వంద కోట్ల కు ‘మహానటి’ : డిజిట‌ల్‌,శాటిలైట్ రైట్స్ 18 కోట్లు

‘మ‌హాన‌టి’ సినిమాతో సావిత్రిని మరోసారి కళ్ల ముందు కదలాడించారు దర్శకుడు నాగ్ అశ్విన్. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై విడుదలైన ఈ సినిమా భారీ సక్సెస్ సాధించి నిర్మాత‌ల‌కు కాసుల పంట పండిస్తోంది. దాదాపు  20 కోట్ల బడ్జెట్ లో  చేసిన ఈ చిత్రం  సునాయాసం గా  వంద కోట్లు వసూలు చేస్తుందని పరిశీలకులు అంటున్నారు . తెలుగు రాష్ట్రాల‌తోపాటు ఓవ‌ర్సీస్‌లోనూ ‘మ‌హాన‌టి’ హ‌వా కొనసాగుతోంది. ఇప్ప‌టికే థియేట‌ర్ల‌లో భారీ వ‌సూళ్లు రాబడుతున్న ఈ సినిమా డిజిట‌ల్‌, శాటిలైట్ హ‌క్కుల రూపంలో భారీ సొమ్మును కూడగట్టింది.
 డిజిట‌ల్‌, శాటిలైట్ హ‌క్కుల ద్వారా 18 కోట్ల రూపాయలు రాబట్టింది ‘మహానటి’ సినిమా. అంటే సినిమా తెరకెక్కించేందుకు పెట్టిన పెట్టుబడిలో దాదాపు 80 శాతం ఈ రూపంలో లోనే వచ్చేసింది. ఓ వైపు సినీ రాజకీయ ప్రముఖుల ప్రశంసలు.. మరోవైపు భారీ సొమ్ము మహానటి టీమ్ ఖాతాలో చేరుతుండటంతో ఆనందంలో మునిగితేలుతోంది చిత్రయూనిట్. విడుదలకు ముందు ఈ సినిమా శాటిలైట్ హక్కులకు అంతగా డిమాండ్ లేకపోయినా.. విడుదల తర్వాత ఒక్కసారిగా ఇంతలా డిమాండ్ పెరగడం విశేషం.

 

అమెరికాలో మిలియన్‌ డాలర్‌ మార్క్‌ను దాటేసింది !
సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన   ‘మహానటి’ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు అదే స్థాయిలో వసూళ్లు కూడా సాధిస్తూ దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాట హౌస్‌ ఫుల్‌ కలెక్షన్లతో నడుస్తున్న మహానటి చిత్రం ఓవర్‌ సీస్‌లో కూడా సత్తా చాటుతోంది. ఇప్పటికే అమెరికాలో మిలియన్‌ డాలర్‌ (ఆరు కోట్ల రూపాయల) మార్క్‌ను దాటిన మహానటి సినిమా ఇతర ప్రాంతాల్లో కూడా అదే జోరు చూపిస్తోంది.

మహానటి ఓవర్‌ సీస్‌ కలెక్షన్ల వివరాలు ప్రముఖ బాలీవుడ్‌ ఎనలిస్ట్‌ తరణ్ ఆదర్శ్‌ వెల్లడించారు. తొలి నాలుగు రోజుల్లో ఈ సినిమా ఆస్ట్రేలియాలో 1,25,900 డాలర్లు (64.03 లక్షల రూపాయలు), యూకేలో 28,373 పౌండ్లు (25.90 లక్షల రూపాయలు), న్యూజీలాండ్‌లో 9,899 డాలర్లు ( 4.65 లక్షల రూపాయల) వసూళ్లు సాధించినట్టుగా వెల్లడించారు