కిక్కివ్వలేదు… ’90 ఎం.ఎల్’ చిత్ర సమీక్ష

సినీవినోదం రేటింగ్: 2/5     

కార్తికేయ క్రియేటివ్ వ‌ర్క్‌ బ్యానర్ పై శేఖర్ రెడ్డి ఎర్ర రచన,దర్శకత్వంలో అశోక్‌రెడ్డి గుమ్మకొండ ఈ చిత్రాన్ని నిర్మించారు.

కధ… పుట్టుక‌తోనే దేవ‌దాస్(కార్తికేయ‌) ఆల్క‌హాల్ సిండ్రోమ్‌తో ఇబ్బందిప‌డుతుంటాడు. అత‌ను మూడు పూట‌లా మందు తాగాల‌ని, లేకుంటే అత‌ని ప్రాణాల‌కే ప్ర‌మాదం అని డాక్ల‌ర్స్ చెబుతారు. దేవ‌దాస్ మంచి వాడైనా అత‌ని స‌మ‌స్య‌ను గుర్తించ‌ని వారు…అత‌ను తాగుబోతుగా భావించి, ఉద్యోగం కూడా ఇవ్వ‌రు. ఒకసారి ప్ర‌మాదం నుండి చిన్న‌పిల్లాడిని కాపాడిన సమయంలో సువాస‌న‌(నేహా సోలంకి) ప‌రిచ‌యం అవుతుంది. ఆ ప‌రిచ‌యం క్ర‌మంగా ప్రేమ‌గా మారుతుంది. ప్రేమ‌ కోసం సువాస‌న తో.. ఆమె తండ్రి క్షుణ్ణారావు(రావు ర‌మేష్‌)తో త‌న‌ తాగుడు స‌మ‌స్య‌ను దాచి పెడ‌తాడు దేవ‌దాస్‌. అయితే, ఓసారి దేవ‌దాస్ తాగుతాడ‌ని తెలిసిపోతుంది. అప్ప‌టి నుండి సువాస‌న దేవ‌దాస్‌ను ద్వేషిస్తూ… స‌మ‌స్య‌ను చెప్ప‌డానికి దేవా ఎంత ప్ర‌య‌త్నించినా వినిపించుకోదు. ఆమె కోసం జాన్‌, శేషు, బోజా లాంటి వాళ్ల‌తో దేవ‌దాస్‌కి విరోధం ఏర్ప‌డుతుంది. చివ‌ర‌కు దేవ‌దాస్‌ స‌మ‌స్య ఎక్క‌డికి దారి తీస్తుంది? స‌మ‌స్య తీరిందా? దేవ‌దాస్ త‌న ప్రేమ‌ను ఎలా ద‌క్కించుకున్నాడు? అనే విష‌యాలు సినిమాలో చూడాలి…

విశ్లేషణ… తాగుబోతుల ఆల్క‌హాల్ పాయింట్‌ బేస్ చేసుకుని ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ రెడ్డి చేసిన సినిమా `90 ఎం.ఎల్‌`. మందు తాగకుంటే ప్రాణాలు పోయే వ్యాధి వున్న హీరోని తీసుకొని ..ప్రేమతో ముడిపెట్టి కొత్తగా చెప్పాలనుకున్నప్పటికీ..స్క్రీన్ ప్లే కొత్తగా లేకపోవడం ప్రధాన బలహీనత. ద‌ర్శ‌కుడు దీన్ని పూర్తి ఎంట‌ర్‌టైన్‌మెంట్ యాంగిల్‌లో తెర‌కెక్కించ‌లేదు. మ‌ధ్యలో హీరోయిజం యాడ్ చేయ‌డం వ‌ల్ల సినిమా రొటీన్ ఫైట్స్‌..పాట‌ల చుట్టూనే తిరిగింది. ఈ సినిమాలో కామెడీ ఉంది కానీ.. చెప్పుకోదగ్గదిగా లేదు. హీరోకు అసాధార‌ణమైన నియ‌మాలున్న కుటుంబంలోని అమ్మాయిని హీరోయిన్‌గా చూపించారు. అయితే ,కుటుంబ నేప‌థ్య స‌న్నివేశాలు లేకుండా సినిమా సాగుతుంది. ఇక్క‌డక్కడ కొన్ని కామెడీ సీన్స్ ఆక‌ట్టుకున్నా.. సినిమా మాత్రం ఆస‌క్తిక‌రంగా లేదు. పాతకాలపు పద్ధతిలో ఒక పాట.. ఫైట్ మధ్యలో కామెడీ అన్నట్లుగా సినిమా నడిపించారు. హీరో చేసే ఫైట్స్ కి బలమైన కారణం లేకపోవడం వలన కనెక్ట్ కావు.
 
నటవర్గం… తాగుబోతుగా కార్తికేయ త‌న పాత్ర‌కు న్యాయం చేశాడు. యాక్షన్ సన్నివేశాలు.. కామెడీ టైమింగ్..ఎమోషనల్ సన్నివేశాలలో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశాడు. ఫిజియో థెరఫిస్ట్ గా నేహా సోలంకి అందంగా…సెకండ్ హాఫ్ లో ప్రేమకు- కుటుంబానికి మధ్య నలిగిపోయే అమ్మాయిగా ఎమోషనల్ సన్నివేశాలలో ఆకట్టుకుంటుంది. రావుర‌మేశ్ ఎప్ప‌టిలాగానే రొటీన్ ఫాద‌ర్ గా న‌టించాడు. స‌త్య‌ప్ర‌కాశ్ సాఫ్ట్ క్యారెక్ట‌ర్‌లో ఆక‌ట్టుకున్నాడు. విల‌న్‌గా నటించిన ర‌వికిష‌న్ కొత్తగా ట్రై చేశాడు. త‌న‌దైన న‌ట‌న‌తో కాసేపు ప్రేక్ష‌కుల‌ను నవ్వించే ప్ర‌య‌త్నం చేశాడు. ప్ర‌భాక‌ర్‌, అదుర్స్ ర‌ఘ, అజ‌య్,ప్రగతి ,రోల్ రైడర్ బాగా చేసారు.
 
అనూప్ రూబెన్స్ సంగీతం గొప్ప‌గా ఏమీ లేదు. అనూప్ రూబెన్స్ పాటలు ఒకమాదిరిగా .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో నిరాశ పరిచారు. యువ‌రాజ్ సినిమాటోగ్ర‌ఫీ ఓకే. ఎస్‌.ఆర్‌.శేఖ‌ర్‌ ఎడిటింగ్ పూర్తిగా నిరాశ పరుస్తుంది. ఈ తరహా సినిమాలు నిడివి తక్కువ ఉన్నప్పుడే ఆకట్టుకుంటాయి -రాజేష్