తొలి సినిమాలో చూపిన ఉత్సాహాన్నే చూపిస్తోంది!

కీర్తీ సురేష్‌ సక్సెస్‌ ఫామ్‌లో వరుస సినిమాలకు సైన్‌ చేస్తూ మరింత బిజీ అవుతున్నారు . ఆల్రెడీ తెలుగులో రెండు (మిస్‌ ఇండియా, నగేష్‌ కుక్కునూరు దర్శకత్వంలో ఓ సినిమా), మలయాళంలో ‘మరక్కార్‌: ది అరభికడలింటే సింహమ్‌’, హిందీలో ‘మైదాన్‌’ సినిమాలను చేస్తున్న కీర్తీ తాజాగా ఓ తమిళ సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.ఎమోషనల్‌ థ్రిల్లర్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాతో ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ‘పిజ్జా, పేట’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన కార్తీక్‌ సుబ్బరాజ్‌ ఈ సినిమాకు ఓ నిర్మాతగా ఉన్నారు. ఈ సినిమా చిత్రీకరణ కొడైకెనాల్‌లో ప్రారంభమైంది. రెండు, మూడు షెడ్యూల్స్‌లోనే ఈ సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నారట. ఈ సినిమాకు సంతోష్‌ శివన్‌ సంగీతం అందిస్తున్నారు.
సంగీత విద్వాంసురాలిగా
కీర్తీ సురేశ్‌ తాజాగా ‘మరక్కార్‌: అరబికడలింటే సింహం’ సినిమా కోసం వీణ వాయించడం నేర్చుకున్నారు. మోహన్‌లాల్‌ ముఖ్యపాత్రలో ప్రియదర్శన్‌ దర్శకత్వంలో తెరకెక్కింది. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో కీర్తీ అతిథి పాత్రలో నటించారు. కీర్తీ పాత్ర గురించి దర్శకుడు ప్రియదర్శన్‌ మాట్లాడుతూ– ‘‘మరక్కార్‌’ సినిమాలో క్లాసికల్‌ సంగీత విద్వాంసురాలిగా కీర్తీ కనిపిస్తారు. ఆమె పాత్రే కథలో ఓ మలుపు తీసుకొస్తుంది.మరక్కార్‌ ఫ్రెండ్‌ చినాలి అనే వ్యక్తితో కీర్తీ ప్రేమలో పడుతుంది. జనరల్‌గా పాత్రని వివరించగానే స్క్రీన్‌ మీద ఎలా కనిపిస్తాం అనే దానికంటే.. ‘ఎలాంటి అవుట్‌ పుట్‌ తీసుకురావాలా’ అని కీర్తీ ఆలోచిస్తుంది. ఈ పాత్ర కోసం చాలా కష్టపడి వీణ వాయించడం నేర్చుకుంది. వీణ నేర్చుకోవడం అంత సులభం కాదు. సెట్లో ప్రతీ నోట్‌ కరెక్ట్‌గా వాయించింది. ఇప్పటికీ తొలి సినిమాలో చూపించిన ఉత్సాహాన్నే చూపిస్తోంది’’ అని ప్రియదర్శన్‌ అన్నారు. విశేషం ఏంటంటే… కీర్తీ మొదటి మలయాళం సినిమా ‘గీతాంజలి’కి ప్రియదర్శన్‌ దర్శకుడు
 
ఫుట్‌బాల్‌ కోచ్‌ భార్యగా కీర్తీ సురేశ్‌
ఇండియన్‌ ఫుట్‌బాల్‌ కోచ్, మేనేజర్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రహీమ్‌ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘మైదాన్‌’. 1950 నుంచి 1963 వరకూ ఇండియన్‌ ఫుట్‌బాల్‌ కోచ్‌గా వ్యవహరించారు సయ్యద్‌.
ఆయన పాత్రను అజయ్‌ దేవగన్‌ పోషిస్తున్నారు. అజయ్‌ భార్యగా కీర్తీ సురేశ్‌ నటిస్తున్నారు. ఈ సినిమాతోనే బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నారు కీర్తీ. సౌత్‌లో ‘మహానటి’ అనిపించుకున్న కీర్తీ బాలీవుడ్‌ ప్రేక్షకుల దగ్గర కూడా మెప్పు పొందుతారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రానికి ‘బదాయిహో’ ఫేమ్‌ అమిత్‌ రవీంద్రనాథ్‌ శర్మ దర్శకుడు. బోనీ కపూర్, ఆకాశ్‌ చావ్లా, అరునవ జోయ్‌ గుప్తా నిర్మిస్తున్నారు.