2013లో విశ్వనటుడు కమల్‌హాసన్ స్వీయ నిర్మాణ, దర్శకత్వంలో తెరకెక్కించి, నటించిన ‘విశ్వరూపం’ సీక్వెల్‌ను స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తీవ్రవాదం నేపథ్యంతో తెరకెక్కించిన ‘విశ్వరూపం’ అత్యంత వివాదాస్పద పరిస్థితుల నడుమ విడుదలైన విషయం తెలిసిందే. ఆ వెంటనే రెండో భాగాన్ని విడుదల చేయాలని కమల్ భావించినా, ఆర్థికపరమైన ఇబ్బందులు కారణంగా ఆలస్యం జరిగింది. దాంతో కమల్ కూడా ఇతర ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు.
చివరగా ఆయన చేపట్టిన ‘శభాష్ నాయుడు’ ప్రాజెక్టు మధ్యలో ఆగిపోవడంతో మళ్లీ ‘విశ్వరూపం-2’ను పట్టాలెక్కించారు. ఈ చిత్రాన్ని స్వయంగా విడుదల చేయాలని కమల్ నిర్ణయించారు. మిగిలిన షూటింగ్ కూడా పూర్తి చేసి, ఇటీవలే సెన్సార్‌కి పంపారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ‘విశ్వరూపం-2’ ఆగస్టు 15న విడుదలవుతుంది. తమిళంతోపాటు తెలుగు, హిందీ భాషల్లోను ఒకేరోజు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో కమల్‌తోపాటు ఆండ్రియా, పూజాకుమార్, నాజర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించగా, గిబ్రన్ సంగీతం అందించారు.