సినీ వినోదం రేటింగ్ : 2.5/5
జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్.జి.మూవీ మేకర్స్ బ్యానర్లపై అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో అనీల్ కడియాల, తిరుమల్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.
కధ… గద్దలగుంట రాధ(ఆదిత్యమీనన్) పెద్ద రౌడీ. ఒంగోలులో అతని పేరు చెబితే అందరూ భయపడుతుంటారు. అతను సెటిల్‌మెంట్స్ చేసుకుంటూ తనకు ఎదురొచ్చిన వారిని భయపెడుతూ ఉంటాడు. ఒంగోలులో ఓ కుర్రగ్యాంగ్ అక్కడ బీచ్‌లోకి వచ్చే అమ్మాయిలను రేప్ చేసి వీడియోలు తీసి బెదిరిస్తుంటారు. గుణ(కార్తికేయ) ఓ గ్రానైట్ క్వారీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తుంటాడు. అతనికి తల్లిదండ్రులు(నరేష్, హేమ), చెల్లెలు(కౌముది) లోకం. ఓసారి గీత(అనఘ)తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారుతుంది. గుణ స్నేహితుడు(మహేశ్)కి తెలిసిన స్నేహితుడు, అతని ఫ్రెండ్స్ అమ్మాయిలను గ్యాంగ్ రేప్ చేసే బ్యాచ్. ఓ సందర్భంలో రాధకు, వారికి గొడవ అవుతుంది. రాధ మనుషులు వారిని చంపేస్తారని భయంతో సెటిల్‌మెంట్ చేయమని గుణని బ్రతిమాలుతారు. రాధతో ఉన్న పరిచయం కారణంగానే కాదు.. వారి కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని రాధను గుణ సెటిల్‌మెంట్‌కు పిలిపిస్తాడు. అయితే ఆ ఫ్రెండ్స్ గ్యాంగ్ రాధను చంపేస్తారు. గుణ జైలుకు వెళ్లి తిరిగొస్తాడు. రాగానే గీత చనిపోయిందని తెలిసి షాక్ అవుతాడు. ఇంతలో రాధ మనుషులు, గుణ మీద, అతని ఫ్యామిలీ మీద ఎటాక్ చేస్తారు. గుణ వారికి బుద్ధి చెబుతాడు. కానీ.. తన కుటుంబాన్ని రాధ మనుషుల నుండి బ్రతికించుకోవాలంటే, రాధను చంపిన హంతకులను పట్టుకోవాలనుకుంటాడు. ఆ క్రమంలో గుణ ఏం చేస్తాడు? అసలు రాధను చంపిందెవరు? గీత మరణానికి కారణం ఎవరు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
విశ్లేషణ… దర్శకుడు అర్జున్ జంధ్యాల ఒకప్పుడు తమిళంలో, తెలుగులో హిట్ అయిన ‘నాపేరుశివ’ తరహాలో ‘గుణ 369’ను మెసేజ్ ఓరియెంటెడ్‌గా మలిచాడు. యదార్థ సంఘటనల ఆధారంగా కథను సిద్ధం చేసుకున్న దర్శకుడు అర్జున్ జంధ్యాల ఆ కథను మాస్ కమర్షియల్ స్టైల్‌లో చెప్పే ప్రయత్నం చేసాడు. బోయపాటి దగ్గర పనిచేసిన అనుభవంతో మాస్, యాక్షన్ సీన్స్‌ను బాగా ప్రజెంట్ చేశాడు. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే లవ్ సీన్స్‌లో మాత్రం కాస్త తడబాటు కనిపించింది.హీరో, హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ సినిమాకు పెద్ద మైనస్. సెకండ్ హాఫ్‌ను ఎమోషనల్, యాక్షన్, సెంటిమెంట్ సీన్స్‌తో ఆసక్తికరంగా చేసాడు. ప్రస్తుతం సమాజంలో అమ్మాయిలకు ఎదురవుతున్న ఇబ్బందులను రియలిస్టిక్‌గా చూపించే ప్రయత్నం చేసిన దర్శకుడు మాస్ హీరోయిజాన్ని ఎలివేట్ చేయటంలోనూ మెప్పించాడు. ముఖ్యంగా మంచి మెసేజ్..సెకండాఫ్‌లో యాక్షన్ ఎలిమెంట్స్..క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ హైలెట్‌గా నిలుస్తాయి.