సినీవినోదం రేటింగ్ : 2/5
లైట్ హౌస్ మూవీ మేకర్స్, ప్రిన్స్ పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై రజత్ రవిశంకర్ దర్శకత్వం లో ఠాగూర్ మధు, ఎస్.లక్ష్మణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
కధాంశం…
దేవ్(కార్తి) తన మనసుకు నచ్చినట్లు ఉంటూ తనకు నచ్చిన ప్రదేశాలకు వెళుతుంటాడు. ఫ్రీలాన్స్ ఫోటో జర్నలిజం చేస్తుంటాడు. అతనికి విఘ్నేష్(ఆర్.జె.విఘ్నేష్‌కాంత్), నిషా(అమృత) ప్రాణ స్నేహితులు. ముగ్గురు కలిసి తిరుగుతుంటారు. విఘ్నేష్ కారణంగా దేవ్ పేస్‌బుక్‌లో ఒకరికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపుతాడు. అది మేఘన(రకుల్ ప్రీత్ సింగ్) అని తర్వాత తెలుస్తుంది. తండ్రి తన తల్లిని విడిచి పెట్టి వెళ్లిపోవడంతో చిన్నప్పుడు ఎన్నో కష్టాలు పడ్డ మేఘన పాతికేళ్ల వయసులో తన కష్టంతో బిజినెస్ ఉమెన్ స్థాయికి ఎదుగుతుంది. ఆమెను ప్రేమించడానికి దేవ్ చాలా కష్టపడతాడు. ముందు దేవ్ అంటే పెద్దగా ఆసక్తి చూపని మేఘన తర్వాత అతన్ని ప్రేమిస్తుంది. ఓ కారణంగా మేఘనతో దేవ్ మాట్లాడలేకపోతాడు. దాంతో మేఘన తనను దేవ్ నిర్లక్ష్యం చేస్తున్నాడనుకుని అతనితో గొడవపడి వెళ్లిపోతుంది. దేవ్ ఎంత నచ్చచెప్పినా మేఘన వినిపించుకోదు.దేవ్‌కు పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. దాని వల్ల దేవ్ ఎలాంటి పరిస్థితిని ఫేస్ చేశాడు? దేవ్, మేఘన ఒక్కటయ్యారా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ…
వైవిధ్యమైన కథా చిత్రాలను చేస్తున్న హీరో కార్తి రోడ్ జర్నీని ఎంజాయ్ చేసే యువకుడిగా మరో తరహా పాత్ర ఈ చిత్రం లో చేసాడు. దర్శకుడు రజత్ రవిశంకర్ ఆ ఎమోషన్‌ను తెరపై ఆవిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యాడు.ముఖ్యంగా దేవ్ కోసం రజత్ ఎంచుకున్న కథనం ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసేలా లేదు. రొటీన్ స్టోరీ ..దానికి తోడు ఫ్లాట్ నరేషన్ సినిమాను బోరింగ్ గా మార్చేశాయి. సినిమా సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమాలో లవ్ సీన్స్‌లో ఇన్‌టెన్సిటీ కనపడదు. రొమాన్స్, అడ్వంచర్, ఫ్రెండ్‌షిప్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా చేసుకున్న దర్శకుడు.. ఆ కథను తెర మీదకు తీసుకురావటంలో ఫెయిల్ అయ్యాడు. కథనం ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసేలా లేదు.దర్శకుడు కథ, పాత్రల స్వభావాల మీద కన్నా లుక్స్, రిచ్‌నెస్, లొకేషన్స్ మీదే ఎక్కువగా దృష్టిపెట్టినట్టుగా అనిపిస్తుంది.అలాగే క్లైమాక్స్ కూడా సరిగ్గా తెరకెక్కించలేకపోయాడు.
నటవర్గం…
కార్తి తనకు అలవాటైన పాత్రలో ఈజీగా చేసాడు. పాత్రకు తగ్గట్టు బరువు తగ్గాడు. లుక్ పరంగా కొత్తగా కనపడే ప్రయత్నం చేశాడు. రోడ్ జర్నీని ఎంజాయ్ చేసే యువకుడిగా.. ప్రేయసి కోసం తాపత్రయ పడే వ్యక్తిగా తన పాత్రకు న్యాయం చేశాడు.ఎమోషనల్ సన్నివేశాల్లో ఆయన నటన చాలా బాగుంది. మేఘన పాత్రకు రకుల్ కరెక్ట్ గా సెట్ అయ్యింది. రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పటి వరకు చేయని పాత్ర .. కాస్త సీరియస్‌గా సాగే పాత్రలో న్యాయం చేసింది. వారి ఇద్దరి జోడి బాగుంది.ఇక హీరో స్నేహితుడిగా నటించిన విఘ్నేష్, అమృత పాత్రలు నామ మాత్రం. ఇక హీరో తండ్రిగా నటించిన ప్రకాష్‌రాజ్, హీరోయిన్ తల్లిగా నటించిన రమ్యకృష్ణ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేదు. అంత నటన చేయగలిగే నటులను అలాంటి ప్రాధాన్యం లేని పాత్రలకు ఎందుకు తీసుకున్నారనేది పెద్దప్రశ్న?
సాంకేతికవర్గం…
హేరిస్ జైరాజ్ సంగీతంలో పాత ట్యూన్స్‌నే వింటున్నట్టుగా అనిపించింది. హరీస్ జైరాజ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు .వేల్ రాజ్ సినిమాటోగ్రఫీ సినిమా కు రిచ్ లుక్ తీసుకొచ్చాయి. అలాగే లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి.ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే ఎవరెస్టు ఎపిసోడ్ విజువల్స్ ఆకట్టుకుంటాయి.అంథోని ఎల్ రూబెన్ఎడిటింగ్ లో కొన్ని సన్నివేశాలను కట్ చేస్తే బాగుండేది -రాజేష్