కార్తికేయ కొత్త చిత్రం ఒంగోలు షెడ్యూల్‌ !

‘ఆర్‌ ఎక్స్ 100 ’ ఫేమ్‌ కార్తికేయ… హీరోగా జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, స్ప్రింట్‌ టెలీ ఫిలిమ్స్‌ సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి నిర్మాతలు. అర్జున్‌ జంధ్యాల దర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ 17నుంచి ఒంగోలులో ప్రారంభంకానుంది.
హీరో కార్తికేయ మాట్లాడుతూ “మా ‘ఆర్‌ ఎక్స్ 100’ విడుద‌లైన త‌ర్వాత చాలా క‌థ‌లు విన్నాను. వాటిలో నాకు అర్జున్ జంధ్యాల చెప్పిన క‌థ బాగా న‌చ్చింది. బెస్ట్ స్టోరీ టు టెల్ అనిపించింది. వెంట‌నే ఓకే చెప్పేశాను. మంచి రోజు చూసి ముహూర్తం షాట్ తీశాం. నేటి నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌ర‌గ‌నుంది. షూటింగ్ లొకోష‌న్‌లోకి ఎప్పుడెప్పుడు వెళ్తానా అని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాను“ అని అన్నారు.
దర్శకుడు అర్జున్‌ జంధ్యాల మాట్లాడుతూ `‘నేను బోయ‌పాటి శ్రీనుగారి ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ‌శాఖ‌లో ప‌నిచేశాను. ఆయ‌న నాకు గురువుగారు మాత్ర‌మే కాదు. సోద‌ర స‌మానులు. కార్తికేయ‌గారు సినిమాను న‌మ్మి చేయ‌డానికి ముందుకొచ్చారు. ఆయ‌న వ‌ల్ల‌నే ఈ చిత్రం ఇంత త్వ‌ర‌గా ప‌ట్టాలెక్కింది. నిర్మాత‌లు క‌థ మీద న‌మ్మ‌కంతో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమా చేయాల‌నే ప్యాష‌న్‌తో ఉన్నారు. క‌థానుగుణంగా ఒంగోలులో కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తాం“ అని చెప్పారు.
 
నిర్మాతలు అనిల్‌ కడియాల, తిరుమ‌ల్ రెడ్డి మాట్లాడుతూ “ఈ చిత్రంతో సినిమా రంగంలో అడుగుపెడుతున్నందుకు ఆనందంగా ఉంది. నేటి నుంచి ఫిబ్ర‌వ‌రి 8 వ‌ర‌కు ఒంగోలు ప‌రిస‌రాల్లో తొలి షెడ్యూల్ చిత్రీక‌రిస్తాం. ఈ షెడ్యూల్లో కీల‌క స‌న్నివేశాల‌ను, రెండు పాట‌ల‌ను తెర‌కెక్కిస్తాం. సినిమా టైటిల్‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తాం“ అని అన్నారు
 
ఈ చిత్రానికి సంగీత దర్శకుడు: చైతన్య భరద్వాజ్‌, కెమరామెన్‌: ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ రామ్, ఆర్ట్‌ డైరెక్టర్‌ : జీయమ్‌ శేఖర్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ : శివ మల్లాల