బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్‌కు బంధుప్రీతి ఎక్కువని, తను పరిచయం చేసిన హీరోహీరోయిన్ల గురించే ఎక్కువగా మాట్లాడుతుంటారని కంగన రనౌత్ సోదరి రంగోలీ సోషల్ మీడియా ద్వారా విమర్శించింది. ఇటీవల జరిగిన `కాఫీ విత్ కరణ్` కార్యక్రమం రాపిడ్ ఫైర్ రౌండ్లో బెస్ట్ హీరోయిన్ ఎవరని అడుగుతూ కరణ్… ‘దీపిక’, ‘ఆలియా’, ‘అనుష్క శర్మ’ పేర్లు మాత్రమే ప్రస్తావించాడు. ఇందులో కంగన పేరు లేకపోవడాన్ని ఓ నెటిజన్ ప్రశ్నించాడు.
“ఉత్తమ కథనాయికల జాబితాలో కంగన పేరును కరణ్ చేర్చలేదు. ఎందుకంటే వీరి కంటే ‘కంగన బెస్ట్ హీరోయిన్’ అని కరణ్‌కు తెలుసు. అంతేగా?” అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు కంగన సోదరి రంగోలి స్పందించింది…. `మూవీ మాఫియా అంటే ఇదే. పలు జాతీయ అవార్డులు అందుకున్న నటీమణి గురించి కరణ్ మాట్లాడరు. వెండితెరకు తను పరిచయం చేసిన స్టార్ల పిల్లల గురించి మాత్రమే మాట్లాడతార`ని రంగోలి ట్వీట్ చేసింది.
నాపై కొందరు మానసికంగా దాడి చేశారు !
మణికర్ణిక సినిమాతో దర్శకురాలిగా తన ప్రతిభను కంగనా రనౌత్ నిరూపించుకున్నారు. అంతేకాదు రూ. 100 కోట్ల క్లబ్లో ఈ సినిమా చేరడంతో చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇదిలా ఉంటే కంగనా మరోసారి తన నోటికి పని చెప్పారు. దర్శకుడు క్రిష్‌పై తన విమర్శలకు మరింత పదును పెట్టారు. క్రిష్ డైరెక్షన్లో వచ్చిన ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమా గురించి మాట్లాడుతూ.. కలెక్షన్ల విషయంలో వెనకబడిందని చదివాను. క్రిష్‌పై ఎంతో నమ్మకంతో సినిమా అప్పగించిన బాలకృష్ణ సర్‌ను చూస్తుంటే బాధగా ఉంది. కానీ మణికర్ణిక విషయంలో నన్ను రాబందుల్లా పీక్కుతున్న వారందరినీ ప్రశ్నించే సమయం నాకొచ్చింది. ‘మణికర్ణిక’ నిర్మాణ పరంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పుడు.. దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నందుకు నాపై కొందరు మానసికంగా దాడి చేశారు. బాధకరమైన విషయం ఏంటంటే… మణికర్ణిక లాంటి యోధురాలి సినిమా విషయంలో క్రిష్‌తో పాటు పెయిడ్ మీడియా దుష్ప్రచారానికి దిగాయి. నిజాయితీగా చెప్పొచ్చేదేమంటే… “ఇలాంటి కృతఘ్నుల కోసమా స్వాతంత్ర్య సమరయోధులు రక్తం చిందించారన్న విషయమే నన్ను బాధపెడుతోంది’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఆమె వ్యక్తిత్వం నాకెంతో ఇష్టం !
బాలీవుడ్ బోల్డ్ `క్వీన్` కంగనా రనౌత్‌కు సీనియర్ హీరోయిన్ కరీనా కపూర్ మద్దతుగా నిలిచింది. బాలీవుడ్లో బంధుప్రీతి ఎక్కువని, తనకు ఎవరూ మద్దతుగా నిలవడం లేదని కంగన ఇటీవల ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన తన `మణికర్ణిక` సినిమా గురించి ఎవరూ స్పందించకపోవడాన్ని కంగన జీర్ణించుకోలేకపోయింది. బాలీవుడ్ ప్రముఖులపై వరుసగా విమర్శలు చేసింది. ఈ నేపథ్యంలో కంగనకు మద్దతుగా కరీనా కపూర్ మాట్లాడడం ఆసక్తికరంగా మారింది.
`కంగన ధైర్యవంతమైన మహిళ. అద్భుతమైన నటి. ఆమె వ్యక్తిత్వం నాకెంతో ఇష్టం. చాలా తెలివైన మహిళ. ఎవరి అండదండలూ లేకుండానే ఈ స్థాయికి ఎదగడం గొప్పవిషయమ`ని కరీనా ప్రశంసించింది.`కంగన నటించిన `మణికర్ణిక` సినిమా చూసారా?` అని జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు కరీనా స్పందిస్తూ.. `నేను ఇంకా ఆ సినిమా చూడలేదు. కానీ, సైఫ్ ఆ సినిమా చూసి ప్రశంసించార`ని కరీనా చెప్పింది