ఎందరో ప్రతిభావంతులు.. వాళ్లతో సినిమాలు తీస్తా!

‘‘నా కొత్త నిర్మాణ సంస్థను జనవరిలో మొదలు పెట్టడానికి పనులు జరుగుతున్నాయి. ముందుగా చిన్న సినిమాలను నిర్మించాలనే ఆలోచనలో ఉన్నాం. ఇప్పటికే కథలను సిద్ధం చేస్తున్నాం. నా వద్దకు వచ్చే ప్రతి కథలో నేను నటించడం కుదరకపోవచ్చు… కానీ మంచి కథలు వెండితెరపై రావాల్సిన అవసరం ఉంది. ప్రతిభావంతులు చాలా మంది ఉన్నారు. వాళ్లతో సినిమాలు తీస్తా. నా ప్రొడక్షన్‌లో నేను నటించాలనుకోవడం లేదు. అలాగే మా సంస్థను డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లోనూ విస్తృతపరచాలనుకుంటున్నాం. ఇక నా దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా గురించిన ప్రకటన త్వరలోనే వస్తుంది. ‘థాకడ్‌’ సినిమా తర్వాతే దర్శకత్వంపై నేను పూర్తిగా దృష్టి పెడతాను’’.. అని కంగనా రనౌత్‌ తెలిపారు. ‘మణికర్ణిక ఫిల్మ్స్‌’ అనేది కంగనా రనౌత్‌ నిర్మాణ సంస్థ పేరు అని బాలీవుడ్‌ సమాచారం.
 
‘జయలలితకు తనకు సారూప్యత ఉంద’ని… బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ అంటున్నారు. సంచలన నటిగా తరచూ వార్తల్లో ఉండే కంగనా బాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా రాణిస్తున్నారు. ఇటీవల చారిత్రాత్మిక చిత్రం ‘మణికర్ణిక’లో ఝాన్సీరాణిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ‘తలైవి’ అనే పేరుతో తెరకెక్కనున్న జయలలిత బయోపిక్‌లో త్వరలో ఆమె నటించబోతున్నారు. ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో రూపొందనుంది. విజయ్‌ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంపై హైప్‌ క్రియేట్‌ కావడానికి కారణం… జయలలిత పాత్రలో కంగనా నటించడమే. ఈ చిత్రంలో ‘అమ్మ’గా మారడానికి కంగనా కూడా కష్టపడుతున్నారు. జయ పాత్ర కోసం ఇటీవల అమెరికాలో మేకప్‌ టెస్ట్‌ చేయించుకున్న కంగనా భరతనాట్యంలో శిక్షణ కూడా పొందుతున్నారు. జయలలితలా తెరమీద కనిపించేందుకు ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటున్నారు.
 
మా మధ్య స్వారూప్యం చాలానే ఉంది
ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి కోవై వచ్చిన కంగనా మీడియాతో కాసేపు ముచ్చటించారు. తాను నటిస్తున్న జయలలిత బయోపిక్‌ రెండు భాగాలుగా తెరకెక్కనుందని ఆమె తెలిపారు. మధ్య తరగతి కుటుంబంలో పుట్టి, యుక్త వయసులోనే సినీరంగప్రవేశం చేసిన జయలలిత.. సిని ఇండస్ట్రీలో పురుషాధిక్యతను ఎదుర్కొని పలు విజయాలను అందుకున్నారని చెప్పారు. తానూ ఆమె మాదిరేనని, కాబట్టి తమ మధ్య స్వారూప్యం చాలానే ఉందని తెలిపారు. జయలలిత విజయవంతమైన రాజకీయ నాయకురాలిగా మాత్రమే కాకుండా చాలా శక్తిమంతమైన మహిళగా జీవించారని ప్రశంసించారు. భాషలో పరిణితి, భరతనాట్యం వంటి పలు విషయాల్లో ప్రతిభావంతురాలైన జయలలిత పాత్రలో నిజాయితీగా నటించాలని తాను కోరుకుంటున్నానని తెలిపారు. అందుకోసం తమిళ భాషను కూడా నేర్చుకుంటున్నట్లు కంగనా వెల్లడించారు. రాజకీయ నేపథ్యంతో ఉన్న చిత్రాల్లో నటిస్తున్నా.. నిజజీవితంలో రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి లేదని కంగనా రనౌత్‌ స్పష్టం చేశారు.