‘మహానటి’ సావిత్రి కి ఘన నివాళి ……’మహానటి’ చిత్ర సమీక్ష

వైజ‌యంతీ మూవీస్‌, స్వప్న సినిమాస్‌ బ్యానర్ల పై నాగ అశ్విన్ దర్శకత్వం లో ప్రియాంకదత్ ఈ చిత్రాన్ని నిర్మించారు
 
బెంగ‌ళూరు చాళుక్య హోట‌ల్‌లో సావిత్రి(కీర్తి సురేశ్‌) కోమాలో ఉంటుంది. సావిత్రి గొప్ప న‌టి. ఎన్నో గొప్ప పాత్రలు చేసి స్టార్ హీరోయిన్‌గా రాణించింది. ఆమె కోమా స్టేజ్‌లో హాస్పిట‌ల్‌లో ఎందుకు ఉండాల్సి వ‌చ్చింది. అస‌లేం జ‌రిగింది? అనే దానిపై ‘ప్రజావాణి’ పత్రిక న్యూస్ క‌వ‌ర్ చేయాల‌నుకుంటుంది. అందులో భాగంగా మ‌ధుర‌వాణి(స‌మంత‌), ఫొటోగ్రాఫ‌ర్ విజ‌య్ ఆంటోని (విజ‌య్ దేవ‌ర‌కొండ‌) వివ‌రాలు సేక‌రించ‌డం మొద‌లు పెడ‌తారు. క‌థ అలా సావిత్రి గురించి స్టార్ట్ అవుతుంది. విజ‌య‌వాడ‌లో బాల్య ద‌శ నుంచి సావిత్రి సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వడం క్రమంగా స్టార్ హీరోయిన్‌గా ఎద‌గ‌డం… అప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న జెమిగ‌ణేశ‌న్‌ను వివాహం చేసుకోవ‌డం… హీరోయిన్‌గా తిరుగులేని వైభ‌వాన్ని చూడ‌టం… అంత‌లోనే భ‌ర్తతో విభేదాలు రావ‌డం తాగుడుకి బానిస కావ‌డం. చివ‌ర‌కు కోమా ద‌శ‌లో ప్రాణాలు విడవడం… . ఇలా మ‌హాన‌టి సావిత్రి జీవితంలోని వివిధ కోణాలను ఈ చిత్రం అందంగా ఆవిష్కరించింది. అస‌లు సావిత్రికి భ‌ర్తతో ఎందుకు విబేదాలు వ‌చ్చాయి? ఎందుకు ఆమె కోమాలోకి వెళ్లింది? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమాలో చూడాల్సిందే….
 
ఓ మ‌హాన‌టి జీవిత‌గాథ‌ను తెర‌కెక్కించ‌డం సాధార‌ణ విష‌యం కాదు. ముందుగా ద‌ర్శకుడు నాగ్ అశ్విన్‌, నిర్మాత ప్రియాంక‌, స్వప్నద‌త్‌ల‌ను అభినందించాలి. వీరి ప‌ట్టుద‌ల వ‌ల్లే మ‌హానటి సినిమాగా రూపొందింది. పరిశోధించి  సినిమాగా తీర్చిదిద్దాడు.చిత్రాన్ని మధురవాణి (సమంత) అనే ఒక జర్నలిస్ట్ తో మొదలుపెట్టిన దర్శకుడు మెల్లగా ప్రేక్షకుల్ని సావిత్రి జీవితంలోకి తీసుకెళ్లిపోతాడు. సినిమా చూస్తున్నంతసేపు సావిత్రిని దగ్గర్నుండి గమనించినట్టే ఉంటుంది.అలాగే సావిత్రి సినిమా, వ్యక్తిగతమైన జీవితాల్ని సమాంతరంగా నడుపుతూ ….ఒక జీవితం ఇంకో జీవితంపై ఎలాంటి ప్రభావం చూపింది, జెమినీ గణేశన్ తో ఆమె ప్రేమ ఎలా ఉండేది, మనసారా ప్రేమించిన జెమినీ గణేశన్ మధ్యలో సావిత్రిని ఎలా నిర్లక్ష్యం చేశాడు, నా అనుకున్న వాళ్లంతా ఆమెను ఎలా మోసం చేశారు, ఆ క్షోభను మర్చిపోవడానికి ఆమె మద్యానికి ఎంతలా బానిసయ్యారు? ఈ విషయాల్ని ఎంతో భావోద్వేగపూరితంగా వివరించారాయన. అలాగే ఆమె నటిగా ఎదగడంలో కె. వి.రెడ్డి, కె.వి.చౌదరి, ఎల్వి. ప్రసాద్, చక్రపాణి లాంటి ప్రముఖుల పాత్ర కూడా సవివరంగా చూపారు.
 
సావిత్రి గురించి అంద‌రికీ తెలిసిన విష‌యాలే అయినా ఎక్కడా ఫ్లో మిస్ కాకుండా చ‌క్కటి సినిమా రూపంలోకి తీసుకొచ్చారు. సినిమా చూసే ప్రేక్షకుడికి సావిత్రి ఇంత గొప్ప న‌టా! అనే విష‌యంతో పాటు ఆమెలో ఉన్న మాన‌వ‌త్వం కూడా తెలుస్తుంది. ముఖ్యంగా సావిత్రిగారి పతనాన్ని చూపిన విధానం, ఆమె మద్యానికి ఎంతలా బానిసయ్యారు, ప్రేమించిన జెమినీ గణేశన్ మోసానికి ఎంతలా కుంగిపోయారు అనే అంశాలని సన్నివేశాల రూపంలో అయన చూపిన తీరు మనసుల్ని హత్తుకున్నాయి.
సినిమాకు ప్రధాన బలం కీర్తీ సురేష్‌. సావిత్రి పాత్రలో కీర్తీ సురేష్ పరకాయ ప్రవేశం చేసిందా? అన్నంతగా జీవించారు.తెర మీద సావిత్రినే చూస్తున్నామా అన్నంతగా మెప్పించారు కీర్తి సురేష్‌. గొప్పగా న‌టించింది. ఇందులో సావిత్రి సినిమా, నిజ జీవితం స‌మాంత‌రంగా న‌డిచాయి. స్టార్ హీరోయిన్‌గా, భార్య‌,త‌ల్లిగా ఇలా వివిధ ద‌శ‌ల్లో ఆమె జీవించిన క్రమంలో మార్పుల‌ను, హావ‌భావాల‌ను కీర్తి సురేశ్ చ‌క్కగా ప‌లికించింది. సావిత్రి భర్త జెమినీ గణేష్‌ పాత్రలో దుల్కర్‌ సల్మాన్‌ ఒదిగిపోయారు. తొలినాళ్లలో సావిత్రికి సాయం చేసే ప్రేమికుడిగా తరువాత తనను దాటి సావిత్రి ఎదిగిపోతుందన్న ఈర్ష్యతో కోపం పెంచుకున్న వ్యక్తిగా రెండు వేరియేషన్స్‌ ను చాలా బాగా చూపించారు.
 
సావిత్రి కథను నడిపించే కీలక పాత్రలో సమంత ఆకట్టుకున్నారు. జర్నలిస్ట్‌ మధురవాణిగా సావిత్రి జీవితం గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించే పాత్రలో సమంత జీవించారు. ముఖ్యంగా క్లైమాక్స్‌ సీన్స్‌లో సమంత నటన కంటతడి పెట్టిస్తుంది.ఇక సావిత్రి పెద్ద నాన్న కె.వి.చౌద‌రి పాత్రలో రాజేంద్ర ప్రసాద్‌, ‘ప్రజావాణి’ పత్రిక ఎడిటర్ పాత్రలో త‌నికెళ్ల భ‌ర‌ణి, సావిత్రి త‌ల్లి సుభ‌ద్రమ్మ పాత్రలో భానుప్రియ, సావిత్రి మేన‌త్త దుర్గాంబ‌గా దివ్యవాణి, జెమిని గ‌ణేశ‌న్ మొద‌టి భార్య అల‌మేలు పాత్రలో మాళ‌వికా నాయ‌ర్‌, సావిత్రి స్నేహితురాలు సుశీల పాత్రలో షాలిని పాండే త‌దిత‌రులు పాత్రలకు న్యాయం చేశారు. అందులో ఎస్‌.వి.రంగారావుగా న‌టించిన మోహ‌న్‌బాబు, అక్కినేని పాత్ర‌లో నాగ‌చైత‌న్య చ‌క్కగా సూట్ అయ్యారు. ఇక అలూరి చ‌క్రపాణిగా ప్రకాశ్ రాజ్‌, ఎల్‌.వి.ప్రసాద్ పాత్రలో శ్రీనివాస్ అవ‌స‌రాల‌, ఆదుర్తి సుబ్బారావుగా సందీప్ వంగా, సింగీతం శ్రీనివాస‌రావుగా త‌రుణ్ భాస్కర్, కె.వి.రెడ్డి పాత్రలో క్రిష్ అంద‌రూ అతిథి పాత్రల్లో న‌టించి అల‌రించారు
 
1970 నాటి ప‌రిస్థితుల‌ను సినిమా రూపంలో తెర‌కెక్కించ‌డం అంటే ప్రతీ విష‌యంలో ఎంతో జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. దాన్ని ద‌ర్శకుడు చక్కగా పాటించాడు. సంగీతం, ఆర్ట్ వ‌ర్క్‌, కెమెరావ‌ర్క్ సినిమాకు వెన్నెముక‌గా నిలిచాయి.మిక్కీ జె.మేయ‌ర్ ఇప్ప‌టి వ‌ర‌కు సంగీతం, నేప‌థ్య సంగీతం అందించిన సినిమాల‌కు భిన్నమైన సినిమా మ‌హాన‌టి. అందులో వివిధ కోణాలు ఆవిష్కరించారు.ఒక ప‌క్క సినిమాలు, మ‌రో ప‌క్క జీవిత చ‌రిత్ర‌. ఇన్ని కోణాల‌ను ట‌చ్ చేసే క్రమంలో సంగీతం సినిమాకు ఎసెట్ అయ్యింది. ఇక సినిమాటోగ్రాఫ‌ర్ డానీ ప్రతీ సీన్‌ను అద్భుతంగా చూపించాడు. ఇక సావిత్రి బ‌యోపిక్ అంటే ఆమె వాడిన దుస్తులు, కేశాలంక‌ర‌ణ వ‌స్తువులు, హెయిర్ స్టైల్ ఇలా అన్నీ డిఫ‌రెంట్‌గానే ఉంటాయి. వీటిని అవినాశ్ త‌న క‌ళా ద‌ర్శక‌త్వంలో ఒదిగిపోయేలా చేశారు. “ప్రతిభ ఇంట్లో కూర్చుంటానంటే ప్రపంచం ఒప్పుకోదు.. నీ క‌ల‌లు కూడా నేను క‌న్నాను.. నీరు కార్చేశావు క‌దే” అని సంద‌ర్భానుసారంగా వ‌చ్చే సాయి మాధవ్‌ బుర్రా రాసిన సంభాషణలు మనసును తాకుతాయి. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి      -ధరణి