయినా ఆ సినిమాలో నా డ్యాన్సులకు, నా నటనకు మంచి మార్కులే పడ్డాయి. క్లాస్‌, మాస్‌ అన్న భేదం నాకు లేదు. నా మొదటి సినిమా క్లాస్‌గా కనిపిస్తే రెండవ సినిమాలో మాస్‌గా కనిపించాను. కాకపోతే మాస్‌ ప్రేక్షకులను మెప్పించడం అంత తేలిక కాదు. హీరోలకి కనెక్ట్‌ అయినట్టు ప్రేక్షకులు హీరోయిన్లకు కనెక్ట్‌ కారు. క్లాస్‌ సినిమా కన్నా మాస్‌ సినిమా చేయడమే కొద్దిగా కష్టం. ఆ కష్టం నా రెండవ సినిమాలో పడ్డాను. తెలుగు అయినా, హిందీ సినిమా అయినా డైరెక్టర్‌ విజన్‌ను నేను పూర్తిగా నమ్ముతాను. సినిమాలో నా స్క్రీన్‌ టైమ్‌ ఎంతసేపు ఉందన్నది కాదు. నా క్యారక్టర్‌కి న్యాయం చేశానా? లేదా? అన్నదే నాకు ముఖ్యం. అలాగే తెర మీద నా క్యారక్టర్‌ మాత్రమే బాగా రావాలన్న దురాశ కూడా నాకు లేదు.ఏనటి అయినా విభిన్న తరహా పాత్రలు చేయడానికే ఇష్టపడతారు. పాటలకీ, డ్యాన్సులకి మాత్రమే పరిమితం కావాలనుకోరు. దానికి నేనేమీ మినహాయింపు కాదు. నా అదృష్టం కొద్దీ నా కెరీర్‌ మొదటి నుంచి విభిన్నమైన పాత్రలే వస్తున్నాయి. ఒకదానితో ఒకటి పోలిక ఉండదు. ఇప్పటి వరకూ అలాంటి పాత్రలే వచ్చాయి.
 
‘కబీర్‌ సింగ్‌’ తెలుగు ‘అర్జు‌న్‌ రెడ్డి’కి రీమేక్‌ అన్న సంగతి తెలిసిందే! అక్కడి నేటివిటీకి తగినట్టు మార్పులు చేర్పులు చేశారు. ప్రీతి క్యారక్టర్‌ నేను చేస్తున్నాను. దీన్ని బాలీవుడ్‌ ప్రేక్షకులు ఇష్టపడతారనే అనుకుంటున్నాను. తెలుగు ‘అర్జున్‌ రెడ్డి’ చూశాను. విజయ్‌ దేవరకొండ నటనకు ఫిదా అయిపోయాను.ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాను. మరో రెండు సినిమాలకు ఓకే చెప్పాలి. ఓ పంజాబీ సినిమా చేస్తున్నాను.