సినీ వినోదం రేటింగ్ : 2/5
ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకం పై నరేంద్రనాథ్ దర్శకత్వంలో మహేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మించారు.ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ లో నవంబర్ 4 న విడుదలయ్యింది.
కధ… ఓ మధ్యతరగతి కుటుంబానికి పెద్ద శివరామకృష్ణ(వీకే నరేశ్). ఆయనకు ఇద్దరు ఆడపిల్లలు,ఓ అబ్బాయి. ఇందులో చిన్నమ్మాయి మానస సంయుక్త(కీర్తిసురేశ్). చిన్నప్పుడే ఎంబీఏ చదివి బిజినెస్ ఉమెన్ కావాలని నిర్ణయించుకుంటుంది. ఈమె తాతయ్య(రాజేంద్రప్రసాద్) ఓ ఆయుర్వేద డాక్టర్, టీ స్పెషలిస్ట్. రోగులకు కొన్ని చిన్న చిన్న జీర్ణ సంబంధిత సమస్యలను టీ ద్వారా నయం చేస్తుంటాడు. మానసకు తాతయ్య చేసే టీ అంటే ప్రాణం. తన తాతకు మంచి పేరు తెస్తానని మాట ఇచ్చి.. ఆయన దగ్గర టీ గురించిన వివరాలను తెలుసుకుంటుంది. ఉద్యోగంలో ఒత్తిడి కారణంగా శివరామకృష్ణకు అల్జిమర్స్ వచ్చేస్తుంది. దాంతో ఇంటి భారం పిల్లలు మోయాల్సి వస్తుంది. సమస్యలను పట్టించుకోకుండా మానస అక్కయ్య నచ్చినవాడిని పెళ్లి చేసుకుని వెళ్లిపోతుంది. ఇక మానస అన్నయ్య(కమల్ కామరాజు)కి యు.ఎస్‌లో ఉద్యోగం రావడంతో అమెరికా వెళదామని అంటాడు. మానస తాతయ్య కుటుంబంతో సహా అమెరికా వెళ్లడం ఇష్టం ఉండక కన్నుమూస్తాడు.దాంతో ఇక శివరామకృష్ణ కుటుంబం అమెరికా వస్తుంది. అక్కడ మానసకు విజయ్(నవీన్ చంద్ర)తో పరిచయం ఏర్పడుతుంది. మానసను విజయ్ పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించినా ఆమె ఒప్పుకోదు. బిజినెస్ చేయాలని అనుకుంటుంది. దాంతో ఇంట్లో గొడవ జరుగుతుంది. మానస ఇల్లు వదలి వచ్చేస్తుంది. అదే సమయంలో అమెరికాలో సెటిలైన టాప్ కాఫీ కంపెనీ ఓనర్ కైలాస్ శివకుమార్(జగపతిబాబు)ని కలుస్తుంది. కైలాస్ ఇచ్చిన వెయ్యి డాలర్ల తో మానస టీ బిజినెస్‌ను ఎలా స్టార్ట్ చేస్తుంది? ఆమె ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటుంది? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమాలో చూడాలి…
విశ్లేషణ… అమ్మాయి తన కలను నేరవేర్చుకునే క్రమంలో ఎలాంటి సమస్యలను ఫేస్ చేసిందనేదే కధాంశంతో చేసిన ఈ సినిమాలో ఎలాంటి చెప్పుకోదగ్గ ట్విస్టులు, టర్న్‌లు లేవు. సినిమా చూసే క్రమంలో ఆసక్తి నీరుగారిందనే చెప్పాలి. సినిమా చూసేటప్పుడు ప్రేక్షకుడు ఎమోషన్స్‌కు కనెక్ట్ కావాలి. కానీ.. ఎక్కడా ప్రేక్షకుడు భావోద్వేగానికి లోను కాడు. రియాలిటీకి దూరంగా ఉన్న ఓ కాన్సెప్ట్‌తో సినిమా చేసినట్టు అనిపించింది. సినిమా ప్రారంభంలో హీరోయిన్ కుటుంబ పరిస్థితులు..వెనువెంటనే వాళ్లు అమెరికాకు చేరుకోవడం వంటి సన్నివేశాలు సగటు మధ్య తరగతి కుటుంబంలో జరిగే సంఘటలకు భిన్నంగా సాగుతాయి. సినిమా పస్టాప్ అంతా హీరోయిన్ బిజినెస్ ఎలాస్టార్ట్ చేయాలా అంటూ.. సెకండ్ హాఫ్ అంతా హీరోయిన్, విలన్ మధ్య బిజినెస్ పోరు.. అది చూస్తే వేక్‌గా అనిపిస్తుంది.ఛాయ్ కాఫీ ల మధ్య జరిగే పోటీలో ఛాయ్ ని గెలిపించే సీన్లు బాగా ల్యాగ్ అయ్యాయి.. వేక్‌గా అనిపిస్తాయి. ‘చిన్నతనం నుంచే కలలు కనడం, వాటిని నిజం చేసుకోవడానికి కష్టపడడం’ అనే కాన్సెప్ట్ కూడా రొటీన్‌గా ఉన్నా.. కీర్తి సురేష్ వంటి అగ్ర నటితో చేయడం ద్వారా హైప్ క్రియేట్ చేయగలిగారు. అయితే సినిమా ఆసాంతం దానిని కొనసాగించలేకపోయారు.రొటీన్‌గా ఉన్న కథను.. ఆసక్తికరంగా మలచడంలో డైరెక్టర్ తడబడ్డాడు..తలనొప్పి తెప్పిచ్చాడు..ఆ తలనొప్పి తట్టుకోడానికీ చాలాసార్లు టీ అవసరం పడుతుందని ప్రూవ్ చేసాడు. ఈ సినిమా థియేటర్లలో విడుదల కాకపోవడం చాలామందికి అదృష్టం గానే మారిందని చెప్పాలి.