“పాత్రల్లో ఒదిగిపోవడం ఎంత ముఖ్యమో, వాటి ప్రభావం నుంచి బయటికి రావడం అంతకంటే ముఖ్యమ”ని చెబుతోంది కీర్తిసురేష్. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశాననే మాట నటుల నుంచి తరచూ వినిపిస్తుంటుంది. కొన్ని కథలు, పాత్రలు నటులకి ఆ స్థాయిలో కనెక్ట్ అవుతుంటాయి. అయితే పాత్రల్లో ఒదిగిపోవడం ఎంత ముఖ్యమో, వాటి ప్రభావం నుంచి బయటికి రావడం అంతకంటే ముఖ్యమని చెబుతోంది కీర్తిసురేష్.
‘‘నటులు రోజూ ఒక కొత్త పాత్రతో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఒక పాత్రలోనే ఉండిపోతే సమస్యలొస్తాయి. కొన్ని పాత్రలు వ్యక్తిగత జీవితంపై కూడా ప్రభావం చూపుతుంటాయి.ఆ విషయాన్ని కెరీర్ ఆరంభంలోనే పసిగట్టాను. అందుకే సెట్ నుంచి బయటికి వస్తుండగానే స్విచ్చాఫ్ చేసినట్టుగా ఆ పాత్రని అక్కడే వదిలిపెట్టి ఇంటికి రావడం అలవాటు చేసుకొన్నా. నా కెరీర్లో ఒకే ఒక్కసారి… ‘మహానటి’ విషయంలో మాత్రమే అది సాధ్యం కాలేదు.ఆ సినిమా తర్వాత కూడా కొన్నాళ్లపాటు ఆ కథ, పాత్ర నన్ను వెంటాడాయ’’ని చెప్పింది కీర్తి. ఆమె త్వరలోనే ‘మన్మథుడు 2’తో సందడి చేయబోతోంది. తెలుగు, తమిళం, హిందీల్లో అవకాశాలు అందుకొంటున్న కీర్తి ఇటీవల బరువు తగ్గి నాజూగ్గా మారింది.
లేడీ ఓరియంటెడ్ ‘సఖి’
కీర్తీ సురేశ్ అండ్ టీమ్ యూరప్ నుంచి ఇండియాకి రిటర్న్ అయ్యారు. అక్కడి షెడ్యూల్ ముగించుకుని వచ్చారు కదా! కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుంటారేమో? అంటే నో రెస్ట్ అట. మరో వారం నుంచి మళ్లీ పనిలో పడిపోతారట. కీర్తీ సురేశ్ ముఖ్య పాత్రలో నూతన దర్శకుడు నరేంద్రనాథ్ ఓ లేడీ ఓరియంటెడ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మహేశ్ కోనేరు నిర్మాత.ఈ చిత్రానికి ‘సఖి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఇటీవలే స్పెయిన్‌లో నెలరోజులు చిత్రీకరణ జరిపారు యూనిట్. వారం రోజుల్లో హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించనున్నారు. రాజేంద్రప్రసాద్, నదియా, నరేశ్, కమల్ కామరాజు కీలక పాత్రలో నటించనున్న ఈ చిత్రాన్ని దసరాకు రిలీజ్ చేయనుంది చిత్ర యూనిట్.
నితిన్-వెంకీ అట్లూరి ‘రంగ్ దే!’
నితిన్-వెంకీ అట్లూరి తో చేస్తున్న చిత్రానికి ‘రంగ్ దే!’ అని టైటిల్ ఫిక్స్ చేశారు. కీర్తీ సురేశ్ కథానాయిక. నితిన్, కీర్తీ కలసి యాక్ట్ చేయడం ఇది తొలిసారి. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై పీడీవీ ప్రసాద్, నాగవంశీ నిర్మించనున్నారు. ఈ సినిమాకు పీసీ శ్రీరామ్ కెమెరామేన్. 2020 సమ్మర్లో ఈ సినిమా రిలీజ్ కానుంది.