స్వగ్రామంలో క‌మ‌ల్ హాస‌న్ పుట్టినరోజు వేడుక‌లు

క‌మ‌ల్ హాస‌న్ బ‌ర్త్‌డే వేడుక‌ల‌తో పాటు 60 ఏళ్ళ‌సినీ ప్ర‌స్థానానికి జ్ఞాప‌కంగా మూడు రోజుల వేడుక నిర్వ‌హించ‌నున్నారు .క‌మ‌ల్ పుట్టిన రోజు నేడు కావ‌డంతో ఆయ‌న స్వగ్రామం పర‌మ‌క్కుడికి కుటుంబ స‌భ్యులంతా త‌ర‌లి వెళ్ళారు. క‌మ‌ల్ త‌న తండ్రి శ్రీనివాస‌న్ విగ్రహాన్ని ప‌ర‌మ‌క్కుడిలో ఆవిష్క‌రించ‌నున్నారు. ఇక న‌వంబ‌ర్ 8న తిరిగి చెన్నైకి రానున్న క‌మ‌ల్ హాస‌న్ త‌న సినీ గురువు కె. బాల‌చంద‌ర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ చేయ‌నున్నారు.
 
శృతి హాస‌న్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తండ్రికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపింది. “హ్యాపీ బ‌ర్త్‌డే బాపూజీ..60 ఏళ్ళ సినిమా జ‌ర్నీ చేసిన మీకు ఈ బ‌ర్త్‌డే ఎంతో ప్ర‌త్యేకం. పుట్టిన రోజు నాడు మ‌న స్వ‌గ్రామానికి వ‌చ్చాం. ఫుల్ వేడుక చేసుకుందాం. మీ జీవితంలో మేము భాగమ్యం అయినందుకు చాలా ఆనందంగా ఉంది. లవ్‌ యూ లాట్స్‌ పప్పా” అంటూ శృతి త‌న తండ్రికి శుభాకాంక్ష‌లు తెలిపారు. క‌మ‌ల్ బ‌ర్త్ వేడుక‌లలో శృతిహాస‌న్, అక్ష‌ర హాస‌న్, చారు హాస‌న్, సుహాసిని, శివాజీ గ‌ణేష‌న్ త‌న‌యుడు ప్ర‌భు పాల్గొన‌నున్నారు.’లోక‌నాయ‌కుడు’ క‌మ‌ల్ ప్ర‌స్తుతం ‘భార‌తీయుడు 2’ చిత్రంతో బిజీగా ఉన్నారు.
బాల న‌టుడిగా జాతీయ ఉత్త‌మ న‌టుడి అవార్డు
కమల్ హాసన్ నటుడిగా 60 ఏళ్ల క్రితం ‘కలత్తూర్ కన్నమ్మ’ సినిమాతో నటుడిగా ప్రస్థానాన్ని మొదలుపెట్టారు . మొద‌టి సినిమాలోనే బాల న‌టుడిగా జాతీయ ఉత్త‌మ న‌టుడి అవార్డు అందుకున్నాడు. బాలనటుడిగా శివాజీగణేశన్, ఎంజీఆర్,జెమినీ గణేషన్ వంటి తమిళ అగ్రనటులతో కలసి పనిచేశాడు. తెలుగులో ‘అంతులేని కథ’,‘మరో చరిత్ర’ సినిమాలతో గుర్తింపు ల‌భించింది. ‘స్వాతి ముత్యం’, ‘సాగర సంగమం’,‘ఇంద్రుడు చంద్రుడు’ వంటి సినిమాల్లో మూడు నంది అవార్డులను అందుకున్న ఏకైక పరభాష నటుడిగా కమల్ హాసన్ రికార్డు సాధించాడు. ‘ద‌శావ‌తారం’ చిత్రంలో ప‌ది పాత్ర‌ల‌లో క‌నిపించి మెప్పించిన క‌మ‌ల్ త‌న‌కి సాటి మ‌రెవ‌రు లేర‌ని నిరూపించాడు.
మ‌హేష్ బాబు శుభాకాంక్ష‌లు
క‌మ‌ల్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా అభిమానులు, సినీ సెల‌బ్రిటీలు ఆయ‌న‌కి సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌త్యేక జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. తాజాగా ‘సూప‌ర్ స్టార్’ మ‌హేష్ బాబు త‌న ట్విట్ట‌ర్‌లో క‌మ‌ల్‌కి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. “సినిమాకు మీ సహకారం అసాధారణమైనది … సినిమాల్లో 60 అద్భుతమైన సంవత్సరాలు పూర్తి చేసినందుకు అభినందనలు. ఇది నిజంగా ఉత్తేజప‌రిచే విష‌యం. మీరు ఆనందం మరియు ఆరోగ్యంతో ఉండాలని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నాను” అని మ‌హేష్ పేర్కొన్నారు.