పక్కా స్క్రిప్టుతో ఓ సినిమా సెట్స్‌పైకి వస్తుందంటే ఆ సినిమాకి తిరుగుండదు అని అంటోంది కత్రినాకైఫ్…బాలీవుడ్లో అగ్ర కథానాయికగా కొనసాగుతోంది కత్రినా. ఏళ్ల తరబడి నటిస్తున్నా ఇప్పటికీ ఆమె హవా కొనసాగుతూనే ఉంది. ఈ మధ్యే ఆమె సల్మాన్‌ఖాన్‌తో కలిసి నటించిన ‘భారత్’ విజయం సాధించింది. ఇప్పుడు కత్రినా నిర్మాతగా కొత్త బాధ్యతను మోయడానికి సిద్ధమవుతోంది.
‘‘అవును గొప్ప సృజనాత్మక కథల్ని తెరపైకి తీసుకురావడం గురించి ఎప్పుడెప్పుడు నిర్మాతని కావాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అంటోంది కత్రిన.
‘‘కొత్త కథతో తీస్తున్నాం అనే మాట ఈ మధ్య చిత్ర పరిశ్రమలో సర్వసాధారణమైపోయింది. కానీ సరికొత్త కథతోనే నా నుంచి చిత్రాలు రావాలని కోరుకుంటున్నాను. పక్కా స్క్రిప్టుతో ఓ సినిమా సెట్స్‌పైకి వస్తుందంటే ఆ సినిమాకి తిరుగుండదు. ఇప్పుడు చిత్ర పరిశ్రమలో ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. నటిగా కూడా అలాంటి బౌండెడ్ స్క్రిప్టు కోసమే నేను చూస్తాను. వినూత్నమైన ఆలోచనలతో చాలామంది దర్శకులొస్తున్నారు. అన్ని కథలకు వెండితెరపై అవకాశం దక్కకపోవచ్చు. అలాంటి వాటికి డిజిటల్ మీడియా ఓ వరమనే చెప్పాలి. డిజిటల్ మీడియా ద్వారా ఎంతోమందికి తమ ప్రతిభను చాటుకునే అవకాశం దక్కుతుంది.’’అని చెప్పింది కత్రినా.
షారుఖ్‌ఖాన్ ‘జీరో’, సల్మాన్‌ఖాన్ ‘భారత్’ చిత్రాల్లో నటించి ఎన్నో విషయాలు తెలుసుకున్నానంటోంది కత్రినా. ‘‘జీరో’, ‘భారత్’…ఈ చిత్రాల్లో నేను పోషించిన పాత్రలు నాలోని కొత్త నటిని ప్రేక్షకులకు పరిచయం చేశాయి. అన్నింటికంటే సంతోషకరమైన విషయం ఏంటంటే.. ‘జీరో’తో ఆనంద్ ఎల్ రాయ్ లాంటి సృజనాత్మక దర్శకుడితో పనిచేసే అవకాశం దక్కడం. ‘భారత్’ కథ విన్న వెంటనే ఓకే చెప్పేశాను. అనుకున్నట్టుగానే ఆ సినిమా విజయం సాధించింది. అలాంటి కథల కోసమే ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటాను’’అంటోంది కత్రిన. ఆమె ప్రస్తుతం అక్షయ్‌కుమార్‌తో ‘సూర్యవంశీ’లో నటిస్తోంది.
ఆముగ్గురితో కలిసి డిన్నర్ చేయాలని…
ఆ మధ్య ఓ ఆంగ్ల మీడియా సంస్థ ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూలో పాల్గొన్నారు కత్రినా, సల్మాన్ ఖాన్. ఈ సందర్భంగా ‘ఒక వేళ అవకాశం వస్తే బతికున్న వారిలో లేదా.. చనిపోయిన వారిలో కానీ ఏ ముగ్గురితో కలిసి డిన్నర్ చేయాలని భావిస్తున్నార’ని ప్రశ్నించారు. అందుకు కత్రినా ‘మార్లిన్ మన్రో, నరేంద్ర మోదీ, కాండోలిజా రైస్’ అని సమాదానం చెప్పింది.
‘అదేంటి సల్మాన్‌తో డిన్నర్ చేయాలని కోరుకోవడం లేదా’ అని ప్రశ్నిస్తే.. ‘ఇంత వరకూ నేను సల్మాన్‌తో డిన్నర్ చేయలేదు. ఎందుకంటే అతను బయట భోజనం చేయడ’ని చెప్పింది కత్రినా కైఫ్. వెంటనే సల్మాన్ స్పందిస్తూ.. ‘6.30 గంటలకు కత్రినా డిన్నర్ పూర్తవుతుంది. ఆ టైంకి నేను లంచ్ చేస్తాను. కాబట్టి కత్రినతో డిన్నర్ చేయడం కుదరద’ని అన్నాడు. ‘మరి మీరు ఎవరితో డిన్నర్ చేయాలనుకుంటున్నార’ని సల్మాన్‌ను అడగ్గా.. ‘నేను, నాకు, నాతో’ అంటూ భిన్నంగా స్పందించాడు సల్మాన్. అంతేకాక ‘నాకు కుటుంబంతో కలిసి భోజనం చేయడం అలవాటు’ అన్నారు. అయితే సల్మాన్ సమాధానం నచ్చని కత్రినా.. ‘కనీసం మహాత్మ గాంధీ, మదర్ థెరిస్సా, నెహ్రూ వీరిలో అయినా ఎవరో ఒకరిని సెలక్ట్ చేసుకోమ’ని కోరింది.అందుకు సల్మాన్ ‘వారితో కలిసి భోజనం చేయడానికి ఇంకా చాలా టైం ఉంద’న్నాడు.