సినీ వినోదం రేటింగ్ : 3/5
రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై లోకేష్ కనగరాజ్ రచన, దర్శకత్వం లో కమల్ హాసన్, ఆర్.మహేంద్రన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు విడుదల: శ్రేష్ఠ్ మూవీస్.
కధ… భారీ స్థాయిలో డ్రగ్స్‌ను పట్టుకున్న పోలీస్ ఆఫీసర్ ప్రభంజన్‌ను ఓ ముఠా చంపేస్తుంది. అలానే అతని తండ్రి కర్ణణ్ (కమల్ హాసన్)ను కూడా చంపేస్తుంది. ఇలా వరుస హత్యలు జరుగుతుంటే..వారిని పట్టుకునేందుకు పోలీసు డిపార్ట్మెంట్ అండర్ కవర్ ఆఫీసర్, స్పై ఏజెెంట్, స్లీపర్ సెల్ కి చెందిన అమర్ (ఫాహద్ ఫాజిల్) కి ఈ కేసును అప్పగిస్తుంది. అయితే అమర్ ఈ కేసును చేదించే క్రమంలో కర్ణన్ గురించి ఆరా తీస్తుంటాడు. ఈ డ్రగ్స్ మాఫియా వెనకున్న సంతానం (విజయ్ సేతుపతి) గురించి తెలుసుకుంటాడు. అయితే అందరూ అనుకుంటున్నట్టుగా కర్ణన్ చచ్చిపోలేదు. అసలు కర్ణన్ వెనుకున్న కథ ఏంటి? ఏజెంట్ విక్రమ్ ఎవరు? అతను ఈ డ్రగ్స్ మాఫియాను ఎందుకు అరికట్టాలని చూస్తాడు? ఈ క్రమంలో విక్రమ్ తన మనవడికి ఎదురైన పరిస్థితులు ఏంటి? తన మనవడిని ఎలా కాపాడుకున్నాడు? అనేది సినిమాలో చూడాలి …
విశ్లేషణ… కమల్‌హాసన్ , విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ లాంటి విలక్షణ నటులు కలిసి చేస్తున్న సినిమా అనగానే.. ప్రేక్షకుల అంచనాలు చాలా ఉంటాయి. దానికి ఏమాత్రం తగ్గని స్థాయిలో సినిమా చెయ్యాలంటే.. ఏ దర్శకుడికైనా కత్తిమీద సామే. అయితే లోకేష్ కనగరాజ్ అనేక లేయర్స్‌తో కూడిన ఈ కథను ఉత్కంఠభరితమైన స్క్రీన్‌ప్లేతో నడిపించడంలో సఫలీకృతుడయ్యాడు. కమల్ హాసన్, విలన్ విజయ్ సేతుపతి, కీలకమైన పాత్ర చేసిన ఫహద్ ఫాజిల్ నుంచి అద్భుతమైన నటనను రాబట్టాడు. బోర్ కొట్టని సన్నివేశాలతో.. తనదైన స్టైలిష్ నెరేషన్ తో ప్రేక్షకుల్ని ఆద్యంతం కూర్చో బెట్టేసాడు.. స్క్రీన్ ప్లే మాయాజాలంతో కట్టిపడేశాడు. థ్రిల్ చేసే ఇంటర్వెల్ బ్యాంగ్, అబ్బురపరిచే క్లైమాక్స్.. విక్రమ్ చిత్రంలో హై లైట్స్. డ్రగ్స్ మాఫియా, పోలీస్ అండర్ కవర్ ఆపరేషన్స్ చుట్టూ అల్లుకున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. ఆరంభ సన్నివేశాల్లోనే ఉత్కంఠను సృష్టించారు దర్శకుడు లోకేష్ కనకరాజ్. ఇక గత సినిమాల తాలుకు సీన్లను కూడా సరైన స్థానంలో ప్లేస్ చేశాడు. డిల్లీ పాత్రను చూపించకపోయినా ఆ రిఫరెన్స్ వాడుకున్నాడు. అలా తన ఖైదీ, మాస్టర్ సినిమాల టాపిక్‌ను ఇందులోకి తీసుకొచ్చాడు.
నటీనటులు… ఈ యాక్షన్ థ్రిల్లర్ కథకు కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ వంటి వారు అద్భుతంగా సూట్ అయ్యారు. ఇక కమల్ హాసన్ నటన గురించి కొత్తగా చెప్పేది ఏముంటుంది. కర్ణన్ పాత్రలో జీవించారు. కొడుకు మరణంతో సంఘర్షణకులోనయ్యే తండ్రిగా, ఏజెంట్ విక్రమ్‌గా తనదైన అద్భుత నటనతో ఆకట్టుకున్నారు. ఇక కమల్ హాసన్ యాక్షన్ సీక్వెన్స్‌లో చూపించిన యాటిట్యూడ్ అదిరిపోయింది. అమర్ పాత్రలో ఫాహద్ ఫాజిల్ అద్భుతంగా నటించేశాడు. మ్యానరిజం, స్టైలీష్ యాక్షన్లతో దుమ్ములేపేశాడు. సినిమా ఫస్ట్హాప్ను మొత్తం తనదైన సెటిల్డ్ పర్ఫార్మెన్స్తో నడిపించాడు. విజయ్ సేతుపతి ప్రతినాయకుడు సంతానంగా క్రూరమైన విలనీ పండించాడు. ఇది అతని కెరీర్లో మరో వైవిధ్యమైన పాత్రగా మిగిలిపోతుంది. ఇక క్లైమాక్స్ లో సూర్య మాఫియా డాన్స్ రోలెక్స్ పాత్రలో కనిపించి.. ఈ సినిమాకి తాను కూడా ఓ ప్రధాన పాత్రనే అని గుర్తు చేస్తాడు. అలాగే.. చంబన్ వినోద్ జోస్, నరేన్, అర్జున్ దాస్ నటన మెప్పిస్తాయి.
సాంకేతికం… అనిరుధ్ ఎంతో శ్రద్ధ పెట్టి నేపథ్య సంగీతాన్ని ఇచ్చినట్టు అనిపిస్తుంది. స్టైలీష్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో కమల్ హాసన్‌ను ఇంకా స్టైలీష్‌గా చూపించాడు. యాక్షన్ సీక్వెన్స్‌ల్లో అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మార్క్ కనిపిస్తుంది. అన్బరివ్ కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ స్టైలీష్ గా, పవర్ ఫుల్‌గా ఉన్నాయి. సంభాషణలు కొన్ని హార్ట్‌కు టచ్ అయ్యేలా ఉంటాయి. “మంచి చేయాలన్నా కూడా ముసుగు వేసుకుని చేయాల్సి వస్తోంది”.. అనే డైలాగ్ అద్భుతంగా అనిపిస్తుంది. గిరీష్ గంగాధరణ్ కెమెరా పనితనం ఈ సినిమా కి హైలెట్. ఎడిటింగ్ కూడా బాగుంది – రాజేష్