`దిల్` నుండి ఇటీవల విడుదలైన `ఫిదా` వరకు ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు ఓ సెన్సేషనల్ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఆ చిత్రమే `ఇండియన్ 2 `. 21 ఏళ్ల క్రితం విడుదలై తెలుగు, తమిళనాట బ్లాక్ బస్టర్ చిత్రంగా బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టిన చిత్రం `భారతీయుడు` అందరికీ గుర్తుండే ఉంటుంది. సమాజంలో లంచానికి వ్యతిరేకంగా పోరాడే ఓ స్వాతంత్ర సమరయోధుడి కథతో రూపొందిన `భారతీయుడు` చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ శంకర్ అద్భుతంగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ భారతీయుడుగా సినీ ప్రేక్షకులను తన నటనతో మెప్పించారు. ఇప్పుడు కమల్ హాసన్, శంకర్ల హిట్ కాంబినేషన్లో భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా `ఇండియన్ 2` భారీ బడ్జెట్ సినిమాను దిల్‌రాజు తన నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్‌పై నిర్మించనున్నారు.
ఈ సందర్భంగా…హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ – “మా బేనర్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన సంగతి తెలిసిందే. మా ప్రయత్నాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తూ వస్తున్నారు. ఇప్పుడు వారు మా బేనర్‌పై ఉంచిన నమ్మకంతో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ `ఇండియన్ 2` సినిమాను నిర్మించబోతున్నాం. హై టెక్నికల్ వేల్యూస్‌తో కాంటెంపరరీ పాయింట్‌తో ఈ సీక్వెల్ రూపొందనుంది. మా నిర్మాణ సంస్థలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రమిది. స్టార్ డైరెక్టర్ శంకర్‌గారు సినిమాను డైరెక్ట్ చేస్తారు. శంకర్‌గారు ప్రస్తుతం సూపర్‌స్టార్ రజనీకాంత్ `2.0`తో బిజీగా ఉన్నారు. ఆ సినిమా పూర్తైన వెంటనే, మా `ఇండియన్ 2` మొదలవుతుంది. మొదటి భాగంగా వచ్చిన `భారతీయుడు` సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాను మించేలా `ఇండియన్ 2`ను తెలుగు, తమిళ భాషల తో పాటు ఇతర భాషల్లో నిర్మించబోతున్నాం. సినిమాలో నటించబోయే నటీనటులు, సాంకేతిక వివరాలను త్వరలోనే తెలియజేస్తాం“ అన్నారు.