పాత సెంటిమెంట్ తో ఆకట్టుకోని……’విజేత’ చిత్ర సమీక్ష

                                               
                                              సినీవినోదం రేటింగ్ : 2.5/5
వారాహి చలనచిత్రం పతాకం పై రాకేష్‌ శశి దర్శకత్వం లో రజని కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు
 
కధలోకి వెళ్తే ….
శ‌్రీనివాస‌రావు(ముర‌ళీశ‌ర్మ) స్టీల్ ఫ్యాక్టరీలో ఉద్యోగి. పెద్ద స్టిల్ ఫోటోగ్రాఫ‌ర్‌గా పేరు తెచ్చుకోవాల‌నుకున్న శ్రీనివాస‌రావు కుటుంబ ప‌రిస్థితుల కార‌ణంగా జీవితంతో రాజీ పడిపోతాడు. శ్రీనివాస‌రావుకి కొడుకు, కూతురు ఉంటారు. కొడుకు రామ్‌(క‌ల్యాణ్ దేవ్‌) ఇంజ‌నీరింగ్ చ‌దివినా ఎలాంటి బాధ్య‌త లేకుండా తిరుగుతుంటాడు. రామ్ ఎదురింట్లో జైత్ర‌(మాళ‌వికా నాయ‌ర్‌) అద్దెకు వ‌స్తారు. జైత్రను రామ్ ఇంప్రెస్ చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తుంటాడు. ఈవెంట్ మేనేజ్‌మెంట్ ప్లానింగ్ స్టార్ట్ చేసిన రామ్‌కి..ప్రారంభంలో త‌ప్పులు జ‌రిగి చెడ్డ పేరు వ‌స్తుంది. అదే స‌మ‌యంలో శ్రీనివాస‌రావుకి గుండెపోటు వ‌స్తుంది. శ్రీనివాస‌రావు త‌ను లేక‌పోతే త‌న కుటుంబం ఏమైపోతుందోన‌ని బాధ‌ప‌డుతుంటాడు. అది చూసిన శ్రీనివాస‌రావు స్నేహితుడు(త‌నికెళ్ల‌భ‌ర‌ణి).. రామ్‌కి శ్రీనివాస‌రావు గురించి నిజం చెప్పి.. కుటుంబానికి తోడుగా నిల‌బ‌డ‌మ‌ని అంటాడు. రామ్ కూడా అప్పటి నుండి దారి మార్చుకుని తండ్రికి స‌హాయ పడాలనుకుంటాడు. కొడుకుగా రామ్ శ్రీనివాస‌రావు క‌ల‌ను ఎలా తీర్చాడ‌నేది తెలియాలంటే సినిమాలో చూడాల్సిందే….
విశ్లేషణ ….
మెగా ఫ్యామిలీ హీరోను వెండితెరకు పరిచయం చేసే బాధ్యతను తీసుకున్న దర్శకుడు రాకేష్‌ శశి … ఇప్పటికే చాలా సినిమాల్లో వచ్చిన ‘తండ్రీ కొడుకుల అనుబంధం’ నేపథ్యం కధాంశంగా ఈ చిత్రం చేసారు. సున్నితమైన మధ్య తరగతి కుటుంబ కథ ఇది. అయితే..బలమైన పాత్రలతో, సన్నివేశాలతో, భావోద్వేగాలతో నిండిన ఈ కథతో పాటే ప్రేక్షకుడు ప్రయాణించేలా చేయలేకపోయాడు దర్శకుడు. కథ చాలా పాతదే అయినా నేటి తరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు మలిచే అవకాశముంది. అయితే కథనంలో చెప్పుకోదగ్గ మలుపులే లేకుండా.. సినిమా అంతా మనం ఊహించినట్టే నడుస్తుంది. వినోదాత్మకంగా నవ్వించే సీన్‌ కానీ, హృదయానికి హత్తుకునే సందర్భం కానీ లేదు. సన్నివేశాలు బలంగా లేవు . మొదటి భాగంలో లవ్ ట్రాక్ పర్వాలేదనుకుంటే, రెండవ భాగంలో లవ్ ట్రాక్ ను వదిలేసారు. హీరోహీరోయిన్ల ప్రేమ సన్నివేశాలపై ఇంకాస్త వర్క్ చేసుంటే బాగుండేది. అత‌ని ఫ్రెండ్స్ మ‌ధ్య వచ్చే కామెడీ కూడా ఎఫెక్టివ్‌గా లేదు.సంభాష‌ణ‌లు అక్క‌డ‌క్క‌డా బావున్నాయి. తండ్రి కొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్‌ సీన్స్‌, క్లైమాక్స్‌ బాగున్నాయి.’ఫార్ములా, ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాకు మినిమం గ్యారంటీ’ అనే అతి నమ్మకం తో తీసిన సినిమా ఇది.
 
నటీనటులు….
ఈ చిత్రం తో వెండితెరకు పరిచయం అయిన కల్యాణ్ దేవ్‌ పరవాలేదనిపించాడు. తొలి సినిమా కాబ‌ట్టి త‌న నుండి ఎక్కువగా ఆశించ‌లేం. అయితే ఇంకాస్త బెట‌ర్‌గా చేసుండ‌వ‌చ్చు. ఇక సినిమాకు ముర‌ళీశ‌ర్మ న‌ట‌నే హైలైట్‌గా నిలిచింది. బంధాలు బాధ్యతల మధ్య నలిగిపోయే తండ్రిగా మురళీ శర్మ అద్భుతంగా నటించాడు. తన ప్రతిభతో పాత్రని మెప్పించేలా చేసాడు. క్లయిమాక్స్‌ సీన్‌లో ఎమోషన్స్‌ బాగా పండించాడు. మాళ‌వికా నాయ‌ర్ పేరుకు హీరోయిన్ కానీ… ఆ పాత్ర‌లో న‌ట‌న‌కు పెద్ద‌గా స్కోప్ లేదు.
ఇక జ‌య‌ప్ర‌కాశ్‌, త‌నికెళ్ల‌భ‌ర‌ణి, రాజీవ్‌ కనకాల , ప్ర‌గ‌తి బాగా న‌టించారు. హీరో ఫ్రెండ్స్‌గా సుదర్శన్‌, నోయల్‌, కిరిటీ, మహేష్‌లు ఫస్ట్‌ హాఫ్‌లో కాస్త నవ్వించారు.
సాంకేతిక వర్గం ….
సెంథిల్ కెమెరా ప‌నిత‌నం గురించి మ‌నం కొత్త‌గా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అతని సినిమాటోగ్రఫి సినిమాకు మరో ప్లస్‌ పాయింట్‌. హర్షవర్దన్‌ రామేశ్వర్‌ అందించిన సంగీతం బాగుంది. పాటల్లో ముఖ్యంగా ‘కొక్కొరొకో’ సాంగ్ బాగా ఆకట్టుకుంటుంది. అలాగే ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సాంగ్ కూడా మంచి ఫీల్ ఇస్తుంది. ఎమోషనల్‌ సీన్స్‌కు నేపథ్య సంగీతం మరింత ప్లస్‌ అయ్యింది. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ బాగుంది -రవళి