రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకూ వెనుకాడను !

కంగనా రనౌత్‌ … ఇప్పటికే నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈమె త్వరలోనే దర్శకత్వ శాఖలోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతున్నారు. సినిమాలు, దర్శకత్వం మాత్రమే కాదు.. త్వరలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు తాను వెనుకాడబోనని ఆమె స్పష్టం చేశారు…
 
కంగనా ఇటీవల ముంబైలో జరిగిన ‘ప్లాటినమ్‌ వోగ్‌’ ఆవిష్కరణ వేడుకలో పాల్గొన్నారు. ‘షోస్టాపర్‌’గా ఈ కార్యక్రమంలో ర్యాంప్‌వాక్‌ చేసిన కంగనా ఈ సందర్భంగా  మీడియాతో ముచ్చటించారు….
రాజకీయాల్లోకి వచ్చేందుకు సుముఖమేనా? అని  అడిగితే…  రాజకీయాల్లోకి వచ్చే వయస్సు తనకు రాలేదని, అంత రాజకీయ పరిజ్ఞానం కూడా తనకు లేదని పేర్కొన్నారు. అయితే, సమయం వస్తే దేశం కోసం ఏం చేసేందుకైనా వెనుకాడబోనని ఆమె అన్నారు. ‘దేశానికి ఏదైనా ఆపద వస్తే.. ప్రాణాలు అర్పించైనా రక్షించేందుకు సైనికులు సదా సిద్ధంగా ఉంటారు. అదేవిధంగా దేశానికి నా అవసరం వస్తే.. రాజకీయాల్లోకి రావడమే కాదు.. దేశం కోసం ప్రాణాలు అర్పించేందుకైనా సిద్ధంగా ఉంటాను’ అని ఆమె అన్నారు. అంతకుముందు ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీని కంగనా ప్రశంసించిన సంగతి తెలిసిందే. ‘ప్రజాస్వామ్యంపై విశ్వాసం కలిగిన నాయకుడు’ ఆయన అని ఆమె పేర్కొన్నారు.
మనందరం రోబోటిక్‌గా మారిపోయామేమో ?
‘‘లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌’ అనే కాన్సెప్టే ఉండదు. అదంతా పెద్ద ట్రాష్‌. ఈ ఆన్‌లైన్‌ ప్రేమలు ఎలా వర్కౌట్‌ అవుతాయో అస్సలు అర్థమే కాదు’’ అంటున్నారు కంగనా రనౌత్‌.
లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌ అంటే ఏంటో అర్థం కాదు.మనది ప్రేమ లేఖలు రాసే జనరేషన్‌ కాదు.. యూ ట్యూబ్‌ జనరేషన్‌. కానీ ఒక మనిషి గురించి తెలియకుండా, అతన్ని కలవకుండా ఆన్‌లైన్‌లో ఎలా ప్రేమించుకుంటారు? మన లైఫ్‌లో రిలేషన్‌షిప్స్‌ మీద కూడా ఇంటర్‌నెట్‌ ప్రభావం చూపించడం బాధగా ఉంది. మనందరం రోబోటిక్‌గా మారిపోయామేమో అనిపిస్తోంది. ఫ్యూచర్‌లో మనం కూడా మెకానికల్‌ అయిపోయి మెషిన్స్‌లా బిహేవ్‌ చేస్తామేమో అనిపిస్తోంది’’ అని పేర్కొన్నారామె.